సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని ఒక పాఠశాలలో తరగతి గదిలోకి అడుగుపెట్టిన కొద్దిసేపటికే 13 ఏళ్ల బాలుడు ఉన్నట్టుండి కిందపడిపోయి మరణించాడు. బాలుడి మృతికి గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్) కారణమని వైద్యులు ప్రాథమికంగా ధ్రువీకరించారు. ఇటీవలి కాలంలో పాఠశాల విద్యార్థులు ఇలా హఠాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్న విషాదకర ఘటనలు ఆందోళన రేపుతున్నాయి.
స్కూల్ ప్రిన్సిపల్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడు తన వీపుపై స్కూల్ బ్యాగ్ తగల్చుకుని క్లాస్‌రూమ్‌లోకి అడుగుపెడుతుండగా, ఒక్కసారిగా వెనక్కి వెల్లకిలా పడిపోయాడు. మొదట్లో అసలు ఏం జరిగిందో ఉపాధ్యాయుడికి, తోటి విద్యార్థులకు అర్థం కాలేదు. పరిస్థితి తీవ్రతను వారు గ్రహించే సమయానికే బాలుడు స్పృహ కోల్పోయాడు. సిబ్బంది వెంటనే అతడిని స్టాఫ్ రూమ్‌కు తరలించినప్పటికీ, అతడిలో ఎలాంటి చలనం కనిపించలేదు. పాఠశాల యాజమాన్యం వెంటనే తండ్రికి సమాచారం అందించగా, ఆయన పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడితో కలిసి బాలుడిని సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, బాలుడిని పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
ఇదీ చదవండి: బాంబే హైకోర్టు, అమితాబ్ నివాసానికి బాంబు బెదిరింపు కలకలం
సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని విచారణ జరిపారు. గుండెపోటు వల్లే మరణం సంభవించిందని వైద్యులు చెప్పడంతో, ఎటువంటి ఫిర్యాదు చేయడానికి కుటుంబ సభ్యులు నిరాకరించారని పోలీసులు తెలిపారు.8వ తరగతి చదువుతున్న ఆ బాలుడిని బుధవారం ఉదయం ఆయన తండ్రి పాఠశాల వద్ద దింపాడు. ఆ సమయంలో బాలుడు ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా కనిపించాడని సమాచారం.
ఇదీ చదవండి : దారుణం : భార్యను కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు!
చిన్నవయసులోనే గుండెపోట్లు
కొద్ది రోజుల క్రితమే ఉత్తరప్రదేశ్‌లోని ముజఫ్ఫర్‌నగర్‌లో అక్టోబరు 31న పాఠశాల క్రీడా పోటీలలో భాగంగా రన్నింగ్ రేస్‌లో పాల్గొన్న 10 ఏళ్ల (4వ తరగతి) విద్యార్థి హఠాత్తుగా కుప్పకూలి మరణించాడు. రేస్ మధ్యలోనే కుప్పకూలిన ఆ బాలుడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అతడికి కూడా గుండెపోటే కారణమని తేలింది.
ఇదీ చదవండి: ముక్కలుగా నరికి చెత్తబుట్టలో పడేశా : ఎన్‌ఆర్‌ఐ భర్త
అలాగే ఢిల్లీలో మూడో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల చిన్నారి తన క్లాస్‌రూమ్‌లో ఉన్నట్టుండి కిందపడిపోయి ప్రాణాలు విడిచింది. ఆ చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా గుండెపోటు వల్లే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సంఘటన పాఠశాలలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. అయితే, పాఠశాలలో అత్యవసర వైద్య సదుపాయాలు లేకపోవడంపై ఆ చిన్నారి కుటుంబం ప్రశ్నించింది. పాపకు సకాలంలో ప్రథమ చికిత్స లేదా సీపీఆర్ (CPR) అందించలేదని వారు ఆరోపించారు.


