తలపెట్టినవేవీ కొనసాగక ఎటూ చూసినా నిరాశే అలుముకున్న తరుణంలో తుర్కియే లోని అంతాల్యాలో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్) 31 సదస్సు సోమవారం మొదలైంది. ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో పన్నెండు రోజులు జరిగే ఈ సదస్సు ఏం సాధిస్తుందన్న నిర్లిప్తత అందరిలోనూ ఉంది. దశాబ్దం క్రితం పారిస్‌లో కర్బన ఉద్గారాల తగ్గింపుపై కుదిరిన చరిత్రాత్మక ఒడంబడికను ఆ మరుసటేడాదినుంచే బేఖాతరు చేయటం మొద లెట్టిన చాలా దేశాలు అదే ధోరణిలో పోతున్నాయి.
అమెరికా అయితే మొత్తానికే జారు కుంది. వాస్తవానికి ఈ కాప్ సదస్సులు కొత్తగా చేసే తీర్మానాలేమీ ఉండవు. పారిస్ ఒడంబడికలో పూచీ పడిన ఉద్గారాల తగ్గింపు లక్ష్యసాధనలో ఎవరేం సాధించారో సమీక్షించటం, త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరడం మాత్రమే వాటి పరమోద్దేశం. ఈసారి దాదాపు 200 దేశాల నుంచి ప్రతినిధి బృందాలొచ్చాయని ఘనంగా ప్రకటిస్తున్న సమితి... ఒక విషయం దాస్తున్నది.
2023లో దుబాయ్‌లో జరిగిన కాప్ 28 సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ రాజు చార్లెస్, అప్పటి ఆ దేశ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, జర్మనీ అప్పటి చాన్సలర్ ఒలాఫ్ షొల్జ్‌వంటి 156 దేశాల ప్రభుత్వా ధినేతలు హాజరయ్యారు. ఇప్పుడా సంఖ్య 91 దాటదని తుర్కియే ముందే ప్రకటించింది. ఒకపక్క పారిశ్రామిక దేశాలు తమ కర్బన ఉద్గారాలను తగ్గించాలని సమితి మొత్తుకుంటుంటే... జీ7 నుంచి కేవలం బ్రిటన్ ప్రధాని బర్న్‌హామ్, కాలుష్యకారక దేశాల్లో తొలి స్థానంలో ఉన్న చైనానుంచి ఉపాధ్యక్షుడు హాన్ ఝెంగ్ రాబోతున్నారు.
ఒకనాడు పర్యావరణ ముప్పుపై ప్రపంచ దేశాలన్నీ ఒకే స్వరం వినిపించాయి. ఏదో ఒకటిచేసి ఈ గండంనుంచి గట్టెక్కాలన్న తపన, తాపత్రయం వాటిలో కనబడ్డాయి. ప్రమాదకర వాతావరణం ఇప్పుడు జోస్యంకాదు. చేదు వాస్తవం. తీరా ఇప్పుడెవరికీ దానిపై పట్టింపు లేకుండాపోయింది. ఈసారి మండువేసవికి యూరోప్ దేశాల్లో దరిదాపు 50,000 మంది మరణించారని అంచనా. నేపాల్‌లో సంభవించిన హఠాత్ వరదల్లో వేలాదిమంది మరణించారు. వందలాదిమంది ఆచూకీ లేకుండాపోయారు.
తమకు 500 కోట్ల డాలర్ల నష్టం జరిగిందని నేపాల్ చెబుతోంది. కనీవినీ ఎరుగని సూపర్ ఎల్‌నినో వేయినాల్కలు సాచి, ఇండొనేసియాలో దావానలానికి కారణమైంది. కాలిఫోర్నియా తీరం వేడిగాలులతో మాడిపోతోంది. వర్షాభావం, కుంభవృష్టి, హఠాత్ వరదలు ఆహార ధాన్యాల దిగుబడిని దెబ్బతీస్తున్నాయి. భూగర్భ జలాలు పాతాళంలోకి పడిపోయాయి. వాటిపై సంపన్న దేశాలకు పట్టింపులేదు. ఇరాన్‌ను పాదాక్రాంతం చేయడానికి ట్రంప్... ఉక్రెయిన్‌ను దారికి తెచ్చుకునేందుకు పుతిన్... గాజాను తుడిచి పెట్టేయడానికి ఇజ్రాయెల్ పథక రచన చేస్తున్నాయి. వీటికి వేరే దేశాలు లోపాయికారీగా ఆజ్యం పోస్తున్నాయి.
అయితే సంక్షోభాలు కూడా ఊహించని మేలు కలిగిస్తాయి. పారిస్ ఒడంబడిక లక్ష్యాల సాధనలో నిర్లిప్తంగా ఉండిపోయిన దేశాలు పశ్చిమాసియా యుద్ధంతో ఇంధన సరఫరా నిలిచి ఊపిరాడని స్థితికి చేరాయి. అవన్నీ ఇప్పుడు పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టిసారించాయి. 40కి పైగా దేశాలు పవన, సౌర విద్యుత్ ఉత్పాదనపైనా, కర్బన ఉద్గారాలు తక్కువుండే ఇతర రకాల విద్యుత్ వనరులకు సంబంధించిన సాంకే తికతలపైనా పనిచేస్తున్నాయి. 2030 నాటికి 100 గిగావాట్ల పవన, సౌర విద్యుత్ ఉత్పాదన సాధించాలన్న లక్ష్యంతో 74,700 కోట్ల డాలర్ల బృహత్తర పథకం తీసుకు రాబోతున్నట్టు దక్షిణ కొరియా ప్రకటించింది.
బ్రిటన్, ఫిలిప్పీన్స్‌లలో పైకప్పు సౌరశక్తి ప్యానెళ్లకు గిరాకీ ఏర్పడింది. డేటా సెంటర్లకు కావాల్సిన 60 శాతం విద్యుత్‌ను స్వచ్ఛ ఇంధన వనరులనుంచి సాధించే ప్రణాళికను థాయ్‌లాండ్ ఆచరణలోకి తెచ్చింది. హరిత ఇంధన వనరులపై చర్చించేందుకు 60 దేశాలు తమకు తాముగా ఇటీవల శ్రీలంకలో సమావేశమయ్యాయి.
ఏకగ్రీవమైతేనే తీర్మానం అమలయ్యే ఐక్యరాజ్యసమితి సదస్సుల తీరుపై అవి గుర్రుగా ఉన్నాయి. నిరుడు జరిగిన బెలూమ్ కాప్ సదస్సులో శిలాజ ఇంధన వనరుల్ని క్రమేపీ తగ్గించుకోవాలన్న తీర్మానాన్ని చమురు దేశాలు వ్యతిరేకించటంతో అది కాస్తా మూలన బడింది. ఇప్పుడున్న భౌగోళిక రాజకీయ స్థితిగతులైనా అంతాల్యా సదస్సులో అందరి కళ్లూ తెరిపిస్తే మంచిదే.


