చిరు వ్యాపారాల్లో ఏఐ జోరు.. కానీ ఒక్కటే సమస్య! | AI Adoption Small Businesses But One Major Skill Gap Threatens Goldman Sachs | Sakshi
Sakshi News home page

చిరు వ్యాపారాల్లో ఏఐ జోరు.. కానీ ఒక్కటే సమస్య!

Oct 26 2026 12:56 PM | Updated on Oct 26 2026 1:02 PM

AI Adoption Small Businesses But One Major Skill Gap Threatens Goldman Sachs

ప్రపంచవ్యాప్తంగా ఏఐ సాంకేతికత విప్లవాత్మక మార్పులు సృష్టిస్తున్న తరుణంలో అమెరికాలోని చిన్న వ్యాపార రంగంలో ఏఐ వినియోగం ఊహించని రీతిలో దూసుకుపోతోంది. ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మ్యాన్ సాక్స్‌ వెలువరించిన తాజా నివేదిక ప్రకారం.. అమెరికన్ చిన్న వ్యాపార సంస్థల్లో ఏఐ అడాప్షన్ రేటు అత్యధిక స్థాయికి చేరింది. అయితే, టెక్నాలజీని స్వీకరించడంలో వేగం కనిపిస్తున్నప్పటికీ దాన్ని క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అనుసంధానించడంలో మాత్రం వ్యవస్థాపకులు సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

అమాంతం పెరిగిన ఏఐ వినియోగం

గోల్డ్‌మ్యాన్ సాక్స్‌ ‘10,000 స్మాల్ బిజినెస్ ప్రోగ్రామ్’ పూర్వ విద్యార్థులు, యజమానుల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. దీని ప్రకారం, అమెరికాలోని చిన్న వ్యాపారాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం అనూహ్యంగా పుంజుకుని ఏకంగా 86 శాతానికి తాకింది. రెండేళ్ల క్రితం కేవలం 56 శాతంగా ఉన్న ఈ వినియోగం తక్కువ కాలంలోనే ఇంత భారీగా పెరగడం గమనార్హం. వ్యాపార నిర్వహణను సులువు చేసుకోవడానికి, ఉత్పాదకతను పెంచుకోవడానికి, ఆర్థిక విశ్లేషణలు, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి చిన్న వ్యాపార యజమానులు ఎక్కువగా ఏఐ వైపు మొగ్గు చూపుతున్నారని నివేదిక వివరిస్తోంది.

సాంకేతిక నైపుణ్యాల కొరత

ఒకవైపు ఏఐని తమ వ్యాపారాల్లోకి ఆహ్వానిస్తున్నా, మరోవైపు ఆచరణలో మాత్రం పలు అడ్డంకులు వేధిస్తున్నాయి. ముఖ్యంగా తగినంత సాంకేతిక నైపుణ్యం కొరవడటం చిన్న వ్యాపారాలకు పెద్ద సవాల్‌గా మారుతోంది. అధునాతన ఏఐ టూల్స్‌ను ఎలా ఆపరేట్ చేయాలి, వాటిని రోజువారీ విధుల్లో ఏ విధంగా సమర్థవంతంగా వాడుకోవాలి అనే దానిపై స్పష్టత లేకపోవడంతో చాలా సంస్థలు ప్రాథమిక స్థాయిలోనే ఆగిపోతున్నాయి. సరైన శిక్షణ, డిజిటల్ వనరుల లేమి కారణంగానే వందలాది వ్యాపారాలు ఏఐ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాయని సర్వేలో వెల్లడైంది. డేటా భద్రత, గోప్యతా ఆందోళనలతో పాటు సరైన ఏఐ టూల్స్‌ను ఎంపిక చేసుకోవడంలోనూ గందరగోళం నెలకొందని నివేదిక పేర్కొంది.

భారీ పెట్టుబడులు

చిన్న వ్యాపార రంగంలో ఏఐ ఎదుర్కొంటున్న ఈ సాంకేతిక అడ్డంకులను అధిగమించడానికి, వాటికి అండగా నిలిచేందుకు గోల్డ్‌మ్యాన్ సాక్స్‌ రంగంలోకి దిగింది. చిన్న వ్యాపారాలకు తక్షణ, ఆచరణాత్మక మద్దతు అందించే ఉద్దేశంతో ఏకంగా 500 మిలియన్ డాలర్ల భారీ నిధులతో ‘స్మాల్ బిజినెస్ ఏఐ ఇన్‌స్టిట్యూట్’ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఓపెన్ఏఐ, గూగుల్, ఆంత్రోపిక్, మెటా వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాల భాగస్వామ్యంతో ఈ సంస్థ ముందుకు సాగనుంది. చిన్న వ్యాపారాల యజమానులకు, వారి సిబ్బందికి ఏఐ వినియోగంపై తగిన శిక్షణనిచ్చి వారిని సాంకేతికంగా తీర్చిదిద్దడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యమని గోల్డ్‌మ్యాన్ సాక్స్‌ వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చదవండి: గాంధీజీ ‘ఐదో కుమారుడు’.. రూ.14 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement