తాడేపల్లి: సముద్రంలో ఆరుగురు మత్స్యకారుల గల్లంతుపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ‍్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చేపట్టాలని వైఎస్ జగన్ అన్నారు. మత్స్యకారులను క్షేమంగా తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు చేపట్టాలని ఓ ప్రకటనలో కోరారు.
‘‘కాకినాడ జిల్లా ఉప్పాడ సుబ్బంపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనట్లు వస్తున్న కథనాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెల 4న చేపల వేటకు వెళ్లిన రెండు బోట్లలో ఒకటి తిరిగి రాగా, మరో బోటులోని ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ ఇప్పటికీ తెలియకపోవడం కలవరపాటుకు గురిచేస్తుంది.
రోజుల తరబడి తమవారి కోసం ఎదురుచూస్తున్న మత్స్యకార కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్ సహకారంతో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలి. గల్లంతైన ఆరుగురు మత్స్యకారులను క్షేమంగా తిరిగి తీసుకురావాలి. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: బీజేపీ-అకాలీదళ్ ఎందుకు విడిపోయాయ్? మళ్లీ ఎందుకు కలిశాయ్?


