ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్ డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో తన స్థానాన్ని మరింత విస్తరించేందుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటివరకు కేవలం మూడు నిమిషాలు లేదా అంతకంటే తక్కువ నిడివి గల షార్ట్-ఫార్మ్ రీల్స్‌తో కోట్లాది మంది యూజర్లను ఆకట్టుకున్న ఈ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు ఏకంగా 90 నిమిషాల నిడివి గల లాంగ్-ఫార్మ్ హారిజాంటల్ (అడ్డంగా ఉండే) వీడియోల ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఈ మేరకు అధికారిక వర్గాలు కొత్త అప్‌డేట్‌ను వెల్లడించాయి.
పాడ్‌కాస్టర్లు, కమెడియన్లు, ఇతర లాంగ్-ఫార్మ్ కంటెంట్ క్రియేటర్లను దృష్టిలో ఉంచుకుని ఇన్‌స్టాగ్రామ్ ‘ఫీచర్స్’ పేరుతో ఈ వెసులుబాటు తీసుకొచ్చింది. యూజర్లు తమకు నచ్చిన పాడ్‌కాస్ట్ లేదా ఇతర లాంగ్-ఫార్మ్ వీడియోల షార్ట్ క్లిప్స్‌ను ‘రీల్స్’ రూపంలో చూస్తున్నప్పుడు, అక్కడికక్కడే ఆయా క్రియేటర్ల పూర్తి వీడియోకు లింక్ ద్వారా కనెక్ట్ అయ్యేలా ఈ ఫీచర్‌ను డిజైన్ చేశారు. దీని ద్వారా చిన్న క్లిప్ చూసిన వారు నేరుగా అక్కడే పూర్తి నిడివి గల అసలు వీడియోను వీక్షించే అవకాశం లభిస్తుంది.
ప్రస్తుతం ఈ ఫీచర్‌ను అమెరికాలోని ఎంపిక చేసిన కొంతమంది క్రియేటర్లతో కలిసి పరీక్షిస్తున్నట్లు సంస్థ తెలిపింది. బ్రెజిల్‌లో ఇప్పటికే ఈ ఫీచర్‌ను పరిశీలించిన ఇన్‌స్టాగ్రామ్ త్వరలోనే అమెరికాలో పది వేల మందికి పైగా క్రియేటర్లకు దీన్ని విస్తరించే ప్రణాళికలో ఉంది. ఈ లాంగ్-ఫార్మ్ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ ఎక్స్‌ప్లోర్ పేజీతో పాటు ఇతర ప్రాంతాలలో కూడా యూజర్లకు రికమండ్ చేయనున్నారు.
మొబైల్ ఫోన్లతో పాటు ఈ సదుపాయాన్ని ‘ఇన్‌స్టాగ్రామ్ ఫర్ టీవీ’కి కూడా తీసుకురావాలన్నది ప్రధాన లక్ష్యంగా ఉంది. గత సంవత్సరంలో శామ్‌సంగ్, ఫైర్ టీవీ, గూగుల్ టీవీలలో ప్రారంభమైన ఈ టీవీ అనుభవం ఇప్పుడు అమెరికాలో యాపిల్ టీవీకి కూడా విస్తరిస్తోంది. మొత్తానికి, షార్ట్-ఫార్మ్ వీడియోలతో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు లాంగ్-ఫార్మ్ కంటెంట్ వైపు అడుగులు వేస్తూ డిజిటల్ వినోద రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత చాటుకునే ప్రయత్నం చేస్తోంది.
ఇదీ చదవండి: మళ్లీ సీన్ రివర్స్.. బంగారం ధరల దడ


