బిల్ గేట్స్ హెచ్చరిక.. ఉద్యోగాలకు ముప్పు! | Bill Gates Warns AI Could Replace Human Workers as Microsoft Offers Buyouts to 60000 Staff | Sakshi
Sakshi News home page

బిల్ గేట్స్ హెచ్చరిక.. ఉద్యోగాలకు ముప్పు!

Oct 27 2026 3:12 PM | Updated on Oct 27 2026 3:26 PM

Bill Gates Warns AI Could Replace Human Workers as Microsoft Offers Buyouts to 60000 Staff

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. మానవ ఉద్యోగాల భవిష్యత్తుపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇప్పటికే అనేక రంగాల్లో ఏఐ వినియోగం పెరుగుతోంది, భవిష్యత్తులో మనుషులు చేసే పనులను యంత్రాలే నిర్వహించే పరిస్థితి రావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశంపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ఏఐ రాక.. మానవ చరిత్రలో కీలక మలుపు
ఏఐ కారణంగా ఉద్యోగాల స్వరూపం మారిపోవడమే కాకుండా.. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 'ది అబ్జర్వర్‌'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ మాట్లాడుతూ.. ఏఐ రాకను మానవ చరిత్రలో ఒక కీలక మలుపుగా అభివర్ణించారు. ఇప్పటివరకు భూమిపై మనుషులే అత్యంత తెలివైన జీవులనే భావన ఉండేదని, అయితే ఏఐ అభివృద్ధితో ఆ పరిస్థితి మారవచ్చని పేర్కొన్నారు.

రోబోను నియమించుకో.. మనిషిని తొలగించు
ముందు కంప్యూటర్ల ముందు కూర్చొని చేసే వైట్ కాలర్ ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఉంటుందని, ఆ తర్వాత హ్యూమనాయిడ్ రోబోల సాయంతో శారీరక శ్రమతో కూడిన పనులు కూడా యంత్రాల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని బిల్ గేట్స్ అంచనా వేశారు.  'రోబోట్‌ను నియమించుకోండి, మనిషిని తొలగించండి, ఇక వెనక్కి తిరిగి చూడకండి' అని ఇంటర్వ్యూలో పేర్కొన్నట్లు సమాచారం.

ప్రభుత్వ ఆదాయాలకు గండి
దిగ్గజ కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి, పనులను వేగంగా పూర్తి చేయడానికి ఏఐ వైపు మొగ్గు చూపుతున్నాయని గేట్స్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో మనుషులకు బదులుగా రోబోలను నియమించుకుని, ఉద్యోగుల అవసరాన్ని తగ్గించుకునే ధోరణి పెరుగుతోందని హెచ్చరించారు. ఏఐ వల్ల ఉత్పాదకత పెరిగినా, అదే సమయంలో ఉపాధి అవకాశాలు తగ్గితే సామాన్య ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆయన సూచించారు. ఉద్యోగాలు తగ్గిపోతే ప్రభుత్వాలకు వచ్చే పన్నుల ఆదాయం కూడా తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రభుత్వాలు ఉద్యోగుల ఆదాయం, సంస్థల కార్యకలాపాల ద్వారా వచ్చే పన్నులను ఉపయోగించి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. అయితే.. భవిష్యత్తులో మనుషుల స్థానంలో యంత్రాలు ఎక్కువగా పనిచేస్తే ఈ ఆదాయ వ్యవస్థపై ఒత్తిడి పెరగవచ్చు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఏఐ వినియోగంపై 'టోకెన్ ట్యాక్స్‌' విధించడం, అధిక సంపద కలిగిన బిలియనీర్లపై పన్నులు పెంచడం వంటివి చేసే అవకాశం ఉందని ఆయన సూచించారు. తాను ఇప్పటికే తన జీవితకాలంలో 14 బిలియన్ డాలర్ల పన్నులు చెల్లించానని, అవసరమైతే 40 బిలియన్ డాలర్లు చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.

60,000 మందికి వాలంటరీ ఎగ్జిట్
బిల్ గేట్స్ ఈ వ్యాఖ్యలు చేసిన తరువాత.. మైక్రోసాఫ్ట్ సుమారు 60,000 మంది (కంపెనీ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో దాదాపు నాలుగో వంతు) ఉద్యోగులకు వాలంటరీ ఎగ్జిట్ (స్వచ్ఛందంగా ఉద్యోగం నుంచి వైదొలగడం) అవకాశం కల్పించినట్లు వార్తలు రావడం టెక్ రంగంలో చర్చకు దారితీసింది. అమెరికా, కెనడా, యూకే, భారత్‌లోని అర్హత కలిగిన బృందాల్లో లెవెల్ 70 లేదా అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్న ఉద్యోగులకు ఈ అఫర్ వర్తిస్తుందని సమాచారం.

ఇదీ చదవండి: వాటర్ కంటే పెట్రోల్ చీప్.. పన్నులు లేని దేశం!

వాలంటరీ ఎగ్జిట్ ఎంచుకునే ఉద్యోగులకు వారి సర్వీసు కాలాన్ని బట్టి సెవరెన్స్ ప్యాకేజీతో పాటు, కొంతకాలం పాటు స్టాక్ వెస్టింగ్ ప్రయోజనాలు, పరిమిత కాలానికి ఆరోగ్య బీమా, కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి అవసరమైన సహాయం అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆఫర్‌పై నిర్ణయం తీసుకోవడానికి ఉద్యోగులకు డిసెంబర్ ఆరంభం వరకు గడువు ఇచ్చినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement