కూటమికి ఇదే కౌంట్‌డౌన్‌! | Sakshi Editorial on Andhra Pradesh Politics by Vardhelli Murali | Sakshi
Sakshi News home page

కూటమికి ఇదే కౌంట్‌డౌన్‌!

Nov 8 2026 12:57 AM | Updated on Nov 8 2026 12:57 AM

Sakshi Editorial on Andhra Pradesh Politics by Vardhelli Murali

జనతంత్రం

రాజదండం చేతిలో వుంటే చాలు, దాన్ని మంత్రదండంగా మార్చి ఎన్నికల ప్రక్రియను అబ్రకదబ్రగా ఏమార్చవచ్చని తెలుగుదేశం పార్టీ అధినేతలు నిరూపించారు. వారి కీర్తి కిరీటంలోకి మరో కలికితురాయి వచ్చి చేరింది. నామినేషన్ల దగ్గర్నుంచి ఓట్ల లెక్కింపు దాకా అన్ని దశలనూ మసిపూసి మారేడు కాయలు చేయవచ్చని వారు ఆచరణాత్మకంగా నిరూపించారు. అక్కడో ఇక్కడో కొన్ని అక్రమాలు జరగడం అనేది కొత్త విషయం కాకపోవచ్చు. కానీ రాష్ట్ర వ్యాపితంగా అన్ని ప్రాంతాల్లో ఎక్కడికెయ్యది ప్రస్తుతమో అక్కడికి ఆ వ్యూహాన్ని అమలు చేసిన సృజనాత్మక ఓట్ల దోపిడీ విన్యాసాన్ని మాత్రం ఇప్పుడు ఏపీలోనే చూసి తరించవలసి వచ్చింది.

రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం అధికార పార్టీ ఎలక్షన్‌ వార్‌రూమ్‌ మాదిరిగా నిస్సంకోచంగా పని చేయడాన్ని ఈవిధంగా గతంలో చూడలేదు. ప్రతిపక్షం విమర్శలకూ, విజ్ఞప్తులకూ ఇటువంటి బెల్లంకొట్టిన రాయి ప్రతిస్పందననూ మునుపెన్నడూ చూసి ఉండలేదు. కనిపించే ఖాకీదుస్తుల మీద కనిపించని పసుపు రంగు కండువాలను కూడా పలుప్రాంతాల్లో చూడవలసి వచ్చింది. ఆ ప్రాంతాల్లో పోలీసులు అధికార పార్టీ కార్యకర్తలవలే గెలుపే ధ్యేయంగా చీకటి యుద్ధాలకు తెగ బడ్డారు. లెక్కింపులో ప్రతిపక్ష అభ్యర్థి ముందంజలో ఉంటే ఓట్లు మాయం చేసైనాసరే అధికార అభ్యర్థిని గెలిపించడానికి వీరకంకణాలు ధరించిన అధికార బృంద మాగధులు కూడా ఈ ఎన్నికల సందర్భంలో దర్శనమిచ్చారు.

పట్టణ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల అక్రమాలను గ్రామీణ ప్రాంతాల్లో తలదన్నేశారు. చివరకు బ్యాలెట్‌ బాక్సును కూడా దారి మళ్లిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ఘటనలు వెలుగు చూశాయి. ఈ దుర్మార్గాన్ని అడ్డుకున్నందుకు వైసీపీ నేత అప్పి రెడ్డిపైనే నాన్‌–బెయిలబుల్‌ కేసులు పెట్టి పోలీసులు ప్రభుభక్తిని ప్రదర్శించారు. ఎన్నికల సంఘం జారీచేసిన పాస్‌లు చేతిలో ఉన్నప్పటికీ అనేక ప్రాంతాల్లోకి అనుమతించలేదు. ఇక ఆసెంటర్లలో అధికార పార్టీకి అడ్డే లేకుండా పోయింది. ప్రతిపక్ష పార్టీ ముఖ్యనాయకులందరినీ హౌస్‌ అరెస్ట్‌ చేసి ఇళ్లలో కూర్చోబెట్టారు.

పోలింగ్‌ సందర్భంగా జరిగిన అక్రమాలు, రిగ్గింగ్‌ వగైరాలు షరా మమూలే, పురపాలక ఎన్నికల తీరే. ఎన్నికలసంఘం ప్రకటించిన పోలింగ్‌ సరళి వివరాలు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వీటిని అధికార పార్టీ అధికార పత్రిక ఈనాడు ప్రముఖంగా ప్రకటించింది. గడిచిన యాభయ్యేళ్ల ఎన్నికల్లో పోలింగ్‌ సరళి గమనిస్తే, సాధారణంగా ఉదయం పూట పెద్ద ఎత్తున ఓటర్లు వస్తారు. మధ్యాహ్నం ఒకటి నుంచి మూడుగంటల వరకు కొంత తక్కువగా వస్తారు. మళ్లీ సాయంత్రం చివరి గంటలో పోలింగ్‌ ముమ్మరిస్తుంది. మొన్నటి ఎంపీటీసీ, జడ్‌పీటీసీ పోలింగ్‌ను ఒకసారి గమనించండి.

ఉదయం ఏడు గంటల నుంచి 9 గంటల వరకు 11.71 శాతం పోలింగ్‌ జరిగింది. తొమ్మిది నుంచి పదకొండు గంటల మధ్య 9.41 శాతం ఓట్లు పడి పోలింగ్‌ 21.12 శాతానికి పెరిగింది. మధ్యాహ్నం ఒంటిగంటకు 30.50 శాతం ఓటింగ్‌ జరిగినట్టు ప్రకటించారు. అంటే ఈ రెండు గంటల్లో 9.38 శాతం ఓట్లు పడ్డాయి. మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్‌ శాతం 58.55కు పెరిగింది. ఈ మిట్ట మధ్యాహ్నం రెండు గంటల్లో 28.05 శాతం ఓట్లు పోలయ్యాయని ప్రకటించారు. ఐదు గంట లకు 67.24 శాతంగా తేలింది. మూడు గంటల నుంచి ఐదుగంటల మధ్య ఉదయం పూట కొనసాగిన సరళిలోనే 8.69 శాతం పోలింగ్‌ జరిగింది.

కోటిన్నర ఓట్లు పోలయినట్టు చెబుతున్నారు. అందులో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్య రెండు గంటల్లో 28.05 శాతం ఓట్లు పోలయ్యాయి. 42 లక్షల పైచిలుకు మంది ఆ రెండు గంటల్లో ఓట్లు వేశారు. ఆ లెక్కన మొత్తం 31,460 పోలింగ్‌ కేంద్రాలను సరాసరి విభజిస్తే ఒక్కోకేంద్రంలో 134 మంది ఓటేసినట్టు తేలుతుంది. పోలింగ్‌ బూత్‌లో ప్రవేశించిన ఓటరు తన ఐడీ కార్డును చూపెట్టి, ఓటర్ల జాబితా తనిఖీలో నిర్ధారించుకొని, ఇంకో టేబుల్‌ దగ్గర వేలుకు సిరాచుక్క పెట్టించుకొని, మూడో టేబుల్‌ ఉద్యోగి రెండు బ్యాలెట్‌ పేపర్లను వివరించి, వాటిని మడతేసి ఇస్తే తీసుకొని మరో టేబుల్‌ దగ్గర సంతకం చేసి, ఆ తర్వాత చాటుకు వెళ్లిరెండు వేర్వేరు బ్యాలెట్లలో తాను వేయాల్సిన అభ్యర్థులను గుర్తించి ఓట్లు వేసి రెండు బాక్సుల్లో వేసిపోవడానికి ఈ మధ్యాహ్నం సమయంలో ఒక నిమిషం కంటే తక్కువ సమ యమే పట్టింది. సరిగ్గా 53 సెకన్లు మాత్రమే. సహజంగా ఓటర్లు ఎక్కువగా ఉండే ఉదయం సాయంత్రం వేళల్లో మాత్రం ఒక్కో ఓటర్‌కు రెండున్నర నిమిషాలకంటే ఎక్కువ సమయమే లభించి నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇటువంటి విడ్డూరాలు ఈ ఎన్నికల్లో చాలా కనిపించాయి. 

