అతడి ఖేల్‌ ఖతం.. టీమిండియా తలుపులు మూసుకుపోయినట్లే! | Chapter Is Closed IND Ex Star Shuts Doors Bhuvneshwar Bats Shami Return | Sakshi
Sakshi News home page

అతడి ఖేల్‌ ఖతం.. టీమిండియా తలుపులు మూసుకుపోయినట్లే!

Nov 3 2026 2:47 PM | Updated on Nov 3 2026 3:01 PM

Chapter Is Closed IND Ex Star Shuts Doors Bhuvneshwar Bats Shami Return

టీమిండియా (PC: BCCI X)

టీమిండియా వెటరన్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌పై విమర్శలు కొనసాగుతున్నాయి. నాలుగేళ్ల తర్వాత వచ్చిన సువర్ణావకాశాన్ని అతడి సద్వినియోగం చేసుకోలేకపోయాడని అభిమానులు సైతం మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

కాగా ఐపీఎల్‌-2025, 2026 సీజన్లలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు వరుసగా చాంపియన్‌గా నిలవడంలో భువీది కీలక పాత్ర. తాజా ఎడిషన్‌ ఈ స్వింగ్‌ సుల్తాన్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని పదహారు మ్యాచ్‌లలో కలిపి ఏకంగా ఇరవై ఎనిమిది వికెట్లు కూల్చాడు.

ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా సెలక్టర్లు భువీని ఎంపిక చేశారు. అయితే, కివీస్‌ గడ్డ మీద భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఈ ఫాస్ట్‌బౌలర్‌.. పూర్తిగా విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మొత్తంగా నాలుగు మ్యాచ్‌లు ఆడి ఏకంగా 180 పరుగులు ఇచ్చుకుని ఒకే ఒక్క వికెట్‌ తీశాడు.

ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ భువీపై విమర్శల వర్షం కురిపించాడు. అతడి ఖేల్‌ ఇక ఖతం అయిందని.. టీమిండియా తలుపులు మూసుకుపోయినట్లేనని అభిప్రాయపడ్డాడు. భువీకి బదులు మరో వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీకి అవకాశం ఇస్తే బాగుంటుందని జట్టు యాజమాన్యానికి సూచించాడు.

ఈ మేరకు తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ సరిగ్గా బౌలింగ్‌ చేయలేదు. అతడి ఫామ్‌ను నిరూపించుకోలేకపోయాడు. ఐపీఎల్‌కు.. ఇక్కడి ప్రదర్శనకు చాలా తేడా ఉంది. నాకు తెలిసినంత వరకు టీమిండియాలో భువీ అధ్యాయం ఇక ముగిసినట్లే. పునరాగమనం చేయడం చాలా కష్టం.

న్యూజిలాండ్‌లో అతడు అదనంగా పరుగులు ఇచ్చుకున్నాడు. ప్రదర్శన కూడా అస్సలు బాగాలేదు. అయితే, ఐపీఎల్‌తో పోలిస్తే ఇక్కడ అతడి రనప్‌ స్పీడ్‌ బాగా తగ్గిపోయింది. దీనిని బట్టి అతడు సరిగ్గా ప్రాక్టీస్‌ చేయలేదని తెలుస్తోంది.

ఒకవేళ అదే నిజమైతే సెలక్టర్లు అతడికి మరో అవకాశం ఇవ్వకపోవచ్చు. అతడేమీ యువ బౌలర్‌ కాదు కదా! అనుభవజ్ఞుడు అయి ఉండి ఇలా చేయడం సరికాదు. 36 ఏళ్ల వయసులో అతడికి మళ్లీ అవకాశాలు రాకపోవచ్చు.

ప్రస్తుతం షమీ రంజీల్లో అద్భుతంగా ఆడుతున్నాడు. భువీ కంటే షమీ మంచి రిథమ్‌తో బౌలింగ్‌ చేస్తున్నాడు’’ అని అశ్విన్‌ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. భువీకి బదులు షమీకి అవకాశాలు ఇవ్వాలని సూచించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement