పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (బీజేపీ), శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) మరోసారి చేతులు కలిపాయి. వివాదాస్పద వ్యవసాయ చట్టాల కారణంగా 2020లో విడిపోయిన ఈ రెండు పార్టీలు.. ఆరేళ్ల తర్వాత మళ్లీ కూటమిగా పోటీ చేయాలని నిర్ణయించాయి. గురునానక్ జయంతి సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఈ విషయాన్ని ప్రకటించారు.
వచ్చే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాల్లోనూ బీజేపీ-అకాలీదళ్ కూటమి పోటీ చేస్తుందని అమిత్ షా వెల్లడించారు. అయితే ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. కూటమిలో అకాలీదళ్‌దే పెద్ద పార్టీ పాత్ర అని, ముఖ్యమంత్రి కూడా ఆ పార్టీ నుంచే ఉంటారని స్పష్టం చేశారు. 2029 డిసెంబర్ నాటికి పంజాబ్‌ను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా మారుస్తామని మరోసారి హామీ ఇచ్చారు.
గతంలో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినప్పటికీ.. ప్రస్తుతం పంజాబ్ రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గతంలో కాంగ్రెస్, బీజేపీ-అకాలీదళ్ కూటమి మధ్య ప్రధానంగా ద్విముఖ పోటీ ఉండేది. అయితే 2022 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించడంతో రాష్ట్రంలో రాజకీయ పోటీ మరింత విస్తృతమైంది.
రైతుల ఆందోళనలు, వ్యవసాయ చట్టాల అంశాలు ఇప్పటికీ కీలక రాజకీయ సమస్యలుగా కొనసాగుతున్నాయి. అవినీతి ఆరోపణలు, మతపరమైన అపచార ఘటనలకు సంబంధించిన వివాదాలు, గ్రామీణ పంజాబ్‌లో పట్టు కోల్పోవడం వంటి పరిణామాలు అకాలీదళ్ విశ్వసనీయతను దెబ్బతీశాయి. ఖడూర్ సాహిబ్ ఎంపీ అమృత్‌పాల్ సింగ్‌కు చెందిన అకాలీదళ్ (వారిస్ పంజాబ్ దే) వంటి తిరుగుబాటు వర్గాలు కూడా ఆ పార్టీకి సవాలుగా మారాయి. రైతుల ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన తీరుపై ఏర్పడిన వ్యతిరేక అభిప్రాయాన్ని అధిగమించాల్సిన బాధ్యత బీజేపీపైనా ఉంది.
2020లో ఎందుకు విడిపోయాయి?
మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ 2020లో అకాలీదళ్.. బీజేపీతో తన 24 ఏళ్ల పొత్తును తెంచుకుంది. ఆ తర్వాత ఆ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అంతకుముందు 1997, 2007, 2012 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి విజయం సాధించింది. గ్రామీణ సిక్కు ఓటర్ల మద్దతును అకాలీదళ్ సమీకరిస్తే.. పట్టణ హిందూ ఓటర్ల మద్దతును నిలబెట్టుకోవడంపై బీజేపీ దృష్టి పెట్టేది. ఈ రెండు పార్టీల బలాల కలయికే కూటమికి ప్రధాన ఆధారంగా ఉండేది.
గత ఎన్నికల్లో ఎలా ఉన్నాయి?
ఈ కూటమి 1997లో అత్యధికంగా 93 స్థానాలను గెలుచుకుంది. అయితే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసినప్పుడు బీజేపీకి కేవలం 2, అకాలీదళ్‌కు 3 స్థానాలే దక్కాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అకాలీదళ్‌కు 13 శాతానికి పైగా ఓట్లు రాగా, బీజేపీకి 18 శాతానికి పైగా ఓట్లు లభించాయి. అయినప్పటికీ బీజేపీ ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. అకాలీదళ్ తరఫున హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ మాత్రమే తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
మళ్లీ ఒక్కటైన ఈ రెండు పార్టీలకు 2027 ఎన్నికలు కీలక పరీక్షగా మారనున్నాయి. గతంలో మాదిరిగా ఓటర్ల మద్దతును సమీకరించి విజయాలు సాధించగలవా? రైతుల ఆందోళనలు, అకాలీదళ్‌పై ఉన్న వ్యతిరేకత, ఆమ్ ఆద్మీ పార్టీ బలం వంటి అంశాలను ఎలా ఎదుర్కొంటాయన్నది ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయనుంది. మళ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సరైన సమయంలో ఈ రెండు పార్టీలు కలిశాయి.


