‘నో షేవ్ నవంబర్’ వచ్చిందంటే చాలు, గడ్డం పెంచడం ఒక ట్రెండ్ అయితే, దాన్ని స్టయిల్‌గా మలచుకోవడమే అసలైన ఫ్యాషన్! షేవింగ్ కోసం ఖర్చు చేసే డబ్బును, స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వడం కూడా ఈ ఉద్యమంలో భాగమే! మరి ఈ నెలలో మీ గడ్డానికి కొత్త ఇమేజ్ ఇవ్వాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
రూల్స్ తెలుసా?
నవంబర్ మొదలయ్యేలోపు పూర్తిగా క్లీన్ షేవ్ చేసుకుని, ఆ తర్వాత గడ్డాన్ని సహజంగా పెరగనివ్వండి. అయితే, క్లీన్‌షేవ్ తప్పనిసరి నియమం కాదు. ఇప్పటికే గడ్డం ఉన్నవాళ్లు కూడా ఈ చాలెంజ్‌లో పాల్గొనవచ్చు. అసలు విషయం... నవంబర్ నెలంతా షేవింగ్‌కు దూరంగా ఉండటమే!
గ్రూమింగ్ మానకండి!
గడ్డం పెరిగిందని దాన్ని అలాగే వదిలేస్తే సరిపోదు. రోజూ శుభ్రం చేసుకుని, చిక్కులు తొలగించి, అవసరాన్ని బట్టి బియర్డ్ ఆయిల్ లేదా కండిషనర్ వాడండి. ఇవి గడ్డాన్ని మృదువుగా ఉంచి, దువ్వుకోవడాన్ని సులభం చేస్తాయి. వీటిలో మీ చర్మానికి సరిపోయే ఉత్పత్తులనే ఎంచుకోవాలి.
లుక్‌కు కొత్త హైప్!
గడ్డం గుబురుగా పెంచి, తలపై ఉన్న జుట్టును కూడా అస్తవ్యస్తంగా వదిలేస్తే, అడవి మనిషిలా కనిపించే ప్రమాదం ఉంది. అందుకే గడ్డం పొడవు, ముఖాకృతికి తగ్గ హెయిర్ స్టయిల్‌ను ఎంచుకోండి. గుబురు గడ్డానికి ఫేడ్ కట్, చిన్న గడ్డానికి సైడ్ పార్టింగ్ లేదా టెక్స్చర్డ్ హెయిర్‌స్టయిల్ బాగుంటాయి. గడ్డం అంచులను నీట్‌గా సర్దుకుంటే రఫ్ లుక్‌లోనూ క్లాస్ కనిపిస్తుంది.
పర్ఫెక్ట్ పార్ట్‌నర్!
గడ్డాన్ని హైలైట్ చేయాలంటే దుస్తుల రంగుల విషయంలోనూ కాస్త శ్రద్ధ పెట్టాలి. నలుపు, నేవీ బ్లూ, ఆలివ్ గ్రీన్ , బ్రౌన్ రంగుల దుస్తులతో రగ్గడ్ లుక్ సొంతం చేసుకోవచ్చు. బ్లాక్ టీషర్ట్, బ్లూ జీన్స్, బ్రౌన్ బూట్స్ కాంబినేషన్ అదిరిపోతుంది. తెల్లని టీషర్ట్‌తోనూ గడ్డానికి మంచి కాంట్రాస్ట్ ఇవ్వొచ్చు.
అదనపు ఆకర్షణ!
గడ్డం పెంచినప్పుడు వాచ్, సన్‌గ్లాసెస్, షూస్ వంటి యాక్సెసరీస్ మీ లుక్‌ను మరింత స్టయిలిష్‌గా మార్చగలవు. క్యాజువల్ దుస్తులకు వైట్ స్నీకర్స్, డెనిమ్ జాకెట్ జత చేయండి. ఫార్మల్ లుక్‌కు క్లాసిక్ వాచ్, లెదర్ షూస్ ఎంచుకోండి. గడ్డం, హెయిర్‌స్టయిల్, యాక్సెసరీస్ మధ్య సమన్వయం ఉంటే మీ రూపం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
చివరగా, గడ్డం పెంచే క్రమంలో కొందరికి దురద, పొడిబారడం వంటి సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించండి. గడ్డం ఎంత స్టయిలిష్‌గా ఉన్నా, ఆరోగ్యంగా ఉండటం అంతకంటే ముఖ్యం!
∙కొండి దీపిక


