రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌లో టీమిండియా వెటరన్, బెంగాల్ స్పీడ్ స్టార్ మహ్మద్ షమీ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఎలైట్ గ్రూపు-సిలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా మహారాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో షమీ నిప్పులు చెరిగాడు. తన స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 23.5 ఓవర్లు బౌలింగ్ చేసిన షమీ.. కేవలం 37 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు షాబాజ్ అహ్మద్ మూడు, మహ్మద్ కైఫ్ రెండు వికెట్లు సాధించారు. ఫలితంగా మహారాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకే ఆలౌటైంది. మహారాష్ట్ర బ్యాటర్లలో తన్మయ్ సంఘ్వీ(60) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ పృథ్వీ షా(12) మరోసారి నిరాశపరిచాడు.
షమీ పునరాగమనం చేస్తాడా?
కాగా మహ్మద్ షమీ గత రంజీ సీజన్‌లోనూ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. రంజీతో పాటు విజయ్ హాజారే ట్రోఫీలోనూ అతడు రాణించాడు. అయినప్పటికి అతడికి భారత సెలక్టర్లు నుంచి మాత్రం పిలుపు రావడం లేదు.
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున చివరిసారిగా ఆడిన షమీ.. ఆ టోర్నీలో ఐదు ఇన్నింగ్స్‌ల్లో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్లు తీసి సత్తా చాటడంతో పాటు ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లోనూ మూడు వికెట్లు సాధించాడు.
అయితే ఆ తర్వాత ఐపీఎల్ 2025లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దాని తర్వాత జరిగిన దేశవాళీ సీజన్‌లో తిరిగి ఆకట్టుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఏడు మ్యాచ్‌ల్లో 15 వికెట్లు, రంజీ ట్రోఫీలో 13 ఇన్నింగ్స్‌ల్లో 37 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇంత రాణించినా షమీకి భారత జట్టులో చోటు దక్కకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వడంతో షమీని కూడా తిరిగి ఎంపిక చేయాలన్న డిమాండ్లు ఎక్కువయ్యాయి.
చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా


