ఏఐ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దిగ్గజ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు.. కృత్రిమ మేధ సాంకేతికత అభివృద్ధి కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. అయితే.. ఈ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నప్పటికీ, వాటి ద్వారా వస్తున్న ఆదాయం మాత్రం ఆశించిన స్థాయిలో లేదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో ఏఐ పరిశ్రమ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని పెట్టుబడిదారు, వ్యాపారవేత్త నిఖిల్ కామత్ అభిప్రాయపడ్డారు.
ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్ 2026లో నిఖిల్ కామత్ మాట్లాడుతూ.. ఏఐ రంగంలో పెట్టుబడులకు, ఆదాయానికి మధ్య భారీ అంతరం ఉందని పేర్కొన్నారు. ఏఐ రంగంలో ప్రతి ఏడాది దాదాపు ఒక ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నారు. కానీ సంస్థలు ఏఐ సేవల ద్వారా పొందుతున్న ఆదాయం మాత్రం 100 బిలియన్ నుంచి 200 బిలియన్ డాలర్ల మధ్యే ఉంది. అంటే.. పెట్టుబడులకు, ఆదాయానికి మధ్య ఏటా 700 బిలియన్ నుంచి 800 బిలియన్ డాలర్ల వరకు వ్యత్యాసం ఉంటుంది.
కొత్త పెట్టుబడులు
ఇప్పటికే అమెరికాలో ఏఐ అభివృద్ధి కోసం మధ్యప్రాచ్య దేశాలు, విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులు సమకూర్చారు. అయితే.. ఇదే స్థాయిలో ప్రతి సంవత్సరం కొత్త పెట్టుబడులను తీసుకురావడం అంత సులభం కాదని నిఖిల్ కామత్ అభిప్రాయపడ్డారు.
ఏఐ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విలువ సుమారు 100 ట్రిలియన్ నుంచి 120 ట్రిలియన్ డాలర్ల వరకు ఉండగా, అందులో సేవల రంగం వాటా 50 నుంచి 60 శాతం ఉంటుందని కామత్ వివరించారు. ఈ రంగంలో 10 శాతం కార్యకలాపాలను ఏఐ ప్రభావితం చేయగలిగితే, ఉత్పాదకత పెరుగుదల ద్వారా 6 ట్రిలియన్ నుంచి 7 ట్రిలియన్ డాలర్ల వరకు ప్రయోజనం కలగవచ్చని అంచనా వేశారు.
ప్రయోజనాలు ఎలా?
అయితే.. ఈ స్థాయిలో ప్రయోజనాలు వాస్తవంగా కనిపిస్తున్నాయా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదని కామత్ పేర్కొన్నారు. అంటే, ఏఐపై కంపెనీలు భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ, ఆ పెట్టుబడులకు తగ్గట్టుగా ఆర్థిక ప్రయోజనాలు అందుతున్నాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది. వచ్చే ఏడాది ఏఐ కంపెనీలకు నిధుల సమీకరణ మరింత కష్టంగా మారవచ్చని ఆయన హెచ్చరించారు.
అమెరికా ట్రెజరీ బాండ్లపై వడ్డీ రేట్లు 5 నుంచి 7 శాతం వరకు పెరిగితే.. అప్పులు తీసుకోవడం, కొత్త పెట్టుబడులను ఆకర్షించడం కంపెనీలకు భారంగా మారుతుంది. ఇప్పటికే భారీగా ఖర్చు చేస్తున్న సంస్థలకు ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగకపోతే ఆర్థిక ఒత్తిడి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఏఐ ద్వారా భవిష్యత్తులో ట్రిలియన్ల డాలర్ల ఆదాయం వస్తుందనే అంచనాలు నిజం కావాలంటే, ప్రస్తుతం పెట్టుబడులకు, ఆదాయానికి మధ్య ఉన్న అంతరాన్ని భర్తీ చేయగలిగే మార్గాలను కంపెనీలు కనుగొనాల్సి ఉంటుందని నిఖిల్ కామత్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు షాక్!


