న్యూఢిల్లీ: సోషల్ మీడియా వేదికగా సైబర్ నేరగాళ్లు కొత్త దందాలకు తెరలేపారు. ప్రముఖుల పేర్లను, సంస్థలను అడ్డుపెట్టుకుని అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరిగి పోతున్నాయి.తాజాగా, కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, సీజేపీ పేరిట నకిలీ సోషల్ మీడియా అకౌంట్లతో మోసాలకు పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఒరిజినల్ అకౌంట్లను పోలి ఉండేలా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి, ప్రజల నుంచి విరాళాలు వసూలు చేస్తున్నట్లు తేలింది. ఈ నకిలీ వసూళ్లపై జాతీయ మీడియాలో వరుస కథనాలు వెలుగులోకి వచ్చాయి.
అసలేం జరుగుతోంది?
ఇన్ స్టాగ్రామ్‌లో అభిజిత్ దిప్కే,సీజేపీ పేరిట పదుల సంఖ్యలో ఫేక్ ప్రొఫైల్స్ పుట్టుకొచ్చాయి. అసలు అకౌంట్‌ను పోలి ఉండే ప్రొఫైల్ పిక్చర్లు, పోస్టులను ఇవి ఉపయోగిస్తున్నాయి. సామాజిక సేవ, అత్యవసర వైద్య సహాయం పేరుతో అమాయక ప్రజలకు మెసేజ్‌లు పంపుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఫేక్ అకౌంట్లకు, తమకు గానీ లేదా తమ ప్రతినిధులకు గానీ ఎలాంటి సంబంధం లేదని అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని ఆయన కోరారు.
అప్రమత్తంగా ఉండాలి
సోషల్ మీడియా వినియోగదారులు ఇలాంటి నకిలీ అకౌంట్ల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ప్రముఖులు,సంస్థల పేరుతో సోషల్ మీడియాలో డబ్బులు లేదా విరాళాలు అడిగితే గుడ్డిగా నమ్మవద్దని సూచించారు. సంబంధిత సంస్థలు,వ్యక్తుల అధికారిక వెబ్‌సైట్లు, అలాగే వెరిఫైడ్ (బ్లూ టిక్ ఉన్న) ఒరిజినల్ అకౌంట్ల ద్వారా మాత్రమే నిజానిజాలు తెలుసుకోవాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : సీజేపీ నేతల కస్టడీ పొడిగింపు


