సాక్షి,హైదరాబాద్: తెలంగాణ హౌసింగ్ బోర్డు ఇళ్ల రిజిస్ట్రేషన్ల వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారుల ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని అత్యున్నత న్యాయస్థానం హౌసింగ్ బోర్డును ఆదేశించింది. ఈనెల 23వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టమైన డెడ్‌లైన్ విధించింది.
లబ్ధిదారుల ఇళ్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రక్రియలను ఈ నెల 23వ తేదీలోపు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ లబ్ధిదారులు లేదా హౌసింగ్ బోర్డు ఈ ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర వ్యక్తులకు విక్రయించడానికి, బదిలీ చేయడానికి వీల్లేదని కోర్టు స్పష్టమైన షరతు విధించింది. ఈ కేసులో తుది తీర్పు వెలువడే వరకు ఎలాంటి మూడో పక్షానికి ఎలాంటి హక్కులు కల్పించవద్దని న్యాయస్థానం ఆదేశించింది.
తెలంగాణ హౌసింగ్ బోర్డు ద్వారా గతంలో ఇళ్లు పొందిన లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లు పూర్తి కాకపోవడం,దీనికి సంబంధించి వివిధ కోర్టుల్లో కేసులు నడుస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
ఒకవైపు లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని ఆదేశిస్తూనే, మరోవైపు కేసు అంతిమ తీర్పు వచ్చే వరకు ఆస్తుల క్రయవిక్రయాలపై నియంత్రణలు విధించడం ద్వారా వివాదాలకు తావు లేకుండా న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఏళ్ల తరబడి రిజిస్ట్రేషన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఊరట లభించినట్టయింది.