స్థానిక ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై విపక్షం విమర్శలకు కూటమి పెద్దలు సాధికారికమైన సోదాహరణమైన సమాధా నాన్ని ఇప్పటిదాకా చెప్పలేకపోయారు. వితండ వాదనతోఖండించడం, లేదంటే జగన్‌ హయాంలో కూడా అక్రమాలు జరిగాయని ఎదురుదాడి చేయడాన్నే కూటమిగానీ, యెల్లో మీడియాగానీ ఆశ్రయించింది. జగన్‌ హయాంలో వైసీపీ తరపున పెద్ద సంఖ్యలో ఏకగ్రీవంగా ఎన్నికవడం నిజమే. రెండు మునిసి పాలిటీలు మినహా మొత్తం పురపాలక సంఘాలను, నగర పాలక సంఘాలను వైసీపీ గెలుచుకున్న మాట కూడా వాస్తవమే. అన్ని జిల్లా పరిషత్తులనూ క్లీన్‌ స్వీప్‌ చేసిన సంగతీ యధార్థమే.

కానీ ఇప్పుడు జరిగినట్టుగా నాడు నామినేషన్‌ పత్రాలను చించివేయడాన్ని చూశామా? ప్రతిపక్ష అభ్యర్థులను పోలీసులే తరిమేయడాన్ని చూశామా? రిగ్గింగ్‌ దృశ్యాలను చూడగలి గామా? అలా జరిగివుంటే యెల్లో మీడియా ఇల్లెక్కి గోల చేసి ఉండేది కాదా? బ్యాలెట్‌ బాక్స్‌లను హైజాక్‌ చేయడాన్ని అప్పుడు చూశామా? గెలుపొందినట్టు ప్రకటించిన ప్రతిపక్ష అభ్యర్థులను వెంటనే ఓడిపోయినట్టు ప్రకటించడం నాడు జరిగిందా? కౌంటింగ్‌ కేంద్రాల్లోకి ప్రతిపక్ష ఏజెంట్లు రాకుండా పోలీసులు వెళ్లగొట్టారా? ఎన్నికల సంఘం పాలక పార్టీ పల్లకీని మోసిందా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి కూటమి పార్టీలుగానీ యెల్లో మీడియాగానీ సిద్ధంగా లేవు.

స్థానిక సంస్థలను గత ఎన్నికల్లో జగన్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌చేసింది కనుక ఇప్పుడు కూటమి అదే ఫలితాలు సాధించాలి. చంద్రబాబు నియోజక వర్గం కుప్పంలో ఉన్న మునిసిపాలిటీ, మండలాలను వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది కనుక పులివెందులలో దానికి ప్రతీకారం తీర్చుకోవాలి. సహజసిద్ధమైన ఎన్నికల్లో ఇది సాధ్యం కాదని భావించిన కూటమి కనీవినీ ఎరుగని అక్రమా లకు తెరతీసింది. అయినా అనుకున్న లక్ష్యం నెరవేరిందా?ఇంత జరిగినా, పులివెందులలో జగన్‌మోహన్‌ రెడ్డి ధర్నా చేయ వలసిన పరిస్థితులు ఏర్పడినా అక్కడ రెండు జడ్‌పీటీసీలను వైసీపీ గెలవగలిగింది. రాష్ట్రంలో మూడు మునిసిపాలిటీలతో పాటు అనంతపురం కార్పొరేషన్‌లో కూడా గెలవగలిగింది.

నగర పాలక సంస్థల్లో నమోదైన ఓట్ల శాతాలను లెక్కలోకి తీసుకుంటే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే వైసీపీ మెరుగైన ఫలితాలను సాధించింది. విశాఖ, విజయనగరం, ఏలూరు, కర్నూలు, అనంతపురంలలో ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగింది. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నాల్లో దాదాపుగా పాత శాతాన్ని నిలబెట్టుకోగలిగింది. అలవికాని అక్రమ చర్యల కారణంగా కడప, చిత్తూరు, తిరుపతిల్లో మాత్రం దాని ఓట్ల శాతంలో తగ్గుదల కనిపించింది. ఒక పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మొదటి రెండు మూడేళ్లలో జరిగే స్థానిక ఎన్నికలు సంప్రదాయంగా అధికార పార్టీకి అనుకూలంగా వస్తున్నాయి. తన పాలనపై నమ్మకం లేకపోవడం కారణం కావచ్చు. జనంలో అసంతృప్తిని గమనించడం కారణం కావచ్చు. సహజంగా రావలసిన విజయాల కోసం తెలుగుదేశం కూటమి దొంగదారిని ఎంచుకున్నది.

ప్రజల జీవన వ్యయ స్థోమత (అఫర్డబిలిటీ) పడిపోవడం, ప్రభుత్వాల్లో జవాబుదారీతనం (అకౌంటబిలిటీ) లోపించడా లకు వ్యతిరేకంగా ఇప్పుడు ప్రపంచమంతటా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. అమెరికా ప్రజలు ట్రంప్‌ పాలనను అభిశంసించింది కూడా ఈ అంశాల కారణంగానే. ఫ్రాన్స్, బ్రిటన్‌ మొదలుకొని డజన్ల కొద్దీ దేశాల్లో గత ఏడాదిగా ఉద్యమాలు తలెత్తుతున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలనుపెంచడంలో, పారదర్శక పాలన అందించడంలో నయా ఉదార వాద ప్రభుత్వాల వైఫల్యం ఇప్పుడు ప్రపంచాన్ని ఉద్యమాల యుగంగా మార్చివేసింది. ఇందుకు భారతదేశం మినహాయింపు కాదు. 

ఈ తరహా పాలనకు దేశంలోనే మొదటి ఉదాహరణఆంధ్రప్రదేశ్‌. రెండేళ్లలో నిత్యావసర ధరలు రెండింతలకు పైగా పెరిగాయి. కొనుగోలు శక్తి పడిపోయిందని ఆ ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. యువతలో ఉద్యోగితా శాతం పడిపోతున్నది. ప్రభుత్వంలో జవాబుదారీతనం లేదు. పారిశ్రామికాభివృద్ధి సాకుతో దొడ్డిదారి వసూళ్ల కోసం 99 పైసలకే భూములిస్తామని యువనాయకుడు చెబుతున్నారు. ఎవరేం చేస్తారో చేసుకోండని సవాల్‌ విసురుతున్నారు. ఇటువంటి అహంభావమే ట్రంప్‌కుశృంగభంగం చేసింది. రెండున్నరేళ్లలో వచ్చే ఎన్నికల్లో ఏపీ పాలకులకూ అదే గతి తప్పదు. ప్రపంచ గమనం ఆ రకంగానే ఉన్నది. స్థానిక ఎన్నికల్లో అణచివేతను ప్రతిఘటిస్తూ ప్రతిపక్ష కార్యకర్తలు చూపిన పోరాట స్ఫూర్తి భవిష్యత్తు చిత్రపటాన్ని మనకు స్పష్టం చేస్తున్నది.

 అక్కడో ఇక్కడో కొన్ని అక్రమాలు జరగడం కొత్త విషయం కాకపోవచ్చు. కానీ రాష్ట్ర వ్యాపితంగా ఎక్కడికెయ్యది ప్రస్తుతమో అక్కడికి ఆ వ్యూహాన్ని అమలు చేసిన సృజనాత్మక ఓట్ల దోపిడీ విన్యాసాన్ని మాత్రం ఇప్పుడు ఏపీలోనే చూసి తరించవలసి వచ్చింది.


-వర్ధెల్లి మురళి
-vardhelli1959@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement