ఏఐ సాంకేతికతపై విమర్శలు గుప్పించడం సరికాదని, వినూత్న సాంకేతిక మార్పుల పట్ల యువతలో భయాలు కాకుండా భరోసా నింపాల్సిన బాధ్యత అందరిపై ఉందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో 400 మంది ఉద్యోగుల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ‘ర్యాండమ్ ట్రీస్’ ప్రధాన కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఏఐ రాకతో ఉద్యోగాలు పోతాయన్నది కేవలం అపోహ మాత్రమేనని, ఇది సరికొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ స్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్, రీస్కిల్లింగ్‌పై దృష్టి సారించి ఐటీ రంగంలోని మార్పులను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రైవేట్ రంగానికి ప్రోత్సాహం అవసరం
‘పరిశ్రమలు, పెట్టుబడుల విస్తరణకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకర వాతావరణం లభించాలి. ఉన్న కంపెనీలకు నిరంతర విద్యుత్, నీరు, మెరుగైన రహదారుల వంటి మౌలిక వసతులు కల్పిస్తే సరిపోతుంది. ప్రైవేట్ రంగ విస్తరణతోనే యువతకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయి’ అని కేటీఆర్ తెలిపారు. గత పదేళ్లలో తెలంగాణ సాధించిన ఐటీ ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో డేటా, ఏఐ రంగాల్లో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక పాలసీలను తీసుకువచ్చామని గుర్తుచేశారు.
విప్లవాత్మక మార్పులకు ఆద్యం
ప్రత్యేకించి వ్యవసాయం, వైద్యం, విద్యా రంగాల్లో ఏఐ సాంకేతికత విప్లవాత్మక మార్పులను తీసుకువస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. భాగ్యనగరం అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ ఏఐ హబ్‌గా, విదేశీ పెట్టుబడులకు చిరునామాగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో ర్యాండమ్ ట్రీస్ సంస్థ ప్రతినిధులు, ఐటీ ప్రముఖులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: స్వల్ప వ్యవధిలోనే వెండి రూ.30,000 డౌన్!


