ఇలా అయిందేంటి.. బాబు బాధ‌! | Kommineni Srinivasarao Comment on Chandrababu, Sharmila Political Drama | Sakshi
Sakshi News home page

ఉసూరుమనిపించిన ధ‌ర్నా డ్రామా!

Nov 24 2026 12:19 PM | Updated on Nov 24 2026 12:43 PM

Kommineni Srinivasarao Comment on Chandrababu, Sharmila Political Drama

ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఏమి సాధించినట్లు? తన కుమార్తె అంజలీరెడ్డి వివాహం రెండు రోజులలో పెట్టుకుని అన్న ఇంటి వద్ద ధ‌ర్నా అంటూ ఈ వ్యవహారాన్ని ఇంత అల్లరి చేసుకుంటారా? ఏపీ పోలీసు వ్యవస్థ మాదిరి కర్ణాటకలో పోలీసులు చెడిపోలేదు కాబట్టి సరిపోయిందికాని, లేకుంటే నానా రచ్చ జరిగి ఎల్లో మీడియా పండగ చేసుకునే అవకాశం ఏర్పడదేమో! కర్ణాటక పోలీసులు పద్దతిగా ప్రవర్తించడం వల్ల అటు టీడీపీకి, ఇటు ఎల్లో మీడియాకు నిరాశ ఏర్పడి ఉండవచ్చు. దాంతో వారు ఏడుపు ముఖాలు పెట్టుకుని కొత్త రాగం ఆలపించడం, కొత్త అబద్దాలను సృష్టించి ప్రచారం చేయడం సాగించారు.

ఈ మొత్తం ఎపిసోడ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి ఉన్న ప్రతిష్టను దెబ్బతీయడం, తన పరువును తానే తీసుకోవడం తప్ప షర్మిలకు ఏమి లాభం కలిగింది? ఆమె భర్త బ్రదర్ అనిల్ సన్నిహితులకు మైనింగ్ లీజ్ మంజూరు అయిందన్న సమాచారం వల్ల ఆమె టీడీపీతో ఇందుకే సత్సంబంధాలు కొనసాగిస్తూ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు డైరెక్షన్‌లో పనిచేస్తున్నారన్న విమర్శను ఎదుర్కోక తప్పని ప‌రిస్థితి ఏర్పడింది.

కాంగ్రెస్ పార్టీలో మెజార్టీ నేతలు ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పరువు పోయేలా షర్మిల తన వ్యక్తిగత కేసులో రగడ చేశారని, దీనివల్ల పార్టీ అధినేత రాహుల్ గాంధీకి కూడా చెడ్డపేరు వస్తోందని వారు వాపోతున్నారు. ఇలాంటి వారిని పార్టీలో ఎంకరేజ్ చేయడం వల్ల అసలే ఏపీలో అడుగంటిన కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగు అయ్యే ప‌రిస్థితి ఏర్పడుతోందని వారు గగ్గోలు పెడుతున్నారు.

ఆ అవకాశం కూడా పోయింది!
బెంగళూరులోని జగన్ నివాస ప్రాంగణంలో ఉన్న అతిథి గృహం తనది కాదని తెలిసినా, కేవలం ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి వారి సలహాలను పాటించి ఆమె ఈ గొడవ చేసిందన్న అభిప్రాయం ఏర్పడింది. తన అన్న జగన్ మీద ద్వేషంతో ఆమె ఎవరిని నమ్మకూడదో వారినే నమ్ముతూ రాజకీయం చేయడం వల్ల టీడీపీకి ఏమైనా కాస్తో, కూస్తే ప్రయోజనం కలుగుతుందేమోనని వారు ఆశపడుతున్నారు. చివరికి జగన్ నివాసం వద్ద ఎలాంటి ధర్నా చేయరాదని, షర్మిల అక్కడకు వెళ్లరాదని కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆమెకు ఎదురు దెబ్బ తగిలినట్లయింది. అదే టైమ్‌లో ఆ భవంతి యజమాని అయిన డాక్టర్ సుగుణమ్మ తన కుమార్తె భారతిరెడ్డి, మనవరాళ్లు వర్ష, హర్షలకు గిప్ట్ డీడ్ రాయడంతో ఇంతకాలం ఆ భవనాన్ని వాడుకోవడానికి షర్మిలకు ఉన్న అవకాశం పొగోట్టుకున్నట్లయిందని కొంతమంది విశ్లేషణ.

ఇదీ చ‌ద‌వండి: బాబు డాంబికాలు.. నవ్వులపాలు!

అక్కడ తన కుమార్తె వివాహం చేయాలని ప్రతిపాదించడంలోనే కుట్ర కోణం కనిపిస్తుంది. ఈ రోజుల్లో ఎవరైనా తమ ఇళ్ల వద్ద భారీ పెళ్లిళ్లు చేస్తున్నారా? కన్వెన్షన్ సెంటర్ల‌లో చేస్తున్నారు. అంతదాకా ఎందుకు తన కుమారుడి వివాహం డెస్టినేషన్ మ్యారేజీ కింద పరాయి రాష్ట్రంలోని ప్రముఖ టూరిస్టు కేంద్రంలో ఎందుకు షర్మిల నిర్వహించారు? కుమార్తెకు ఎందుకు అలా చేయడం లేదు. ఒకరకంగా ఈ అల్లరి అంతా ఆ పాపపై ఎంత ప్రభావం పడుతుందో షర్మిల ఊహించ లేకపోతున్నారా? పైగా వియ్యాలవారికి ఇదంతా చికాకుగా మారదా? సంతోషంగా వివాహ మహోత్సవం చేసుకోవాల్సిన వేళ ప్రజలలో పలచన అయ్యేలా ఈ రభస ఏమిటని అనుకోరా?

కొద్ది రోజుల క్రితం కుమార్తె వివాహాన్ని వేరే ప్రదేశంలో పెడుతున్నట్లు ప్రకటించిన షర్మిల మళ్లీ మనసు మార్చుకొని అన్న ఇంటి వద్ద ధర్నా అంటూ అల్లరి సృష్టించడానికి యత్నించడంంలో ఆంతర్యం ఏమిటి? అది కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కుమార్తె వివాహ పత్రిక ఇచ్చిన తర్వాత, ఎల్లో మీడియాకు నిత్యం లీకులు ఇస్తూ సాగించిన ఈ తంతు అంతా జగన్‌కు నష్టం ఎంత చేస్తుందో తెలియదు కాని, షర్మిల ఎవరి చేతిలోనో రాజకీయంగా కీలుబొమ్మగా మారి తనకు తాను సమాజం దృష్టిలో చిన్నతనం తెచ్చుకున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్‌కు కూడా ఈ వివాదం తలనొప్పిగానే ఉండవచ్చు. కాని ఆయన దీనిని తప్పనిసరిగా ఎదుర్కోక తప్పని పరిస్థితిని సృష్టించారు.

గొర్రె కసాయిని నమ్మినట్లే..
గతంతో తన తాత రాజారెడ్డి, తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిలను తీవ్రంగా అవమానిస్తూ విమర్శలు చేసిన చంద్రబాబును నమ్మడం అంటే గొర్రె కసాయిని నమ్మినట్లేనని వైఎస్సార్‌సీపీ నేతలు వ్యాఖ్యానిస్తుంటారు. గతంలో షర్మిల కూడా చంద్రబాబుపై చేసిన తీవ్ర విమర్శల వీడియోలు ప్రస్తుతం సర్కులేట్ అవుతున్నాయి. షర్మిల సొంతంగా ఆలోచిస్తే ఇలాంటివి చేయకపోవచ్చని, కాని తన భర్త అనిల్ ప్రోద్బలమో, మరేదో కారణం ఉండవచ్చన్నది కొందరి అభిప్రాయంగా ఉంది. దానికి తగినట్లే అనిల్ సన్నిహితులకు చంద్రబాబు ప్రభుత్వం మైనింగ్ లీజ్ మంజూరు చేసిన వైనంలో కూడా రాజకీయ కుట్ర దాగి ఉందా అన్నది చర్చగా ఉంది.

ఇదీ చ‌ద‌వండి: చంద్ర‌బాబు స‌ర్కారుకు మైన‌స్ మార్కులు!

ఒకప్పుడు ఖమ్మం జిల్లాలో అనిల్‌కు సంబంధించినవారు స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి బయ్యారంలో ఉన్న తక్కువ గ్రేడ్ ఖనిజాన్ని వైఎస్ ప్రభుత్వ టైంలో కేటాయిస్తే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డిలు వీరిపై ఎంత తీవ్రంగా విమర్శలు చేశార‌నే విష‌యాలు మ‌ళ్లీ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఒకవేళ జగన్ కనుక మైనింగ్ లీజ్‌ను ఈ రకంగా మంజూరు చేసి ఉంటే చంద్రబాబు నానా రచ్చ చేసేవారు.

జనసైకోలు దూషిస్తే బాధ‌లేదా?
ఇక చంద్రబాబు సాక్షి పత్రికపై విమర్శ చేస్తూ షర్మిలకు సంబంధించిన కథ‌నంలో చెట్టపట్టాలు అన్న పదాన్ని వాడారని అంటూ బాధపడినట్లు మాట్లాడారు. ఆ పదాన్ని రాజకీయంగా చూడకుండా కావాలని సాక్షిపై బురద చల్లడానికి ఆయన ప్రయత్నించారు. దీనిపై సోషల్ మీడియాలో వచ్చిన వ్యంగ్య వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. షర్మిలనుకాని, జగన్ సతీమణి భారతిరెడ్డిని కాని, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులను పచ్చి బూతులతో కొందరు జనసైకోలు దూషిస్తే ఎందుకు చంద్రబాబు బాధపడలేదని, వారిపై కేసులు ఎందుకు పెట్టలేదని సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నించారు. జగన్ చెల్లెలు అంటూ బాధపడ్డ చంద్రబాబు తన సొంత చెల్లెళ్లకు ఎనాడైనా ఇంటికి పిలిచి భోజనం పెట్టారా అని మాజీ మంత్రి పేర్నినాని పలుమార్లు ప్రశ్నించినా జవాబు ఇవ్వరు. నిజానికి షర్మిల పట్ల సోదరిప్రేమతో జగన్ సుమారు 200 కోట్ల రూపాయలు తన సంపాదన నుంచి ఇచ్చినా ఇంకేదో కావాలంటూ షర్మిల రచ్చ చేయడం ఎంతవరకు ధ‌ర్మం అన్న ప్రశ్నను వేస్తున్నారు.

విడాకుల గురించి మాట్లాడాల్సింది
అన్నాచెల్లెలుపైనే కాకుండా, భార్యభర్తల విడాకుల గురించి కూడా చంద్రబాబు మాట్లాడి ఉండాల్సింది కదా అని కొందరు ప్రశ్నించారు. హిందూ మతంలో విడాకులు తీసుకోవడం పద్దతికాదని ప్రసంగం చేసిన చంద్రబాబు తన చెంతనే విడాకులు తీసుకున్నవారిని కూర్చోబెట్టుకుని ఎలా పొడుగుతున్నారని మరికొందరు ప్రశ్నించారు. తన మామ ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేసినందుకుగాని, ఆ తర్వాత ఎన్టీఆర్‌ ఈయనను ఔరంగజేబు, గాడ్సె వంటి వారితో పోల్చుతూ చేసిన విమర్శలకు గాని ఎప్పుడైనా బాధపడ్డారో, లేదో తెలియదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. వరసకు అత్త అయ్యే లక్ష్మీపార్వతి పట్ల టీడీపీకి చెందిన కొందరు మూర్ఖులు నానా చెత్త మాట్లాడిన సందర్బాలలో కూడా ఈయన బాధపడ్డారా? అని కొంతమంది అడుగుతున్నారు. ప్రధాని మోదీని వ్యక్తిగత దూషణలు చేసినప్పుడు, తనపై అవినీతి ముద్రను మోదీ వేసినందుకు, తిరిగి దిక్కులేని స్థితిలో బీజేపీతో సఖ్యత కుదుర్చుకున్నందుకు ఈయన ఎన్నడైనా బాధపడ్డారా అన్నది కొంతమంది నెటిజనుల ప్రశ్న.

కర్ణాటకలో కాబట్టి సరిపోయింది కాని..
రాష్ట్రంలో అసమర్ధ పాలన సాగిస్తూ పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నందుకు, తన కుమారుడు లోకేష్ రెడ్‌బుక్ అరాచాకాలు మితిమీరిపోయాయన్న విమర్శలు వస్తున్నందుకు ఆయన బాధపడరు కాని, షర్మిలకు ఏదో అన్యాయం జరిగిపోయిందని చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్న భావన వ్యక్తం అవుతుంది. కర్ణాటకలో కాబట్టి సరిపోయిందికాని, అక్కడ పోలీసులు పద్దతిగా కోర్టు ఆదేశాల మేరకు జగన్ ఇంటివద్ద షర్మిల ధర్నా చేయకుండా అడ్డుకున్నారు. అదే ఏపీలో అయితే పోలీసులే  దగ్గరుండి ఆమెతో ధర్నా చేయించి ఉండేవారని మరికొంత మంది సర్కాస్టిక్‌గా వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఏపీలో కాంగ్రెస్‌ భవిష్యత్తు ప్ర‌శ్నార్థ‌కం
ఏది ఏమైనా షర్మిల తన అన్నను ఇరుకున పెట్టాలని, తద్వారా టీడీపీకి మేలు చేయాలని తలపెట్టిన ఈ ఉదంతంలో ఆమె తన ప్రతిష్టను తానే తీసుకున్నట్లయింది. ఎల్లో మీడియా ప్లాన్ బెడిసికొట్టింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు పడ్డా వారు ఆశించిన రీతిలో డ్రామా నడవకపోవడంతో కొత్త కథ‌లు సృష్టించే యత్నం చేశారు. ఇలాంటి వ్యక్తిని పీసీసీ అధ్య‌క్షురాలిని చేసి, రాహుల్ గాంధీ ఏపీలో కాంగ్రెస్‌కు పూర్తిగా భవిష్యత్తు లేకుండా చేశారని.. చంద్రబాబుతో ఆయన స్నేహం వల్లే ఇలా జరిగి ఉంటుందని కొంతమంది కాంగ్రెస్ వాదులు అభిప్రాయపడుతున్నారు. షర్మిల చేసిన ధర్నా నాటకం రక్తి కట్టకుండానే ముగిసిపోవడంతో టీడీపీకి ఉసూరుమనిపిస్తుండవచ్చు. తన రాజకీయ ప్రత్యర్ధులతో కలిసి షర్మిల ఎంత రెచ్చగొట్టాలని ప్రయత్నించినా, జగన్ మాత్రం సంయమనం పాటించడం అన్నిటికన్నా హైలైట్ గా కనిపిస్తుంది. 

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement