పాక్‌ నిధుల ఆరోపణలు.. కేంద్ర మంత్రికి ‘కాక్రోచ్‌’ లీగల్ నోటీసు | Union Minister Jitendra singh Receives Defamation Notice from CJP | Sakshi
Sakshi News home page

పాక్‌ నిధుల ఆరోపణలు.. కేంద్ర మంత్రికి ‘కాక్రోచ్‌’ లీగల్ నోటీసు

Nov 28 2026 7:59 AM | Updated on Nov 28 2026 8:06 AM

Union Minister Jitendra singh Receives Defamation Notice from CJP

చండీగఢ్: పాకిస్థాన్ నుంచి నిధులు అందుకున్నారంటూ చేసిన ఆరోపణలు రాజకీయ వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) సహ కన్వీనర్ అశుతోష్ రాంకా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌కు పరువు నష్టం నోటీసు పంపించారు. బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పడంతోపాటు రూ.3 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించిన రాంకా.. తన దేశభక్తి, నిజాయితీని ప్రశ్నించే వ్యాఖ్యలను సహించబోనని స్పష్టం చేశారు.

నవంబర్ 3న ఆరోపణలు
నవంబర్ 3న బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ ఆరోపణలు చేసినట్లు తెలియవచ్చింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అమెరికా నుంచి నిధులు అందుకోగా, అశుతోష్ రాంకా పాకిస్థాన్ నుంచి డబ్బులు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్‌)కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారానికి పాకిస్థానీ రాజకీయ నాయకులు సహా భారత్ వ్యతిరేక సంస్థలు, విదేశీ నిధులు పొందుతున్న బృందాల నుంచి ఆర్థిక మద్దతు అందుతోందని వ్యాఖ్యానించారు. కొందరు కార్యకర్తలు తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారని కూడా ఆరోపించారు.

మూడు ప్రధాన డిమాండ్లు
సీజేపీ ప్రకటన ప్రకారం.. పార్టీ న్యాయ విభాగం తరఫున న్యాయవాది అభిక్ చిమ్నీ ద్వారా జితేంద్ర సింగ్‌కు ఈ నోటీసు పంపించారు. ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకోవాలని, బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, పరువు నష్టానికి పరిహారంగా రూ.3 కోట్లు చెల్లించాలని అందులో డిమాండ్ చేశారు. అయితే పరిహారంగా అందే మొత్తాన్ని భారత్‌లో ప్రాథమిక విద్య కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వాలని రాంకా ప్రతిపాదించడం గమనార్హం.

ఆధారాలు బయటపెట్టాలని సవాల్
తనకు పాకిస్థాన్ నుంచి నిధులు అందాయన్న ఆరోపణలకు సంబంధించి నిర్దిష్ట ఆధారాలు వెల్లడించాలని రాంకా నోటీసులో సవాల్ చేశారు. ఏ పాకిస్థానీ నేత డబ్బులు పంపారు? ఎంత మొత్తం చెల్లించారు? ఏ తేదీన లావాదేవీలు జరిగాయి? వాటికి సంబంధించిన పత్రాలేవి? అని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఆరోపణలు చేసినప్పటికీ ఏ నాయకుడి పేరు, చెల్లింపు మొత్తం, తేదీ, బ్యాంకు లావాదేవీ వివరాలు, ఖాతాలు లేదా నిధుల మూలాన్ని వెల్లడించలేదని నోటీసులో పేర్కొన్నారు.

ఐఐటీ కాన్పూర్, ఎల్‌ఎస్‌ఈలో విద్యాభ్యాసం
తన విద్యా, వృత్తిపరమైన నేపథ్యాన్ని కూడా రాంకా ప్రస్తావించారు. తాను కష్టపడి చదివి, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పూర్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ప్రవేశం పొందినట్లు తెలిపారు. భారత్‌కు తిరిగి వచ్చేందుకు మెకిన్సీలో మంచి వేతనంతో కూడిన ఉద్యోగాన్ని, లండన్‌లోని సౌకర్యవంతమైన జీవితాన్ని వదులుకున్నట్లు పేర్కొన్నారు. గత రెండేళ్లుగా ప్రజా సమస్యలపై చురుగ్గా పనిచేస్తున్నానని వెల్లడించారు. తన వృత్తిపరమైన కార్యకలాపాల ద్వారా సంపాదించిన ఆదాయం చట్టబద్ధమైనదని, నియంత్రిత బ్యాంకింగ్ మార్గాల్లోనే నిధులు అందుకున్నానని, వాటిని ఆదాయపు పన్ను రిటర్నుల్లోనూ ప్రకటించినట్లు వివరించారు.

‘గావి’తో వృత్తిపరమైన సంబంధాలు
మెకిన్సీతోపాటు ‘గావి’ సంస్థకు అందించిన వృత్తిపరమైన సేవలను కూడా రాంకా ప్రస్తావించారు. గావికి సలహాదారుగా పనిచేసిన తన పాత్రను నోటీసులో వివరించారు. భారత ప్రభుత్వం గావికి చేసిన విరాళాలను కూడా ప్రస్తావిస్తూ, ఆ సంస్థతో తన వృత్తిపరమైన సంబంధాలు చట్టబద్ధమైనవేనని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నోటీసులోని డిమాండ్లను నెరవేర్చకపోతే సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని సీజేపీ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: భీకర తుపానులు.. 7 లక్షల ఇళ్లకు విద్యుత్‌ సరఫరా కట్‌!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement