పంచాయతీ ఎన్నికలలో ఎట్టి పరిస్థితి లోను కూటమి బలపరచిన అభ్యర్ధులే గెలవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలకు కొద్ది రోజుల క్రితం దిశానిర్దేశం చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి నేత ఈ విధంగా పంచాయతీ ఎన్నికలను కూడా సీరియస్‌గా తీసుకోవాలని చెప్పడం ఇదే మొదటిసారి అనిపిస్తుంది. గతంలో ఏ సీఎం అయినా పార్టీ రహితంగా జరిగే ఈ ఎన్నికలను స్థానిక నేతలకే వదిలివేశారు. చంద్రబాబు మాత్రం ఈ ఎన్నికలలో టెలికాన్ఫరెన్స్ పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారంటే ఆయన వచ్చే శాసనసభ ఎన్నికల గురించి ఎంత భయపడుతున్నారో అర్థం అవుతుంది.
పైకి ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఓటు అడగాలని అంటూనే ఏది ఏమైనా కూటమి గెలవాలని చెబుతున్నారంటే అందులో మతలబు ప్రజలకు అర్ధం కాకుండా ఉంటుందా! దీన్ని సంకేతంగా తీసుకుని, ఇప్పటికే నానా బీభత్సం సృష్టిస్తున్న టీడీపీ అరాచకశక్తులు మరింత రెచ్చిపోరా! నగరపాలక, మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో ప్రభుత్వపరంగా ఎన్ని అరాచకాలు జరిగింది ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంది. ఏపీలోనే కాదు.. దేశ చరిత్రలోనే ఎన్నడూ జరగని రీతిలో నామినేషన్ల దశలోనే అధికార పార్టీ నేతలు గూండాయిజానికి దిగారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులు నామినేషన్లనే వేయనివ్వకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ నేతల హౌస్ అరెస్టులు, కార్యకర్తలపై బైండోవర్ కేసులు పెట్టడం ద్వారా కొత్త, కొత్త అక్రమాలకు పోలీసులు దిగారు.
ఎన్నికలలో కేవలం రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద కాపాలాదారుగా ఉండవలసిన పోలీసు వ్యవస్థ వైఎస్సార్‌సీపీ వారిని ఆఫీసులోకి వెళ్లనివ్వకుండా అడ్డుకోవడం 50 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదు. పుంగనూరుతో మొదలైన ఈ నీచ ప్రక్రియ, పంచాయతీ ఎన్నికల వరకు సాగింది. ఈ రౌడీలకు పోలీసు అధికారులు అండగా ఉండి పోలీసు వ్యవస్థ ప్రతిష్టను అధమ స్థాయికి తెచ్చారు. ఎలాగొలా నామినేషన్లు వేసినా స్క్రూటిని సమయంలో ఏదో వంక చెప్పి అధికారులతో వైఎస్సార్‌సీపీ నామినేషన్లను తిరస్కరించే ఘట్టాలకు తెరదీశారు. అది కూడా దాటితే ఓటర్లను పోలింగ్ బూత్‌లకు రానివ్వకుండా అడ్డుకున్నారు. ఆ గండాన్ని ఎలాగొలా అధిగమించితే, కౌంటింగ్ సమయంలో ఫలితాలను తారుమారు చేసే కార్యక్రమం చేపట్టారు.
గూండాలను అరికట్టి స్వేచ్చగా నామినేషన్లు వేసుకోవడానికి, ఓట్లు వేసుకోవడానికి అవకాశం కల్పించవలసిన పోలీసులు అన్ని సందర్భాలలో పలుచోట్ల గూండాలకే అండగా నిలవడం అత్యంత శోచనీయం.పైగా ఒక పోలీసు ఉన్నతాధికారి రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి తన వారితో మళ్లీ నామినేషన్లు వేయడానికి ఎలా వస్తారో చూస్తామని ఓపెన్‌గానే వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎంత దిగజారిందో తెలుస్తుంది. టీడీపీ ఎమ్మెల్యేలు కొన్నిచోట్ల తమ ఆయా పట్టణాలను బట్టి తమ పార్టీవారి నుంచే లక్షలు, కోట్లు డబ్బు తీసుకుని అధికార యంత్రాంగంతో సహా అంతా పంచుకున్నారట. ఆ మీదట అరాచాకాలు చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చేయడం, లేదా, రిగ్గింగ్‌ల ద్వారా గెలిపించడం వంటివి చేశారట.
ఇంత నీచంగా ఎన్నికలు జరగడం గతంలో ఎన్నడూ లేదు. చంద్రబాబు ఇంతకుముందు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇంత అధ్వాన్నంగా ఎన్నికలు జరగలేదు. ఈ పరిణామాలన్నిటికి చంద్రబాబు కుమారుడు, మంత్రి లోకేష్ బాధ్యుడని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎన్‌వీ సతీష్ రెడ్డి ఆరోపించారు. దీనికి లోకేష్ మూల్యం చెల్లించుకునే రోజు వస్తుందని ఆయన హెచ్చరించారు. ఇలాంటి ప్రకటనలు ఎన్ని వచ్చినా, చంద్రబాబు లేదా లోకేష్‌లు కేరే జాట్ అంటూ చివరికి పంచాయతీ ఎన్నికలలో సైతం అదే అరాచక పద్దతులు అవలంభిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇందుకు ఒక ఉదాహరణ చెప్పాలి.
మైనస్ మార్కులు కాక మరేమిటి?
కడప జిల్లాకు చెందిన అమరనాధ రెడ్డి అనే ఆయన తన గ్రామ పంచాయతీలో వార్డు సభ్యుడి పదవికి నామినేషన్ వేయడానికి వెళ్తే ఆయన వద్ద ఉన్న పత్రాలన్నిటిని లాక్కుని చించివేశారట. ఈ అంశంపై ఆయన జిల్లా కలెక్టర్, ఎస్పీ స్థాయి నుంచి రాష్ట్రపతి వరకు ఉన్న ప్రముఖులకు ఈ మెయిల్ చేశారట. దీనిని బట్టే ఏపీలో పాలన ఎంత అధ్వాన్నంగా ఉంది అర్ధం అవుతుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేవలం ఒక డమ్మీ వ్యవస్థగా మారి, టీడీపీ తరపున పనిచేస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నదన్న విమర్శ సర్వత్రా వస్తోంది. చివరికి అభ్యర్ధులకు రక్షణ కల్పించాలని పోలీసులకు, ఎస్ఈసీకి హైకోర్టు ఆదేశాలు ఇవ్వాల్సి రావడమా? ఇవన్ని చంద్రబాబు సర్కార్‌కు మైనస్ మార్కులు కాక మరేమిటి?
ఇదీ చదవండి: చంద్రబాబు చిత్ర, విచిత్ర ప్రకటనలు
మహిళలని కూడా చూడకుండా టీడీపీ రౌడీలు దౌర్జన్యాలు చేసిన ఘటనలు కోకొల్లలు. అయినా చంద్రబాబు, ఎల్లో మీడియా అసలేమీ టీడీపీ గూండాలు దౌర్జన్యం చేయనట్లు, పైగా వైఎస్సార్‌సీపీ వారే ఏదో చేసినట్లు ప్రచారం చేస్తుంటారు. నిజంగా వైఎస్సార్‌సీపీ అలా చేసి ఉంటే పోలీసులు చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉందా? నిత్యం అసత్యాలతో జనాన్ని మభ్యపెట్టాలని చూడడం కాకుండా, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా చంద్రబాబు చూసి ఉంటే ఎంత మంచి పేరు వచ్చేది? కాని ఆయన పరువు పొగొట్టుకోవడానికైనా సిద్దపడ్డారు తప్ప, ఆ అవకాశాన్ని వాడుకోలేకపోవడం దురదృష్టం. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరిస్తూనే వైఎస్సార్‌సీపీ కుట్రలను తెలియచెప్పాలని ఆయన అన్నారట. అన్ని హామీలు నెరవేర్చేశారట. ఆ విషయాలను జనానికి చెప్పాలట.
ఇదీ చదవండి: రామోజీకి ఇంతటి గౌరవం ఎందుకు బాబూ?
2024 ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి వెళ్లి ఒక గ్యారంటీ కార్డు ఇచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు వాటిని చూపి ఇవన్ని చేసేశామని చెప్పే ధైర్యం వీరికి ఉందా? ఈ ఎన్నికల టెలీకాన్ఫరెన్స్‌లో కూడా జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోలేదు. సొంత చెల్లిలి వ్యక్తిత్వాన్ని కించపరిచేవారు రాజకీయాలకు అనర్హులని చంద్రబాబు అన్నారట. ఇలాంటి అబద్దాలను టీడీపీ వారికి నూరిపోస్తుంటారు. షర్మిలతో సహా జగన్ కుటుంబ సభ్యులతో పాటు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ కుటుంబాలపై జనసైకోలు బూతులు వాడినా కనీసం కేసు కూడా పెట్టని చంద్రబాబు ప్రభుత్వం కదా సిగ్గుపడాల్సింది. ఇలాంటి వాటిని ప్రోత్సహించే వారు కదా రాజకీయాలకు అనర్హులనుకోవాలి. అవన్ని ఎందుకు! చంద్రబాబు చేతిలో సొంత మామ ఎన్టీ రామారావు ఘోర పరాభవానికి గురయ్యారు కదా! ఆ తర్వాత ఆయనను ఉద్దేశించి ఎన్టీఆర్ ఏ రకంగా విమర్శించారో తెలిపే వీడియోలు ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాయి కదా!
అయినా చంద్రబాబు ఏమీ జరగనట్లు ఎదుటివారిపై లేనిపోని ఆరోపణలు చేస్తుంటారు. అదే ఆయన గొప్పదనం. ప్రజలు మంచి, చెడు విశ్లేషించి ఓట్లు వేస్తున్నారట. నిజానికి చాలా చోట్ల స్థానిక ఎన్నికలలో ఓట్లు వేయనిస్తే కదా! వారు ఏ నిర్ణయం తీసుకుంది తెలిసేది. రాజస్తాన్‌లో అధికార బీజేపీ 27 జెడ్పీలకు గాను 23 జెడ్పీలలో ఓడిపోయి, కాంగ్రెస్ గెలిచిందట. ఏపీలో కూడా స్వేచ్చగా ఎన్నికలు జరిగితే అలాంటి పరిస్థితే ఉండేదేమో! ఎక్కడ జనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారో అన్న భయంతో గూండాలు, రౌడీలతో పాటు పోలీసులను వాడుకుని గెలిచేశామని చంద్రబాబు వంటి సీనియర్ నేత చెప్పుకోవడం ఆత్మవంచన కాదా!

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


