జిల్లాలో ఏకైక వైస్ చైర్‌పర్సన్ పదవి దక్కించు కున్న బీజేపీ కౌన్సిలర్ పార్వతి(కుడివైపు)
సాక్షి, పార్వతీపురం మన్యం: పేరుకే కూటమి.. పదవుల పంపకంలో మా త్రం బీజేపీకి మొండిచేయి! పార్వతీపురం మన్యం జిల్లాలో అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ పరిస్థితి కూరలో కరివేపాకులా మారిపోయింది. ఎన్నికల వేళ మిత్రపక్షంగా గుర్తించినా.. సీట్లు, పదవుల పంపకం దగ్గరకు వచ్చేసరికి ఆ పార్టీని పూర్తిగా పక్కనపెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన పార్టీలు పదవులను తమలో తాము పంచుకోగా.. బీజేపీకి మాత్రం నామమాత్రపు ప్రాతినిధ్యమే దక్కింది. దీంతో కమలం పార్టీ నాయకులు రగిలిపోతున్నారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఎంపీపీ పదవుల్లో దక్కని ప్రాధాన్యం..
జిల్లాలోని పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీ లు, పాలకొండ నగర పంచాయతీలో మొత్తం ఐదు కౌన్సిలర్ స్థానాలను మాత్రమే బీజేపీకి కేటాయించారు. వాటిలో మూడు స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థు లు విజయం సాధించారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో 15 జెడ్పీటీసీ స్థానాలకు గాను ఒక్కటే కేటాయించా రు. 226 ఎంపీటీసీ స్థానాల్లో కేవలం ఆరు స్థానాల తో సరిపెట్టారు. వాటిలో రెండు చోట్ల విజయం సాధించారు. ఇక జిల్లాలోని 15 ఎంపీపీ పదవుల్లో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా బీజేపీకి దక్కలే దు. కనీసం వైస్ ఎంపీపీ పదవులైనా దక్కుతాయ ని ఆశించిన కమలం నేతలకు అక్కడా నిరాశే ఎదురైంది. కురుపాం, జియ్యమ్మవలస మండలాల్లో వైస్ ఎంపీపీ పదవులను కోరినా సానుకూల స్పందన రాలేదని ఆ పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ఆ ఒక్కటికీ పెద్ద పోరాటమే..
చివరకు పార్వతీపురం పురపాలక సంఘం వైస్ చైర్మన్ పదవి మాత్రమే బీజేపీకి కొంత ఊరటనిచ్చే అంశంగా మిగిలింది. ఆ ఒక్క పదవిని సాధించుకోవడానికి కూడా పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చిందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. టీడీపీ నేత లు మొదటి నుంచీ ఈ పదవిని కేటాయించేందుకు సుముఖంగా లేరని వాపోతున్నారు. మొత్తంగా చూస్తే.. కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్నప్పటికీ బీజేపీకి దక్కిన ప్రాధాన్యం అంతంతమాత్రమే. ఎన్నికల్లో మిత్రపక్షంగా అవసరం.. అధికారంలో పదవుల పంపకం వచ్చేసరికి అనవసర మా? అన్న ప్రశ్న కమలం శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. పొత్తు ధర్మం మాటల్లోనేనా.. ఆచరణలోనూ ఉండాలంటూ బీజేపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


