పౌరహక్కులకు ‘సుప్రీం’ అండ | Supreme Court rules that civil rights should not be violated under any circumstances | Sakshi
Sakshi News home page

పౌరహక్కులకు ‘సుప్రీం’ అండ

Nov 7 2026 3:39 AM | Updated on Nov 7 2026 3:39 AM

Supreme Court rules that civil rights should not be violated under any circumstances

ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రాణప్రదంగా భావించే రాజ్యాంగంలోని పౌరహక్కులకు ఎట్టిపరిస్థితుల్లోనూ భంగం కలగనీయరాదని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం గురు వారం తీర్పునివ్వడం హర్షించదగ్గది. అరెస్టయిన వ్యక్తిని 24 గంటల్లోగా మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరచాలన్న రాజ్యాంగంలోని 22(2) అధికరణం, దానికి అనుగుణంగా వచ్చిన బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 58 దాదాపు అన్ని ప్రభుత్వాలూ బేఖాతరు చేస్తున్నాయి. గత రెండున్నరేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రాథమిక హక్కుల్ని భ్రష్టుపట్టిస్తున్నారు. నిర్బంధంలోకి తీసుకొనే సమయం ఒకటైతే, అరెస్టు చూపించే సమయం మరోటి. 

ఈ రెండింటిమధ్యా వ్యత్యాసం కొన్ని గంటలు కావొచ్చు, కొన్ని రోజులు కావొచ్చు, నెలలు కావొచ్చు. అటుపై బెయిల్‌ లభించినా మళ్లీ మళ్లీ అరెస్టు చేయటం కూడా సర్వసాధారణం. విషాదమేమంటే కింది కోర్టులు సైతంఈ విషయంలో మౌనంగా ఉండిపోతున్నాయి. ఈ స్థితి పోలీసులు మరింత బరితెగించ టానికి ఆస్కారమిస్తోంది. త్రిపుర, మద్రాస్, కేరళ హైకోర్టులు నిందితుల్ని హాజరుపరిచే విషయంలో ఇచ్చిన తీర్పులపైనా, చట్టాలకు అవి ఇచ్చిన భాష్యంపైనా సుప్రీంకోర్టుఅసంతృప్తి వ్యక్తం చేయటం చూస్తే దేశంలో కోర్టుల పనితీరు ఎంతగా మెరుగుపడాల్సివుందో అర్థమవుతుంది.

నిందితులకు బెయిల్‌ రాకుండా నిరోధించే ప్రత్యేక చట్టాల్లోని నిబంధనలకూ,రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకూ మధ్య సమస్య తలెత్తితే ఎప్పుడైనా రాజ్యాంగ నిబంధనలదే పైచేయి అవుతుందని ధర్మాసనం చెప్పటం ఊరటనిచ్చే అంశం. రాజ్యాంగ అధికరణం 21కింద తన కేసులో వేగవంతంగా విచారణ జరపాలని కోరే హక్కు, బెయిల్‌ కోరే హక్కు నిందితులకుంటుందనీ, ఏ చట్టమూ దాన్ని ఉల్లంఘించటానికి వీల్లేదనీ న్యాయమూర్తులు చెప్పారు. ఏ చట్టాలైనా నిర్దిష్ట నేపథ్యంలో వస్తాయి. 

మాదకద్రవ్యాల వ్యాప్తిని కట్టడి చేయటానికి తీసుకొచ్చిన మాదకద్రవ్యాలు, మానసిక స్థితిగతులపైతీవ్ర ప్రభావం చూపే పదార్థాల నియంత్రణ చట్టం(ఎన్‌డీపీఎస్‌) అయినా, ఉగ్రవాద చర్యల్నీ, వేర్పాటువాద ధోరణుల్నీ అరికట్టడానికి తీసుకొచ్చిన చట్టవిరుద్ధ కార్యకలాపాల (నియంత్రణ) చట్టం (యూఏపీఏ) అయినా, అక్రమ మార్గాల్లో డబ్బు తరలించటాన్ని నిరోధించటానికి ఉద్దేశించిన పీఎంఎల్‌ఏ అయినా అంతర్జాతీయంగా దేశాలమధ్య కుదిరిన అవగాహనల పర్యవసానంగానో, ఉగ్రవాద చర్యలు ఎక్కువైనాయనో భావించి తెచ్చినవి. 

పీఎంఎల్‌ఏలోని సెక్షన్‌ 45, ఎన్‌డీపీఎస్‌లోని సెక్షన్‌ 37ల్లోని కఠిన నిబంధనల కారణంగా బెయిల్‌ రావటం అత్యంత దుర్లభం. నిందితుడు నేరం చేయలేదని కోర్టు బలంగా నమ్మడం లేదా భవిష్యత్తులో ఎలాంటి నేరానికీ పాల్పడబోడని విశ్వసించడం బెయిల్‌ ఇవ్వడానికి ప్రాతిపదికని గతంలో సుప్రీంకోర్టు తెలిపింది. ఏ చట్టంకింద నిర్బంధించినా సకాలంలో సరైన విచారణ జరిపి శిక్షించాలన్నదే మన రాజ్యాంగమైనా, అంత ర్జాతీయ మానవహక్కుల నిబంధనలైనా చెప్పేది. కానీ నేర నిరూపణకన్నా, ఆ వంకన జరిగే విచారణ క్రమమే శిక్షగా మారుతోంది. పీఎంఎల్‌ఏ, ఎన్‌డీపీఎస్‌ చట్టాల కింద అరెస్టయిన వారితోపాటు యూఏపీఏ కేసులు ఎదుర్కొంటున్నవారికీ ఇదే జరుగుతోంది. 2018 నాటి భీమా కోరెగావ్‌ కేసు అయినా, 2020నాటి ఢిల్లీ అల్లర్ల కేసు అయినా ఇందుకు ఉదాహరణలు. 

అమల్లో ఉండే చట్టాలు ప్రభావవంతంగా లేవనుకున్నప్పుడు వాటిని సవరించటమో లేదా కొత్త చట్టాలు తీసుకురావటమో చేయటం సహజం. ఆ సందర్భంగా పార్లమెంటులో జరిగే చర్చల్లో పాలకులు వాటిని దుర్వినియోగం కానీయబోమంటారు. కానీ చట్టాల్లోఅందుకు సంబంధించిన రక్షణలుండవు. పర్యవసానంగా విచారణ పూర్తయి, విధించే శిక్షతో పోల్చినా అంతకన్నా ఎక్కువ కాలం నిందితులు జైల్లో ఉంటున్న ఉదంతాలు కోకొల్లలు. అయితే ఈ తీర్పువల్ల తక్షణం మారేదేమీ ఉండక పోవచ్చు. ఎందుకంటేఇంతక్రితం మరో ద్విసభ్య ధర్మాసనం ఇందుకు విరుద్ధమైన తీర్పునిచ్చింది. ఒకే స్వభావంగల కేసుల్లో రెండు ధర్మాసనాలు భిన్నంగా ఆలోచించాయి గనుక, విస్తృత ధర్మాసనం ముందుకు ఈ అంశం వెళ్తుంది. అక్కడ ఏం తేలుతుందన్న సంగతలా
ఉంచితే పౌరుల హక్కులకు ఛత్రంపట్టిన ఈ తాజా తీర్పు కొనియాడదగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement