‘పైసా ఇవ్వలేదు.. సొంత డబ్బులతో టోర్నీలో పాల్గొన్నాం’ | PV Sindhu Says-SAI Leaves Indian-Badminton-Stars Hanging In-Europe | Sakshi
Sakshi News home page

‘పైసా ఇవ్వలేదు.. సొంత డబ్బులతో టోర్నీలో పాల్గొన్నాం’

Nov 3 2026 1:34 PM | Updated on Nov 3 2026 1:39 PM

PV Sindhu Says-SAI Leaves Indian-Badminton-Stars Hanging In-Europe

Photo Credit: Twitter

భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్‌- SAI) వైఖరితో భారత టాప్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ సహా ఇతర ప్లేయర్లు ఇబ్బంది ఎదుర్కొన్నారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI)తో జరిగిన పరిపాలనాపరమైన వివాదాల వల్ల పీవీ సింధు, లక్ష్యసేన్‌లతో కూడిన భారత బృందానికి యూరప్ టూర్‌కు సంబంధించిన నిధులను స్పోర్ట్స్ అథారిటీ నిలిపివేసింది. దీంతో ఫిన్లాండ్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో జరిగిన నాలుగు వరుస టోర్నమెంట్లలో ప్రయాణ, ఆహార, వసతి ఖర్చులను ఆటగాళ్లే సొంతంగా భరించాల్సి వచ్చింది.

సొంతంగానే బస, భోజన సౌకర్యం..
దీనిపై తాజాగా పీవీ సింధు స్పందించింది. "నిధులు మంజూరు కాలేదని తెలిసి నేను షాక్‌కు గురయ్యాను, గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు. సాయ్‌ నుంచి పైసా కూడా రాకపోవడంతో సొంత డబ్బులతో అక్కడ వసతి, భోజన సౌకర్యం ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. సాయ్ నుంచి నిధులు అందకపోయినప్పటికీ, ఆటపైనే దృష్టి పెట్టానని, ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ (OGQ) సంస్థ కూడా మాకు ఆర్థికంగా సహాయం చేసింది.’ అని సింధూ చెప్పుకొచ్చింది.

కాగా యూరప్ టోర్నీకి నిధులు విడుదల చేయడకపోవడంపై సాయ్ స్పందించింది. నిబంధనల ప్రకారం టోర్నమెంట్‌కు 30 రోజుల ముందే ఆటగాళ్ల జాబితాతో కూడిన ప్రతిపాదనలను సమర్పించడంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ (BAI) ఆలస్యం చేయడం వల్లే నిధులు విడుదల కాలేదని సాయ్ స్పష్టం చేసింది.

ఇక నిధుల కొరత కారణంగా చాలా మంది క్రీడాకారులు కోచ్‌లు లేకుండానే మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ, పీవీ సింధు, లక్ష్యసేన్.. జర్మనీలో జరిగిన 'హైలో ఓపెన్' సింగిల్స్ టైటిళ్లను గెలుచుకొని దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారు. 

ఇలాంటివి రిపీట్‌ కానివ్వము: సాయ్‌
అయితే ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటామని సాయ్ హామీ ఇచ్చింది. రాబోయే టోర్నమెంట్లకు నిధుల సరఫరా యథావిధిగా కొనసాగుతుందని, అయితే ఇప్పటికే యూరప్ పర్యటనకు క్రీడాకారులు స్వంతంగా పెట్టుకున్న ఖర్చులను మాత్రం రీఇంబర్స్ (తిరిగి చెల్లించడం) చేయబోమని SAI అధికారులు స్పష్టం చేశారు.

ర్యాంకింగ్స్‌లో ఎగ‌బాకిన సింధు
ఇక భార‌త టాప్ ష‌ట్ల‌ర్ పీవీ సింధు బీడబ్ల్యూఎఫ్ తాజాగా విడుద‌ల చేసిన ర్యాంకింగ్స్‌లో టాప్‌-6లో నిలిచింది. ఇటీవ‌లే హైలో ఓపెన్ టైటిల్ గెలుచుకున్న సింధు ఎనిమిదో స్థానం నుంచి ఆరో స్థానానికి ఎగ‌బాకింది. తుది పోరులో పీవీ సింధు డెన్మార్క్‌కు చెందిన లైన్ హోజ్‌మార్క్ జేర్స్‌ఫెల్డ్‌ను 21-12, 21-14 తేడాతో ఓడించి టైటిల్‌ను అందుకుంది. కాగా సింధుకు ఈ ఏడాది ఇది రెండో బీడ‌బ్ల్యూఎఫ్ టైటిల్‌. జ‌న‌వ‌రిలో జ‌పాన్ ఓపెన్ టైటిల్ అందుకుంది. 

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement