సాక్షి, ముంబై : ముంబైలో బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ కలకలం రేపాయి. నవంబర్ 6, శుక్రవారం నాడు బాంబే హైకోర్టుపై బాంబు దాడి చేస్తామంటూ ఒక ఈమెయిల్ రావడంతో ముంబైలో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. అలాగే అమితాబ్ బచ్చన్ నివాసం 'జల్సా',బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), వర్లీ రేస్‌కోర్స్, లను కూడా పేల్చివేస్తామని బెదిరించడం సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలోని పలు కోర్టులు, మూవీ సెలబ్రిటీలక కూడా ఇలాంటి బెదిరింపు రావడంతో భద్రతా హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఈ బెదిరింపును తీవ్రంగా పరిగణించిన భద్రతా సంస్థలు, ఇమెయిల్ పంపిన వారిని గుర్తించేందుకు వెంటనే విచారణ ప్రారంభించాయి. ఆ ఇమెయిల్‌లోని పూర్తి వివరాలు, బెదిరింపులు వచ్చిన ప్రదేశాలలో నిర్వహిస్తున్న తనిఖీలు, కేసు దర్యాప్తు పురోగతికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.శుక్రవారం వచ్చిన తాజా ఇమెయిల్‌కు, పాత సంఘటనలకు ఏమైనా సంబంధం ఉందా అనే విషయాన్ని ముంబై పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. మెయిల్ పంపిన వ్యక్తి వివరాలు, దాని వెనుక ఉన్న నిజా నిజాలపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదీ చదవండి: ముక్కలుగా నరికి చెత్తబుట్టలో పడేశా : ఎన్‌ఆర్‌ఐ భర్త
గతంలో కూడా బొంబాయి హైకోర్టుకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. జనవరి 16న హైకోర్టుతో పాటు ముంబైలోని మరో కోర్టుకు బెదిరింపు ఇమెయిల్స్ రావడంతో పోలీసులు ముందుస్తు జాగ్రత్తగా తనిఖీలు చేశారు. చివరికి ఎలాంటి అనుమానాస్పద పదార్థాలు దొరక్కపోవడంతో అది సైబర్ నేరగాళ్ల ఫేక్ బెదిరింపుగా అధికారులు తేల్చారు. ఆ మెయిల్ మూలాలను కనుగొనడానికి సైబర్ సెల్ విభాగాన్ని రంగంలోకి దించారు.
ఇదీ చదవండి: రొనాల్డో రిటైర్‌మెంట్‌పై తొలి స్పందన.. భార్య భావోద్వేగం
అలాగే నవంబరు 2న ఠాణే, పుణే, హింగోలీ, బీడ్, నాందేడ్ జిల్లాల సెషన్స్ కోర్టులకు బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు ఆయా ప్రాంగణాలను ఖాళీ చేయించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అయితే, ఆ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేదా పేలుడు పదార్థాలు లభించలేదని అధికారులు వెల్లడించారు. అలాగే 'జల్సా', బీఎస్‌ఈలకు గతంలోనూ బెదిరింపులు వచ్చాయి.


