ప్రజాతీర్పుకు ద్రోహం  | CJP Urges All Parties To Oppose Delimitation Bill | Sakshi
Sakshi News home page

ప్రజాతీర్పుకు ద్రోహం 

Nov 29 2026 5:56 AM | Updated on Nov 29 2026 5:56 AM

CJP Urges All Parties To Oppose Delimitation Bill

డీలిమిటేషన్‌పై సీజేపీ ధ్వజం

ప్రతి పార్టీ వ్యతిరేకించాలని పిలుపు 

న్యూఢిల్లీ: బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న డీలిమిటేషన్‌ బిల్లును పార్లమెంటు సభ్యులందరూ పార్టీలకు అతీతంగా తిరస్కరించాలని కాక్రోచ్‌ జనతా పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ బిల్లుకు మద్దతిచ్చే పార్టీ, ప్రజా ప్రనతినిధి ఎవరైనా ప్రజాతీర్పుకు ద్రోహం చేసినట్లేనని తెలిపింది. ఈ బిల్లు ద్వారా అధికార పార్టీ తనకు అనుకూలంగా ఉండేలా పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల స్వరూపాలను మార్చేస్తుందని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆరోపించింది. 

దేశ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేసే ఈ కుతంత్రాన్ని అన్ని పార్టీలు కలిసికట్టుగా ఎదుర్కొవాలని కోరింది. ‘‘కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్లను కేంద్రీకరించడం, మరికొన్నింటిలో విభజించడం ద్వారా పోలైన ఓట్లతో సంబంధం లేకుండా ఫలితాలను తారుమారు చేయవచ్చు. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. తగిన ఏర్పాట్లు, స్వతంత్ర పర్యవేక్షణ లేకుండా నియోజకవర్గాల సరిహద్దులను మార్చేయడం బీజేపీకి ఎల్లప్పుడూ ప్రయోజనం కలిగించేలా చేయవచ్చు.’’అని వివరించింది. 

నియోజకవర్గాల సరిహద్దులు కొన్ని దశాబ్దాల పాటు రాజకీయ ప్రాతినిథ్యానికి ఒక రూపునిస్తాయని, వీటిని అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా మారిస్తే ప్రజాభిప్రాయంలో వచ్చే మార్పులు ఎన్నికల్లో స్పష్టంగా ప్రతిఫలించే అవకాశాలు తగ్గిపోతాయని అన్నారు. ఎన్నికల కమిషన్‌ ఓటర్ల జాబితా విషయంలో చేసినట్లుగానే డీలిమిటేషన్‌లో కూడా అవకతవకలకు పాల్పడవచ్చునని ఆందోళన వ్యక్తం చేసింది. ‘ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఇప్పటికే ఓట్‌చోరీ ద్వారా దేశద్రోహిగా మారారు. 

అలాంటి వ్యక్తి డీలిమిటేషన్‌ కమిషన్‌లో ఉంటే ఎన్నికల ప్రక్రియలపై ప్రజలకు ఉన్న విశ్వాసం మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది’’అని విమర్శించింది. కొన్ని పార్టీలు... డీలిమిటేషన్‌ ద్వారా అందరికీ సమానంగా 50 శాతం సీట్లు పెరుగుతున్నందుకు మద్దతిస్తున్నట్లు చెబుతున్నాయని, అయితే వీరు అసోంలో ఏం జరిగిందో చూడాలని సీజేపీ నేత అశుతోష్‌ రాంకా అభ్యర్థించారు. ‘ప్రతిపక్ష పార్టీలు బీజేపీకి, ప్రజాస్వామ్యనికి వ్యతిరేకంగా చేస్తున్న కుట్రలకు అనుకూలంగా వ్యవహరిస్తే అది ప్రజలకు చేసిన అతిపెద్ద ద్రోహం అవుతుంది. ఈ అపవిత్ర, సిద్ధాంతరహిత రాజకీయాల ఫలితాలను యువత అనుభవించాల్సి వస్తుంది’’అని మరో నేత సౌరవ్‌ దాస్‌ విమర్శించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement