హైదరాబాద్‌ మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగుల జాబ్స్‌ పోతాయా! | Inside Microsoft Massive 60000-Staff Exit AI Job Market Shift | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగుల జాబ్స్‌ పోతాయా!

Oct 27 2026 12:03 PM | Updated on Oct 27 2026 12:03 PM

Inside Microsoft Massive 60000-Staff Exit AI Job Market Shift

అత్యున్నత సాంకేతికతలతో ప్రపంచాన్ని శాసించాలన్న ఆశతో ఉన్న ఉద్యోగుల ప్రయాణం మధ్యలోనే ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇన్నాళ్లు అంకితభావంతో పనిచేసిన వారి జీవితాలు కేవలం డెడ్‌లైన్లు, త్రైమాసిక లాభాల లెక్కలకే పరిమతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల మైక్రోసాఫ్ట్‌ తీసుకున్న నిర్ణయం వేలాది కుటుంబాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. భారత్‌తో పాటు అమెరికా, బ్రిటన్‌, కెనడా దేశాల్లోని దాదాపు 60,000 మంది ఉద్యోగులకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ ప్యాకేజీలను ప్రకటించింది. కేవలం ఒక సంస్థ ఉద్యోగాల కోత లేదా నిష్క్రమణ వార్తగానే కాకుండా మారుతున్న టెక్‌ ప్రపంచంలో ఉపాధి భద్రత ప్రశ్నార్థకమవుతున్న తీరుకు ఇది అద్దం పడుతోంది.

ప్రస్తుత సవాళ్లు.. మారుతున్న పోకడలు

ప్రస్తుత గ్లోబల్ టెక్‌ జాబ్ మార్కెట్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కొవిడ్ అనంతర కాలంలో జరిగిన భారీ నియామకాల తప్పులను సరిదిద్దుకునే పేరుతో సాగుతున్న ఈ కోతలు ఇప్పుడు కేవలం బడ్జెట్ సర్దుబాట్ల స్థాయిని దాటి పూర్తిగా ఏఐ కేంద్రీకృత వలసలకు దారితీస్తున్నాయి. సాంప్రదాయ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, కోడింగ్, మాన్యువల్ టెస్టింగ్ వంటి రంగాల ప్రాధాన్యత తగ్గిపోయి ఆటోమేషన్, ఏఐ ఆధారిత టూల్స్ వేగంగా విస్తరిస్తున్నాయి.

ఇండియాలో ప్రభావం ఎంతంటే..

మైక్రోసాఫ్ట్ తీసుకున్న ఈ స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీ విధానం చూస్తే.. ఇది సంప్రదాయ బలవంతపు లేఆఫ్స్‌ కంటే భిన్నంగా కనిపిస్తుంది. అయినప్పటికీ ఉద్యోగులపై మానసికంగా తీవ్ర ఒత్తిడిని కలుగజేస్తోంది. కంపెనీ అంతర్గత గ్రేడ్ స్థాయిల ప్రకారం లెవెల్ 70 లేదా అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్న ఉద్యోగులను ఈ ప్యాకేజీకి అర్హులుగా గుర్తించారు. భారత్‌లో మైక్రోసాఫ్ట్‌కు సుమారు 23,000 మంది ఉద్యోగులు ఉండగా ఈ స్వచ్ఛంద విరమణ ఎంపికల ప్రభావం ఇక్కడ కూడా గణనీయంగా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్‌లోనూ కొందరు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోపైలట్‌, కోర్‌ఏఐ వంటి అత్యాధునిక ఏఐ విభాగాలు విస్తరిస్తున్న తరుణంలో క్లౌడ్, సెక్యూరిటీ, మార్కెటింగ్, హార్డ్‌వేర్ విభాగాలలోని ఉద్యోగులపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అర్హులైన ఉద్యోగులు డిసెంబర్ 1వ తేదీలోగా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో టెక్‌ నిపుణుల్లో అనిశ్చితి నెలకొంది.

ఉద్యోగులు ఏం చేయాలి?

ఇలాంటి అనిశ్చితితో కూడిన కార్పొరేట్ వాతావరణంలో టెక్‌ ఉద్యోగులు ఆందోళనకు గురికాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

నైపుణ్యాల పునరుద్ధరణ: కేవలం ఒకే రకమైన కోడింగ్ లేదా టెక్నాలజీపై ఆధారపడకుండా ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ ఆర్కిటెక్చర్, సైబర్ సెక్యూరిటీ వంటి భవిష్యత్తుకు అవసరమైన అధునాతన నైపుణ్యాలను వేగంగా నేర్చుకోవాలి. ఏఐని భయంగా కాకుండా ఉత్పాదకతను పెంచుకునే సాధనంగా మల్చుకోవాలి.

ఆర్థిక భద్రత, అత్యవసర నిధి: కార్పొరేట్ రంగంలో ఎప్పుడు ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో అంచనా వేయడం కష్టం. కాబట్టి కనీసం ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు కుటుంబ ఖర్చులను నిర్వహించగలిగేలా ఎమర్జెన్సీ ఫండ్‌ను సిద్ధంగా ఉంచుకోవడం అత్యవసరం. అనవసర రుణాలకు దూరంగా ఉండాలి.

స్వచ్ఛంద ప్యాకేజీల పరిశీలన: మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు అందించే వీఈఓ ప్యాకేజీల్లో సెవరెన్స్ పే కింద ప్రతి ఏడాదీ పూర్తి చేసిన సేవకు నెలవారీ వేతనం, ఆరోగ్య బీమా, కెరీర్ ట్రాన్సిషన్ సేవలు లభిస్తాయి. ఉద్యోగాన్ని బలవంతంగా కోల్పోవడం కంటే ఆర్థిక ప్రయోజనాలతో కూడిన ఇలాంటి ప్యాకేజీలను సరికొత్త కెరీర్ అవకాశాలకు మలుపుగా ఉపయోగించుకోవచ్చు.

వృత్తిపరమైన నెట్‌వర్కింగ్: లింక్డ్‌ఇన్‌ వంటి వేదికల ద్వారా పరిశ్రమలో ఇతర నిపుణులతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలి. కేవలం ఒకే కంపెనీపై ఆధారపడకుండా స్టార్టప్‌లు, కన్సల్టెన్సీలు, ఇతర రంగాల్లో మారుతున్న అవకాశాలపై నిరంతరం దృష్టి పెట్టాలి. మొత్తంగా చూస్తే, టెక్‌ పరిశ్రమలో జరుగుతున్న ఈ పరిణామాలు మానవ వనరుల ప్రాధాన్యతను ప్రశ్నార్థకం చేస్తున్నప్పటికీ మారుతున్న కాలానికి తగినట్టుగా నైపుణ్యాలు నేర్చుకోవాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: మళ్లీ సీన్‌ రివర్స్‌.. బంగారం ధరల దడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement