PC: CAB X
రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌లో భాగంగా మహారాష్ట్రతో మ్యాచ్‌లో బెంగాల్ ఎట్టకేలకు ఆధిక్యంలోకి వచ్చింది. వెలుతురులేమి కారణంగా బుధవారం నాటి మూడో రోజు ఆట ముగిసేసరికి 24 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేయగలిగింది. తద్వారా ఒక్క పరుగు ఆధిక్యంలో నిలిచింది.
143 పరుగులకే ఆలౌట్
కోల్‌కతా వేదికగా సోమవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మహారాష్ట్ర తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకే ఆలౌట్ అయింది. వికెట్ కీపర్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ అర్ధ శతకం (54)తో రాణించగా.. ప్రదీప్త ప్రామాణిక్ 31 పరుగులు చేశాడు.
పృథ్వీ షా విఫలమైనా..
మహారాష్ట్ర బౌలర్లలో తనయ్ సంఘ్వీ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. ప్రదీప్ దాధే, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్, సిద్దేశ్ వీర్ తలా రెండు వికెట్లు కూల్చారు. అనంతరం మహారాష్ట్ర 218 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ పృథ్వీ షా (12) విఫలమైనా.. సిద్దేశ్ వీర్ (28), సౌరభ్ నవాలే (28), రాజ్‌వర్దన్ (24), ప్రదీప్ దాధే (27) ఓ మోస్తరుగా రాణించారు. తనయ్ సంఘ్వీ అజేయ అర్ధ శతకం (60)తో సత్తా చాటాడు.
75 పరుగుల ఆధిక్యం
బెంగాల్ బౌలర్లలో మహ్మద్ షమీ నాలుగు, షాబాజ్ అహ్మద్ మూడు వికెట్లు కూల్చగా.. మహ్మద్ కైఫ్ రెండు, సూరజ్ సింధు జైస్వాల్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రకు తొలి ఇన్నింగ్స్‌లో 75 పరుగుల ఆధిక్యం లభించింది.
ఒక్క పరుగు ఆధిక్యంలోకి బెంగాల్
అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బెంగాల్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (9) మరోసారి విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన సుదీప్ ఘరామి (12) నిరాశపరిచాడు. నాలుగో నంబర్ బ్యాటర్, సుదీప్ ఛటర్జీ డకౌట్ అయ్యాడు. అయితే, మరో ఓపెనర్ అంకుర్ పాల్ 32 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.
ఈ క్రమంలో బుధవారం ఆట ముగిసేసరికి అభిషేక్ పోరెల్ 23, సూరజ్ సింధు జైస్వాల్ సున్నా పరుగులతో క్రీజులో నిలిచారు. ఫలితంగా నాలుగు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసిన బెంగాల్.. ఒక్క పరుగు ఆధిక్యంలోకి వచ్చింది.
ఇవీ చదవండి: రోహిత్ భాయ్ వల్లే ఇలా!.. అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు: గిల్
అద్భుతం.. అతడిని టెస్టుల్లోనూ ఆడించండి: టీమిండియా దిగ్గజం


