పాలు వద్దు.. పనీర్ వద్దు.. అసలు జంతు ఉత్పత్తుల జోలికే వెళ్లద్దు అనుకునే పక్కా వీగన్ల కోసం మొక్కలతోనే మ్యాజిక్ చేసే గాడ్జెట్లు వచ్చేశాయి! నవంబర్ 1 ప్రపంచ వీగన్ దినోత్సవం సందర్భంగా.., ప్రతి వీగన్ వంటను సులభంగా పూర్తి చేసే గాడ్జెట్లే ఇవీ!
బటన్ నొక్కితే పాలు!
మన వంటగదే చిన్న వీగన్ డెయిరీ అయిపోతే ఎంతో బాగుంటుంది కదా! అందుకే వచ్చింది ఈ నట్ మిల్క్ మేకర్. దీంతో బాదం, సోయా, ఓట్స్, గింజలతో పాలు తయారు చేసుకోవచ్చు. 600 మి.లీ. సామర్థ్యం ఉన్న ఈ మెషిన్‌లో 600 వాట్ల మోటార్, స్టెయిన్‌లెస్ స్టీల్ బ్లేడ్లు ఉంటాయి. పాలు మాత్రమే కాదు, తృణధాన్యాలతోనూ పానీయాలు తయారు చేసుకోవచ్చు. ఇందులో నీళ్లు మరిగించే సదుపాయమూ ఉంది. మొత్తం ఆరు ఫంక్షన్లతో పాటు, ఒకటి నుంచి 12 గంటల వరకు టైమర్ సెట్ చేసుకునే వీలుంది. వాడిన తర్వాత శుభ్రం చేసుకోవడానికి ప్రత్యేక క్లీనింగ్ ఫంక్షన్ కూడా ఉంది. ధర రూ.4,000
విత్తనాలే విటమిన్లు!
మార్కెట్ చుట్టూ తిరగకుండా ఇంట్లోనే మొలకలు పెంచుకుంటే, విత్తనాలే పోషకాల గనులుగా మారిపోతాయి! ఇందుకోసం ఈ హోమ్ స్ప్రౌటింగ్ జార్ కిట్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విత్తనాలు వేస్తే మూడు నుంచి ఐదు రోజుల్లోనే మొలకలు సిద్ధమవుతాయి. మట్టి అవసరం లేదు, తోటపని చేస్తూ చెమటలు చిందించాల్సిన అవసరమూ లేదు! గాలి సులువుగా ప్రసరించే స్టెయిన్ లెస్ స్టీల్ ట్యూబ్, అదనపు నీటిని సేకరించే రిజర్వాయర్ ఉండటంతో మొలకలు పెంచుకోవడం సులువు. జార్‌ను తెరవకుండానే పై నుంచి విత్తనాలను కడిగే సదుపాయం కూడా ఉంది. సలాడ్లు, శాండ్‌విచ్‌లు, స్మూతీల్లో వేసుకోవడానికి తాజా మొలకలు ఇంట్లోనే సిద్ధం చేసుకోవచ్చు. వాడిన తర్వాత వేరుచేసి శుభ్రం చేసుకోవడమూ సులభమే! ధర రూ.500
ఆకుకూరలకు ఐదు బ్లేడ్లు!
‘ఆలస్యం అమృతం విషం’ అన్నట్లు ఆకుకూర లు ఇచ్చే పోషకాలు అమృతం లాంటివే అయినా, వాటిని కట్ చేయడానికి, ఒలవడానికి ఎంత ఆలస్యం చేస్తే అంత ఇబ్బంది! అందుకే, ఈ కత్తిరింపు తిప్పలన్నీ తొలగించడానికి ఈ హెర్బ్ కిచెన్ సిజర్ బాగా పనిచేస్తుంది. ఇందులోని ఐదు బ్లేడ్లు ఒకేసారి పనిచేసి ఆకుల్ని చకచకా చిన్న చిన్న ముక్కలుగా కోసేస్తాయి.
పాలకూర, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరల్ని కట్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. సలాడ్లు, సూప్‌లు, చట్నీలు, కూరల్లో వేసే పచ్చి ఆకుల్ని సిద్ధం చేయడం కూడా సులువే! కాడల నుంచి ఆకుల్ని వేరు చేయడానికి ప్రత్యేక సాధనం, బ్లేడ్ల మధ్య చిక్కుకున్న ఆకుల్ని తొలగించడానికి క్లీనింగ్ దువ్వెన కూడా ఉన్నాయి. వాడిన తర్వాత సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. ధర సుమారు రూ.2,000.


