డీలిమిటేషన్‌కు డీఎంకే మద్దతు  | DMK has announced its support for the Centre revised delimitation bill | Sakshi
Sakshi News home page

డీలిమిటేషన్‌కు డీఎంకే మద్దతు 

Nov 29 2026 5:51 AM | Updated on Nov 29 2026 5:51 AM

DMK has announced its support for the Centre revised delimitation bill

తమిళనాడుకు నష్టం లేదు 

ప్రాతినిథ్యం 7.21 శాతానికి పెరగనుంది 

అందుకే మద్దతిస్తున్నాం: ఏ.రాజా 

డీఎంకే గళం వినిపించండి 

ఎంపీలకు ఎం.కె.స్టాలిన్‌ పిలుపు

చెన్నై: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు మద్దతిస్తున్నట్లు ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) శనివారం ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు ఎం.కే.స్టాలిన్‌ ఎంపీలతో చర్చించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాజీ కేంద్ర మంత్రి ఎ.రాజా చెన్నైలో తెలిపారు. రాబోయే 25 ఏళ్లపాటు నియోజకవర్గాల పునర్విభజన జరగదు కాబట్టి ఈ బిల్లు వల్ల తమిళనాడుకు ఇబ్బంది లేదని ఎ. రాజా అభిప్రాయపడ్డారు. 

బిల్లులోని ఇతర అంశాలపై పార్లమెంటులో చర్చిస్తామని, అవసరమైతే సవరణలు కోరతామని చెప్పారు. ఒకవేళ పునర్విభజన ప్రక్రియలో మత, భాషా మైనారిటీలకు నష్టం కలిగే చర్యలు ఉంటే వారికి అండగా నిలబడతామని ఆయన స్పష్టం చేశారు. డీఎంకే డిమాండ్లను చట్టంలో పొందుపరిచిన కారణంగా బిల్లుకు మద్దతివ్వాలని స్టాలిన్‌ తన ప్రసంగంలో సూచనప్రాయంగా తెలిపగా... సమావేశం తరువాత రాజా విలేకరులతో మాట్లాడుతూ పార్టీ వైఖరి స్పష్టంగా ఉందని చెప్పారు.

 ‘‘అన్ని రాష్ట్రాల్లోని పార్లమెంటు స్థానాలను యాభై శాతం పెంచుతూ కేంద్రం ప్రతిపాదించిన బిల్లుకు మద్దతివ్వాలని డీఎంకే తీర్మానించింది’’అని అన్నారు. లోక్‌సభలో తమిళనాడు ప్రాతినిథ్యం 7.18 శాతం ఉండేలా చూడటం ద్వారా తాము రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకున్నామని అన్నారు. డీలిమిటేషన్‌తో ప్రాతినిథ్యం 7.21 శాతానికి పెరుగుతోందని చెప్పారు. 

ఇంతకంటే ముందు డీఎంకే ప్రధాన కార్యాలయం ’అన్నా అరివాలయం’లోని మురసోలి మారన్‌ హాల్‌లో ఎంకే స్టాలిన్‌ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతూ నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని దూరదృష్టితో చూస్తున్నామని, పార్లమెంటులో పార్టీ వైఖరిని ధైర్యంగా వినిపించాలని పిలుపునిచ్చారు. 

డీఎంకే గొంతు ఎత్తకపోయి ఉంటే బీజేపీ ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రమే సీట్లు పెంచేవారని, తమిళనాడు వాటా తగ్గించే వారని అన్నారు. అయితే ముసాయిదా బిల్లును పరిశీలిస్తే డీఎంకే చేసిన ప్రధాన డిమాండ్లలో రెండింటిని నెరవేర్చారని మూడేళ్లుగా చేస్తున్న పోరాటానికి దక్కి ఫలితం ఇది అని అన్నారు.

 1967 పునర్విభజన సమయంలో తమిళనాడు లోక్‌సభ స్థానాల సంఖ్య 42 నుంచి 39కి తగ్గాయని ‘‘ఇప్పుడు మన వాటాలో ఎలాంటి మార్పు లేకుండానే సీట్ల సంఖ్య పెంచుకున్నాం’’అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బీజేపీ ఎలాంటి సంప్రదింపులు, హామీల్లేకుండా ఏకపక్షంగా బిల్లు తీసుకొస్తే డీఎంకే అడ్డుకుందని, పార్టీ దివంగత అగ్రనేత ఎం. కరుణానిధిని చెప్పినట్లు ‘‘కత్తి ఎప్పుడు, డాలు ఎప్పుడు పట్టాలో నిర్ణయించుకుని నడుచుకోవాలి’’అని ఎంపీలకు సూచించారు. 

కాంగ్రెస్‌పై ధ్వజం 
డీఎంకే పార్టీ ఎప్పుడూ న్యాయమైన పునర్విభజన (ఫెయిర్‌ డీలిమిటేషన్‌) మాత్రమేనని, ఎన్నడూ పునర్విభజనను తిరస్కరించలేదని స్పష్టం చేస్తూనే.. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. కాంగ్రెస్‌ నీచమైన ఆరోపణలు చేస్తోందని, రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని మండిపడింది. కాంగ్రెస్‌ పార్టీ తన విధానాలను పక్కనపెట్టి రాత్రికి రాత్రే కూటమి నుంచి బయటకు వెళ్లి అధికారం కోసం వేరే చోట చేరిందని డీఎంకే తన తీర్మానంలో విమర్శించింది. 

ఇప్పుడు డీఎంకే ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేయడం తగదని పేర్కొంది. తమిళనాడులో సి. జోసెఫ్‌ విజయ్‌ సంకీర్ణ ప్రభుత్వంలో చేరడానికి అర్ధరాత్రి రహస్యంగా పక్కదారి పట్టిందని ఆరోపించింది. ‘మాట మార్చడం కాంగ్రెస్‌ పార్టీకి పుట్టుకతో వచ్చిన దుర్గుణం’అని డీఎంకే ఎంపీలు విమర్శించారు. సిద్ధాంతాల గురించి డీఎంకేకు నీతులు చెప్పే నాటకాలను ఆపాలని, తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటరీ ప్రాతినిథ్య హక్కులను దెబ్బతీసే చర్యలకు మద్దతు ఇచ్చే ‘ద్రోహపూరిత‘ పనులను మానుకోవాలని డీఎంకే తన తీర్మానంలో హితవు పలికింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement