ప్రభుత్వం ఇప్పుడు కొత్త కారణాలను వెతుక్కుంటోంది: సీజేపీ | Saurav Das says passport discrepancies cited to stop him from flying to London | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం ఇప్పుడు కొత్త కారణాలను వెతుక్కుంటోంది: సీజేపీ

Nov 24 2026 6:41 PM | Updated on Nov 24 2026 6:43 PM

Saurav Das says passport discrepancies cited to stop him from flying to London

న్యూఢిల్లీ: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఉపన్యాసం ఇచ్చేందుకు లండన్ వెళ్లకుండా తనను ఢిల్లీ విమానాశ్రయంలో అడ్డుకున్నారని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సహ సమన్వయకర్త, అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపిన విషయం తెలిసిందే. తన ప్రయాణాన్ని నిలిపివేసేందుకు పాస్‌పోర్టులో లోపాలున్నాయని, పౌరసత్వంపై స్పష్టత లేదని అధికారులు కారణాలు చెప్పినట్లు వెల్లడించారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ప్రభుత్వం యువత గొంతును నొక్కలేకపోయింది. ఇప్పుడు కొత్త కారణాలను వెతుక్కుంటోంది. పాస్‌పోర్టులో లోపాలున్నాయి, పౌరసత్వం స్పష్టంగా లేదని చెబుతోంది. నేను విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లేదా మెహుల్ చోక్సీ అయి ఉంటే ఈ ప్రభుత్వం నాకు ఘన స్వాగతం పలికి, ప్రత్యేక భద్రత కల్పించేది. అలాంటప్పుడు మూడు నుంచి నాలుగు గంటల్లోనే లండన్‌కు బయలుదేరి ఉండేవాడిని’’ అని ఆయన అన్నారు. అయితే దాస్ చేసిన ఆరోపణలపై ఇప్పటివరకు ప్రభుత్వంగానీ, సంబంధిత అధికారులుగానీ స్పందించలేదు.

విమానాశ్రయంలో ఏం జరిగింది?
సోమవారం రాత్రి ఎక్స్‌ వేదికగా స్పందించిన దాస్.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనను అడ్డుకున్నారని తెలిపారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఉపన్యాసం ఇచ్చేందుకు లండన్ వెళ్లాల్సి ఉండగా, విమానాశ్రయంలో నిలిపివేసినట్లు పేర్కొన్నారు. మైగ్రేషన్‌ విభాగం తన పాస్‌పోర్టును అనుమానాస్పదంగా గుర్తించినట్లు అక్కడి అధికారులు చెప్పారని వెల్లడించారు.

ఈ ఘటనపై ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను కూడా పంచుకున్నారు. ‘‘నాకు తెల్లవారుజామున ఒంటి గంటకు లండన్ వెళ్లే విమానం ఉంది. ప్రతిష్ఠాత్మకమైన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఉపన్యాసం ఇవ్వాలని నన్ను ఆహ్వానించింది. అయితే కౌంటర్‌కు చేరుకోగానే, దేశం విడిచి వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం నా పాస్‌పోర్టును అనుమానాస్పదంగా గుర్తించిందని చెప్పారు’’ అని ఆయన వివరించారు. ఈ వ్యవహారంపై ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు స్పందిస్తూ.. తమకు ఈ ఘటన గురించి తెలియదని, సంబంధిత అధికారులు దీనికి సంబంధించిన వ్యవహారాలను చూస్తున్నారని  తెలిపారు.

సీజేపీ స్పందన.. గతంలోనూ అరెస్టు
దాస్‌ను ఆక్స్‌ఫర్డ్ యూనియన్‌లో ప్రసంగించేందుకు ఆహ్వానించారని, అయినప్పటికీ ఢిల్లీ విమానాశ్రయంలో అడ్డుకున్నారని సీజేపీ పేర్కొంది. ‘‘విద్యావంతులైన గొంతులను చూసి ఈ పిరికిపంద ప్రభుత్వం ఎంతగా భయపడుతోందంటే.. ప్రపంచానికి భారతదేశం తరఫున గళం వినిపించే వారిని అడ్డుకునే స్థాయికి దిగజారింది’’ అని ఎక్స్‌లో పోస్టు చేసింది.

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, సహ సమన్వయకర్త అశుతోష్ రంకాతో కలిసి దాస్ పలు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనతో పాటు ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు సంబంధించిన వివాదంలోనూ ఆయన ముందున్నారు.

అక్టోబర్ 13న జంతర్ మంతర్ వద్ద నిరసనలకు అనుమతించిన స్థలంగా గుర్తింపును తొలగించిన ప్రాంతంలోకి ప్రవేశించి, జాతీయ జెండాను ప్రదర్శించిన ఘటనలో దాస్, రంకా తీహార్ జైలుకు వెళ్లారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)లో అక్రమాలు జరుగుతున్నాయంటూ వీరు నిరసన చేపట్టారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ ఘటనలో దాస్, రంకా, సీజేపీ నాయకుడు అజింక్య షిండేతో పాటు మరో 11 మందిపై అనధికారికంగా నిరసన స్థలంలోకి ప్రవేశించారనే ఆరోపణలు వచ్చాయి. ఒక్కొక్కరు రూ.50,000 చొప్పున వ్యక్తిగత, హామీ బాండ్లు సమర్పించడంతో అక్టోబర్ 21న వీరు జైలు నుంచి విడుదలయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement