చిత్తశుద్ధితోనే ఉక్రెయిన్‌ శాంతి | Russia Ukraine war is approaching five years | Sakshi
Sakshi News home page

చిత్తశుద్ధితోనే ఉక్రెయిన్‌ శాంతి

Nov 14 2026 4:12 AM | Updated on Nov 14 2026 4:12 AM

Russia Ukraine war is approaching five years

వెనకుండి యుద్ధాన్ని ఎగదోయటం వేరు... దానిపై నేరుగా జరిగే చర్చల్లో పాల్గొనటం వేరు. అలా చేస్తే బాధ్యతలు మీదపడతాయి. వాటిని నెరవేర్చక తప్పనిస్థితి ఏర్పడుతుంది. అయిదేళ్లు పూర్తికావస్తున్న రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంపై జరిగే రెండో విడత చర్చల్లో ఆ రెండు దేశాలతోపాటు యూరోప్‌ కూడా పాల్గొనటానికి అంగీకారం కుదిరింది. చర్చల్లో వారి భాగస్వామ్యాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వ్యతిరేకిస్తున్నారంటూ వచ్చిన కథనాలకు భిన్నంగా ఈసారి యూరోప్‌ను కూడా చేర్చటానికి రష్యా అంగీకరించింది. చర్చల్లో సహజంగానే యుద్ధంలో యూరోప్‌ పాత్ర కూడా చర్చకు వస్తుంది. ఆ దేశాలు యుద్ధం కోరుకుంటున్నాయో, శాంతిని వాంఛిస్తున్నాయో తేటతెల్లం కావటానికి అవకాశం ఏర్పడుతుంది. వాస్తవానికి యుద్ధం ప్రారంభించింది రష్యా కాదు. 2014లో ఉక్రెయిన్‌లో అంతర్యుద్ధంగా మొదలైన ఆ ఘర్షణలోకి లాంఛనంగా 2022 ఫిబ్రవరిలోఆ దేశం ప్రవేశించింది. 

ప్రచ్ఛన్నయుద్ధం పరిసమాప్తమయ్యాక 90వ దశకం మొదట్లో అప్పుడే కొత్తగా ఏర్పడిన రష్యా ఫెడరేషన్‌కు నాటో కూటమి ఒక విస్పష్టమైన హామీ ఇచ్చింది. తాము తూర్పు దిశగా ‘ఒక్క అంగుళం’ కూడా ముందుకు రాబోమన్నదే దాని సారాంశం. కానీ అందుకు భిన్నంగా 2004లో రష్యా సరిహద్దుల్లోని బాల్టిక్‌ దేశాలైన ఈస్తోనియా, లాత్వియా, లిథుయేనియాలను నాటో చేర్చుకుంది. 2008లో ఉక్రెయిన్, జార్జియాలను ఆహ్వానించింది. ఈ ప్రయత్నం ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దారితీసే ప్రమాదమున్నదని రష్యాలో అప్పటి అమెరికా రాయబారి విలియమ్‌ బర్న్స్‌ ఆనాడే తన ప్రభుత్వానికి హెచ్చరిక సందేశం పంపారు. 

వికీలీక్స్‌ పత్రాల్లో ఇది బయటపడింది. నాటో విస్తరణకు ప్రయత్నిస్తే అది ‘వినాశకరమైన తప్పిదం’ అవుతుందని 1977లో సోవియెట్‌పై అమెరికా విధాన రూపశిల్పిగా వ్యవహరించిన జార్జి కెనన్‌ హెచ్చరించారు. ఇంతటి అత్యంత సున్నితమైన, ప్రమాదకరమైన అంశంలో యూరోప్‌ దేశాలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. నాటో కూటమి ఇచ్చిన హామీకి సైతం ఎగనామం పెట్టి ఉక్రెయిన్‌ను ఉసి గొల్పాయి. తీరా అంతా తారుమారు కావటంతో సాయం కోసం అమెరికా వైపు చూశాయి.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన విక్టర్‌ యనుకోవిచ్‌ ప్రభుత్వాన్ని 2014లో కుట్రపూరితంగా కూలదోసి, పాశ్చాత్య అనుకూల కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో యూరోప్‌ దేశాలూ, వాటివెనకున్న అమెరికాలదే బాధ్యత. స్వతంత్రదేశంగా నాటోలో చేరాలో, వద్దో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉక్రెయిన్‌కి ఉండకూడదా అనేవాళ్లున్నారు. కానీ ఈ మాదిరే మెక్సికో లేదా కెనడా రష్యాతో చెట్టపట్టాలేసుకుంటే అమెరికా మౌనంగా ఉంటుందా?  1962లో క్యూబాలో సోవియెట్‌ అణుక్షిపణి మోహరించినప్పుడు అమెరికా సహించగలిగిందా? దాన్ని తొలగించేదాకా ఊరుకుందా? 

అబూదాబి చర్చల్లో యుద్ధ ఖైదీల మార్పిడికి అంగీకారం కుదిరింది. యూరోపియన్, నాటో కూటమి దూతల్ని కలవడానికి అక్కడ రష్యా నిరాకరించటం, అటు తర్వాత యూరోప్‌ చర్చల్లో పాల్గొనటానికి తాము వ్యతిరేకం కాదని పుతిన్‌ చెప్పడం ఆ దేశాల్లో భయాందోళనలు రేకెత్తించాయి. నాటో కొత్తగా ఏ దేశాన్నయినా చేర్చుకోరాదనీ, తూర్పు ప్రాంతంలోవున్న తమ దళాలనూ, అక్కడున్న సైనిక సామగ్రిని ఉపసంహరించాలనీ రష్యా కోరే ప్రమాదం ఉన్నదని అవి అనుమానిస్తున్నాయి. నిజానికి ఈ రెండూ గొంతెమ్మ కోర్కెలేమీ కాదు. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనటానికి యూరోప్‌ దేశాలు ఇంతవరకూ చేసిన ప్రతిపాదనంటూ ఏమీ లేదు. ఉక్రెయిన్‌లోని డోన్బాస్‌ ప్రాంతంలోనూ, మరోరెండుచోట్లా రష్యా సేనలు వైదొలగాలన్నదే వాటి డిమాండ్‌. 

అన్నిటికీ ఒప్పుకుని రష్యా ఉపసంహరించుకుంటే ‘భవిష్యత్తులో రష్యానుంచి ముప్పురాకుండా’ ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇవ్వొచ్చన్నది వాటి ఎత్తుగడ. ఇందుకు బదులు ప్రచ్ఛన్నయుద్ధ పరిసమాప్తి తర్వాత రష్యాకిచ్చిన హామీ ఏమిటో గుర్తుతెచ్చుకుని విజ్ఞత ప్రదర్శించటం యూరోప్‌ దేశాలకే మంచిది. రెండు రోజులపాటు డబ్లిన్‌లో జరిగిన యూరోప్‌ శిఖరాగ్ర సమావేశంలో తమ తరఫున రెండో దశ చర్చల్లో పాల్గొనే ప్రతినిధిని ఎంపిక చేసుకోవటంలో అవి విఫలమయ్యాయి. ఇప్పటికైనా చిత్తశుద్ధి ప్రదర్శిస్తే ఉక్రెయిన్‌ శాంతి సాధ్యపడుతుంది. ఆలస్యమైనకొద్దీ లబ్ధిపొందేది రష్యానే అని యూరోప్‌ దేశాలు గుర్తుంచుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement