లోకేశ్‌ పీఏ వర్సెస్‌ బాలకృష్ణ పీఏ | Power Struggle Between Lokesh's PA Sambasiva Rao and Balakrishna's PA Pavuluri Srinivasa Rao | Sakshi
Sakshi News home page

లోకేశ్‌ పీఏ వర్సెస్‌ బాలకృష్ణ పీఏ

Nov 23 2026 9:55 AM | Updated on Nov 23 2026 9:56 AM

Power Struggle Between Lokesh's PA Sambasiva Rao and Balakrishna's PA Pavuluri Srinivasa Rao

సాక్షి ప్రతినిధి, గుంటూరు/నాదెండ్ల /యడ్లపాడు: చంద్రబాబు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఆయన తనయుడు లోకేశ్‌ పీఏ సాంబశివరావుకు, బాలకృష్ణ పీఏ పావులూరి శ్రీనివాసరావుకు మధ్య ఆధిపత్య పోరు బజారునపడింది. చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ఈ ఇరువురు పీఏలు పంచాయతీ ఎన్నికల్లో రెండు వర్గాలుగా పోటీపడుతున్నారు. సాంబశివరావు వర్గం నుంచి నాగండ్ల రాంబాబుతో శనివారం గ్రామ సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ వేయించారు. 

ఈయనకు స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సైతం మద్దతు తెలిపినట్లు చెబుతున్నారు. దీన్ని వ్యతిరేకించిన పావులూరి శ్రీనివాసరావు ఆదివారం తన సమీప బంధువు పావులూరి పిచ్చయ్యతో భారీ ర్యాలీ నిర్వహించి మరీ అట్టహాసంగా నామినేషన్‌ వేయించారు. ఇక్కడ ఏం జరిగిందో ఏమో అడిషనల్‌ ఎస్పీ హనుమంతరావు నేతృత్వంలో పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. పావులూరి శ్రీనివాసరావుతోపాటు, మరో 66 మందిని అదుపులోకి తీసుకుని  నాదెండ్ల పోలీసుస్టేషన్‌కు తరలించారు.   



పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత, లాఠీచార్జి.. 
సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు వందల సంఖ్యలో పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. పావులూరి శ్రీనివాసరావుతో పాటు మిగిలిన వారిని విడుదల చేయాలని ఆందోళనకు దిగారు. ఏఎస్పీ హనుమంతరావు హెచ్చరించినా కదల్లేదు. పోలీసులు ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నారని, గతంలో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఎన్నికల్లో తమ వర్గీయులపై దాడిచేసి తలలు పగలగొట్టిన వ్యక్తులను ఎందుకు అరెస్టు చేయలేదంటూ ప్రశ్నించారు. ఆగ్రహంతో ఏఎస్పీ, సీఐలు వారిపై లాఠీచార్జి చేసి  చెదరగొట్టారు.  

లోకేశ్‌ పీఏదే పైచేయి?  
ఈ వ్యవహారంలో లోకేశ్‌ పీఏదే పైచేయి అయిందని టీడీపీ నేతలే చెబుతున్నారు. బాలయ్య పీఏ శ్రీనివాసరావుతోపాటు 66 మందిపై మారణాయుధాలు కలిగి ఉన్నారనే సెక్షన్లతోపాటు, హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేసేలా పైనుంచి ఒత్తిళ్లు వచ్చాయని తెలుస్తోంది. బాలకృష్ణ పీఏతోపాటు అందరిని రిమాండ్‌కు పంపేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. లాఠీచార్జి చేశారంటే ఇందులో చినబాబు ప్రమేయం లేకపోతే సాధ్యంకాదని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. దీనిపై ఏఎస్పీ హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ.. పావులూరి శ్రీనివాసరావు కంపెనీలోకి గుంటూరుకు చెందిన వ్యక్తులు వంద మంది కార్లలో వచ్చారని, తాము దాడి చేసి 66 మందిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.

వారి నుంచి నాలుగు కత్తులు, 60 కర్రలను స్వా«దీనం చేసుకున్నామని చెప్పారు. సుమారు 30 మంది పరారయ్యాయని ఆయన తెలిపారు. వీరికి గుంటూరుకు చెందిన ఓ రౌడీïÙటర్‌తో సంబంధాలున్నట్లు గుర్తించామన్నారు. త్వరలో రౌడీషీటర్‌తో పాటు పరారైన వ్యక్తులను అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. ఇక అరెస్టు చేసిన వారిపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేశామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ చెప్పారు. కాగా, పల్నాడు జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తన పీఏను నాదెండ్ల పోలీసు స్టేషనుకు పంపి ఇరువర్గాల మధ్య రాజీకి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement