మీరేదో ఒక రొమాంటిక్ పాట పాడుకుంటూ పగటి కలల్లో తేలిపోతున్నారు. సరిగ్గా అదే సమయానికి మీ పక్కనున్న ఏఐ మీ మైండ్‌లోకి తొంగిచూసి, ‘‘ఓహో! అలాగా!’’ అంటూ మీ ఆలోచనల్ని నేరుగా టీవీ స్క్రీన్ మీద విజువల్‌గా ప్లే చేస్తే ఎలా ఉంటుంది? వినడానికే భయంగా, కాస్త కుతూహలంగా ఉంది కదా! ఇలాంటి అసాధ్యమైన మైండ్–రీడింగ్ టెక్నాలజీని శాస్త్రవేత్తలు ఏఐ సహాయంతో నిజం చేయబోతున్నారు. నిజానికి ఇప్పటికే చేసేశారు కూడా!
మైండ్–రీడింగ్ వెనుక మ్యాజిక్
మనం ఒక కొత్త ప్రదేశాన్ని చూసినా, ఎర్రటి గులాబీ పువ్వును ఊహించుకున్నా లేదా మనసులోనే ఒక మాట అనుకున్నా, మన మెదడులోని కోట్ల కొద్దీ న్యూరాన్లు నిమిషాల వ్యవధిలో వేల సంకేతాలను ఇచ్చిపుచ్చుకుంటాయి. ఈ క్రమంలో మెదడులోని వివిధ భాగాలకు రక్త ప్రసరణ, ఆక్సిజన్ సరఫరాలో చిన్నచిన్న మార్పులు జరుగుతాయి. సైంటిస్టులు ఆ మెదడు సంకేతాలను ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (ఎఫ్.ఎం.ఆర్.ఐ) స్కానర్ల ద్వారా సూక్ష్మ చిత్రాలుగా రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత అసలైన ఏఐ మ్యాజిక్ ప్రారంభమవుతుంది.
ఈ మెదడు డేటాను అధునాతన డీప్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ మోడల్స్‌కు ఫీడ్ చేసినప్పుడు, ఆల్గోరిథమ్‌లు ఆ సంకేతాల వెనుక ఉన్న పాటర్న్‌ను (క్రమబద్ధతను) విశ్లేషిస్తాయి. మీరు కళ్లతో ప్రత్యక్షంగా ఏ దృశ్యాన్ని చూస్తున్నారో లేదా మనసులో ఏం అనుకుంటున్నారో ఏఐ పక్కాగా డీకోడ్ చేసి, దాన్ని పూర్తిస్థాయి డిజిటల్ బొమ్మగానో లేదా వాక్యాలుగానో కంప్యూటర్ స్క్రీన్‌పై చూపెడుతుంది.
‘నరాల’ బాధితులకు ఆశాకిరణం
ఈ మైండ్–రీడింగ్ సాంకేతికత కేవలం వినోద సాధనం మాత్రమే కాదు, వైద్య రంగంలో ఒక సరికొత్త విప్లవానికి నాంది పలకబోతోంది. ముఖ్యంగా పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, అమియోట్రోఫిక్ లాటరల్ స్కె›్లరోసిస్ (ఎ.ఎల్.ఎస్.) వంటి తీవ్రమైన నరాల సంబంధ వ్యాధుల వల్ల మాట్లాడే శక్తిని, శరీర అవయవాలను కదిలించే సామర్థ్యాన్ని శాశ్వతంగా కోల్పోయిన వేలాది మంది రోగులకు ఇది ఒక గొప్ప ఆశాకిరణం. (గుర్తుందా... ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఈ ఎ.ఎల్.ఎస్.తోనే దశాబ్దాల పాటు పోరాడారు).
ఎ.ఎల్.ఎస్. ఉన్నవారు తమ మనసులో అనుకునే మాటలను, భావాలను ఈ మైండ్ రీడింగ్ ఏఐ చదివి డిజిటల్ టెక్స్‌ట్‌గా లేదా వాయిస్‌గా మార్చి ఇతరులకు అర్థమయ్యేలా చేస్తుంది. అంతేకాకుండా, బ్రెయిన్–కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ ద్వారా భవిష్యత్తులో చేతులు కదల్చలేని వారు కూడా కేవలం తమ ఆలోచనల ద్వారానే వీల్‌చైర్‌లను, స్మార్ట్ హోమ్ పరికరాలను, కంప్యూటర్లను సులభంగా ఆపరేట్ చేసే వీలు కలుగుతుంది.
ప్రస్తుతానికి పైపై అస్పష్ట రూపాలే
టెక్నాలజీ పరంగా ఇది ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ, దీని వెనుక కొన్ని పెద్ద నైతిక సవాళ్లు, ఆందోళనలు కూడా దాగి ఉన్నాయి. ప్రతి ఒక్కరి మనసులో ఇతరులతో పంచుకోలేని ఎన్నో వ్యక్తిగత ఆలోచనలు, రహస్యాలు ఉంటాయి.
భవిష్యత్తులో ఈ ఏఐ కనుక పోర్టబుల్ పరికరాల రూపంలోకి వచ్చి మరింత తెలివి మీరితే, మన అనుమతి లేకుండానే మన ప్రైవేట్ ఆలోచనలను లేదా రహస్యాలను ఇతరులు చదివేసే ప్రమాదం ఉందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే సైంటిస్టులు దీనితో పాటు ‘న్యూరో–ప్రైవసీ’ నియమాలను కూడా రూపొందించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంకేతికత ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఇది మెదడు సంకేతాల ఆధారంగా 100 శాతం కచ్చితమైన బొమ్మలను కాకుండా, ఒక అంచనా ప్రతిరూపాన్ని మాత్రమే తయారు చేస్తోంది.
న్యూరో, ఏఐల కలయిక
న్యూరోసైన్స్‌ను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లను కలిపి శాస్త్ర పరిశోధకులు వృద్ధి చేస్తున్న ‘మైండ్–రీడింగ్’ సాంకేతికత ప్రస్తుతం శాస్త్ర ప్రపంచంలో సరికొత్త విప్లవం! న్యూరో సైంటిస్టులు 2000ల ప్రారంభం నుంచే ఎఫ్.ఎం.ఆర్.ఐ. యంత్రాల ద్వారా మానవ మెదడులోని దృశ్యాలను, ఆలోచనలను విశ్లేషించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అయితే అప్పట్లో సాంకేతిక పరిమితుల వల్ల కచ్చితత్వం చాలా తక్కువగా ఉండేది.
2022–2023 నాటికి అమెరికాలోని టెక్సస్ యూనివర్సిటీ పరిశోధకులు ‘సిమాంటిక్ డీకోడర్’ అనే మోడల్‌ను అభివృద్ధి చేయడంతో ఈ పరిశోధనలు తొలిసారి పెద్ద మలుపు తిరిగాయి. పరిశోధకులు ఒక వ్యక్తి మనసులోని ఊహలను, వారు వినిన మాటలను ఎఫ్.ఎం.ఆర్.ఐ డేటా సాయంతో టెక్స్ట్ రూపంలోకి మార్చడంలో విజయం సాధించారు. ఆ తర్వాత జనరేటివ్ ఏఐ, డిఫ్యూజన్ మోడల్స్ రాకతో ఈ మైండ్ రీడింగ్ పరిశోధన ఊహించని వేగాన్ని పుంజుకుని, కేవలం మాటలనే కాకుండా అంతకు మునుపు వారు చూసిన బొమ్మలను, దృశ్యాలను దాదాపు యథాతథంగా కంప్యూటర్ స్క్రీన్‌పైకి తెచ్చే స్థాయికి చేరింది!
‘మెటా’ కూడా ఇదే పనిలో ఉంది!
ప్రస్తుతం మైండ్–రీడింగ్ ఏఐ పరిశోధనలు ప్రపంచంలోని అగ్రగామి పరిశోధనా సంస్థల్లో అత్యంత వేగంగా జరుగుతున్నాయి. అమెరికాలోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ, కార్నెగీ మెలన్, టెక్సస్ విశ్వవిద్యాలయాలతో పాటు మెటా వంటి దిగ్గజ టెక్ సంస్థల ఏఐ లాబ్‌లలో దీనిపై విస్తృతమైన ప్రయోగాలు జరుగుతున్నాయి.
ఆసియా ఖండంలో జపాన్‌కు చెందిన ఒసాకా, క్యోటో విశ్వవిద్యాలయాలు మెదడు తరంగాల ద్వారా మనసులోని దృశ్యాలను పునఃసృష్టించటంపై ప్రత్యేక దృష్టి సారించగా, ఇజ్రాయెల్‌లోని ప్రఖ్యాత ‘వీజ్‌మ్యాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్’ శాస్త్రవేత్తలు ఈ రంగంలో సంచలనాత్మక పురోగతిని సాధిస్తూ అంతర్జాతీయంగా విశేష గుర్తింపు పొందుతున్నారు.
‘బ్రెయిన్ ఐటీ’ తాజా మైలు రాయి
ఇటీవల శాస్త్రవేత్తలు ‘బ్రెయిన్ ఐటీ’ అనే అత్యాధునిక ఏఐ మోడల్‌ను ఆవిష్కరించి ఈ మైండ్ రీడింగ్ ప్రయోగాలలో కీలకమైన మైలురాయిని చేరుకున్నారు. గతంలో ఒక వ్యక్తి మెదడు నమూనాను ఏఐకి నేర్పించడానికి దాదాపు 40 గంటల పాటు సుదీర్ఘమైన ఎఫ్.ఎం.ఆర్.ఐ. స్కానింగ్ డేటా అవసరమయ్యేది. కానీ ఈ కొత్త ‘బ్రెయిన్ ఐటీ’ మోడల్ కేవలం ఒక గంట స్కానింగ్ డేటాతోనే ఆ వ్యక్తి తన మనసులో చూస్తున్న దృశ్యాలను అత్యంత కచ్చితత్వంతో డీకోడ్ చేయగలుగుతోంది.
అంతేకాకుండా, పాత సిస్టమ్‌లు మనం చూస్తున్న వస్తువును మాత్రమే గుర్తించగలిగితే, ఈ తాజా మోడల్ ఆ వస్తువు లేదా మనిషి ఎటువైపు ఉన్నారో, దాని ఆకారం, వెనుక ఉన్న రంగులు ఏమిటో తెలిపే లేఅవుట్‌ను కూడా కచ్చితంగా రీక్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం స్కానింగ్ జరిగిన కొన్ని సెకన్లలోనే దృశ్యాన్ని విజువల్ ఇమేజ్‌గా మార్చే పరిజ్ఞానం అందుబాటులోకి రాగా, భవిష్యత్తులో మనుషులు వినే ఆడియోను, కలలను, మనసులోని వీడియో దృశ్యాలను కూడా స్క్రీన్ పైకి తీసుకురావడమే శాస్త్రవేత్తల తదుపరి ప్రధాన లక్ష్యంగా ఉంది.
శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న ‘మైండ్–రీడింగ్ ఏఐ’ సాంకేతికత మానవ చరిత్రలోనే ఒక విప్లవాత్మక అడుగు. ఇది మన మెదడులోని ఆలోచనలను, దృశ్యాలను డిజిటల్ రూపంలోకి మార్చగల అద్భుతమైన శక్తిని కలిగి ఉంది. అయితే, నాణేనికి రెండో వైపు కూడా ఉన్నట్లే, ప్రతి గొప్ప ఆవిష్కరణ వెనుకా అసాధారణమైన ప్రయోజనాలతో పాటు నైతిక సవాళ్లు, నష్టాలు కూడా ఉంటాయి.
మైండ్ రీడింగ్ ఏఐ లాభాలు
నరాల సంబంధ వ్యాధుల వల్ల మాట్లాడే శక్తిని, కండరాల కదలికలను పూర్తిగా కోల్పోయిన రోగులకు ఇది ఒక గొప్ప వరం. వారు తమ మనసులో అనుకునే మాటలను ఈ ఏఐ చదివి డిజిటల్ టెక్స్›్టగా లేదా వాయిస్‌గా మార్చి ఇతరులకు అర్థమయ్యేలా చేస్తుంది.
బ్రెయిన్–కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ సాంకేతికత ద్వారా, శారీరకంగా కదలలేని వారు కేవలం తమ ఆలోచనల ద్వారానే వీల్‌చైర్‌లు, కంప్యూటర్లు, ఇతర స్మార్ట్ పరికరాలను సులభంగా ఆపరేట్ చేయడానికి ఇది సహాయపడుతుంది.
అల్జీమర్స్, మతిమరుపు, మానసిక రుగ్మతలు, డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తుల మెదడు స్థితిని లోతుగా అర్థం చేసుకోవడానికి, వారి వ్యాధికి తగిన చికిత్స అందించడానికి వైద్యులకు ఇది అద్భుతమైన మార్గదర్శిగా నిలుస్తుంది.
భవిష్యత్తులో ఈ సాంకేతికత మరింత అభివృద్ధి చెందితే, మనుషులు తమ మనసులో మెదిలే అద్భుతమైన ఊహలను, సృజనాత్మక దృశ్యాలను ఎలాంటి పెయింటింగ్ లేదా డిజైనింగ్ నైపుణ్యాలు లేకుండా నేరుగా స్క్రీన్‌పై పైకి చిత్రాలుగా లేదా వీడియోలుగా మార్చుకోవచ్చు.
మైండ్ రీడింగ్ ఏఐ నష్టాలు
ప్రతి మనిషి మనసులోనూ ఎవరితోనూ పంచుకోలేని ఆంతరంగిక ఆలోచనలు, నిగూఢ ఊహలు, వ్యక్తిగత భావోద్వేగాలు ఉంటాయి. భవిష్యత్తులో ఈ ఏఐ గనక మరింత శక్తిమంతమైతే, మన అనుమతి లేదా ప్రమేయం లేకుండానే ఎవరైనా మన మనసులోని రహస్యాలను బలవంతంగా చదివేసే ప్రమాదం ఉందనే తీవ్రమైన ఆందోళన ఉంది.
భవిష్యత్తులో ఈ టెక్నాలజీని ప్రభుత్వాలు లేదా చట్టాన్ని అమలు చేసే సంస్థలు నేరస్థులపై బలవంతంగా ప్రయోగించి, వారి మెదడులోని ఆలోచనలను అణచివేసే లేదా ప్రశ్నించే సాధనంగా వాడుకునే అవకాశం ఉంది.
మన మెదడు సంకేతాలను డిజిటల్ డేటాగా మార్చి ప్రాసెస్ చేస్తున్నప్పుడు, ఆ డేటాను హ్యాకర్లు దొంగిలించే అవకాశం ఉంది. భవిష్యత్తులో ‘బ్రెయిన్ హ్యాకింగ్’ ద్వారా వ్యక్తిగత ఆలోచనలను తస్కరించే ప్రమాదం ఉంటుంది.
ప్రస్తుతం ఈ ఏఐ సిస్టమ్ వంద శాతం పరిపూర్ణంగా పనిచేయడం లేదు. ఇది మెదడు సంకేతాల ఆధారంగా కేవలం కొన్ని అంచనా చిత్రాలను లేదా పదాలను మాత్రమే ఇస్తుంది. కొన్నిసార్లు ఏఐ తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల అనర్థాలు జరిగే ప్రమాదం ఉంది.
– సాక్షి స్పెషల్ డెస్క్


