‘గేట్‌’ విద్యాసంస్థల చైర్మన్‌ సతీమణికి డిప్యూటీ మేయర్‌ పీఠం! | Deputy Mayor Seat Politics | Sakshi
Sakshi News home page

‘గేట్‌’ విద్యాసంస్థల చైర్మన్‌ సతీమణికి డిప్యూటీ మేయర్‌ పీఠం!

Nov 23 2026 7:56 AM | Updated on Nov 23 2026 7:56 AM

Deputy Mayor Seat Politics

సాక్షి ప్రతినిధి, తిరుపతి : కూటమి పార్టీల్లో డిప్యూటీ మేయర్, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవులు చిచ్చురేపాయి. జిల్లాలో నేడు పురపాలక సంఘాలు కొలుదీరనున్నాయి. ఈ మేరకు అధికారయంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. తిరుపతి మేయర్, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి, పుత్తూరు మున్సిపల్‌ చైర్మన్లుగా ఎవరు ప్రమాణం చేస్తారనే విషయం తెలిసిందే. అయితే డిప్యూటీ మేయర్, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. 

తిరుపతి నగరపాలక సంస్థ, నాలుగు మున్సిపాలిటీల్లో రెండో కుర్చీ నాదే నంటూ ఆశావహులు ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. తిరుపతి మేయర్‌గా జేబీ శ్రీనివాసులు సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. డిప్యూటీ మేయర్‌ కోసం బీజేపీ నుంచి పృథ్వీరెడ్డి, జనసేన నుంచి రాజారెడ్డితో పాటు మరో 17మంది ప్రయత్నాలు చేశారు. అమరావతి నుంచి అందుతున్న సమాచారం మేరకు 35వ డివిజన్‌ కార్పొరేటర్‌ విజయ పేరు దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. ఆమేరకు ఆమెకు బీఫామ్‌ కూడా ఇచ్చేశారని ప్రచారం సాగుతోంది.  ఆమె గేట్‌ విద్యాసంస్థల చైర్మన్‌ వెంకటేశ్వర్లు సతీమణి కావడం గమనార్హం.  

మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కోసం.. 
జిల్లాలోని నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి, పుత్తూరు మున్సిపాలిటీ వైస్‌ చెర్మన్‌ పీఠం కోసం కూటమిలోని మూడు పార్టీలకు చెందిన కౌన్సిలర్లు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. నాయుడుపేట మున్సిపల్‌ చైర్మన్‌గా తంబిరెడ్డి రాజేశ్వరమ్మ నేడు ప్రమాణం చేయనున్నారు. ఇదే పదవికి టీడీపీ నుంచి రఫీ భార్య పోటీపడి ఓటమి పాలయ్యారు. భార్య చైర్మన్‌ కాలేకపోయినా.. తాను వైస్‌ చైర్మన్‌ అయినా కావాలని రఫీ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.

 అయితే రఫీకి ఇవ్వడానికి వీల్లేదని కూటమిలోని మూడు పార్టీలకు చెందిన నాయకులు అభ్యంతరం చెబుతున్నట్లు సమాచారం. అదే విధంగా బీజేపీ నుంచి పాపారెడ్డి రాజశేఖరరెడ్డి వైస్‌ చైర్మన్‌ కోసం పట్టుబడుతున్నారు. ఈ పరిస్థితుల్లో లాయర్‌ గంగాప్రసాద్‌ సతీమణి 32వ వార్డు కౌన్సిలర్‌ పసల సువర్ణ పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. సూళ్లూరుపేట మున్సిపాలిటీ విషయానికి వస్తే.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వెంకటమ్మ పేరు దాదాపు ఖరారైందనే తెలుస్తోంది. ఇదే మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవి కోసం అలవల శ్రీను, బీజేపీ కౌన్సిలర్‌ ఆదినారాయణరెడ్డితో పాటు మరో ముగ్గురు ప్రయత్నిస్తున్నారు.  

వెంకటగిరి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కోసం ఏకంగా 12 మంది కౌన్సిలర్లు పోటీపడుతున్నారు. అయితే జంపాల ప్రకాష్‌ పేరు ఖరారు చేసినట్లు సమాచారం. పుత్తూరు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పీఠం కోసం మాజీ చైర్మన్‌ అంకయ్య సతీమణి చిట్టెమ్మ పేరు ముందు వరుసలో ఉంది. ఆమెనే ఖరారు చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే పదవి కోసం జీవరత్నం నాయుడు, జ్వోతిశంకర్‌ అలియాస్‌ విక్కీరాయల్, ప్రతాప్‌రాజు, ఆనంగి ఆనంద్, ధనపాల్‌ పోటీపడుతున్నారు. తిరుపతి డిప్యూటీ మేయర్‌తో పాటు, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి, పుత్తూరు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అభ్యర్థులను ఆదివారం అర్ధరాత్రి లేదా.. సోమవారం ప్రకటించే అవకాశముందని కూటమి నేతలు వెల్లడిస్తున్నారు.  

భగ్గుమంటున్న యాదవులు 
తిరుపతిలో అతిపెద్ద సామాజిక వర్గంలో ఒకటైన యాదవులకు మేయర్‌ పీఠం దక్కుతుందని అంతా భావించారు. ఎమ్మెల్యే టికెట్‌ బలిజలకు ఇవ్వడంతో మేయర్‌ పీఠం యాదవులకే అని అనుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా జేబీ శ్రీనివాస్‌ పేరుని మంత్రి నారా లోకేష్‌ ప్రకటించి యాదవుల ఆశలపై నీళ్లు చల్లారు. సరే.. డిప్యూటీ మేయర్‌ అయినా దక్కుతుందని ఆశిస్తే, అవి కూడా గల్లంతైనట్లు విశ్వసనీయ సమాచారం. 

అలాగే  బీజేపీ  కార్పొరేటర్‌ పృథ్వీరెడ్డి, జనసేన కార్పొరేటర్‌ రాజారెడ్డి, షాహినా మరి కొందరు డిప్యూటీ మేయర్‌ పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. అయితే అనూహ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన గేట్‌ విద్యాసంస్థల చైర్మన్‌ వెంకటేశ్వర్లు సతీమణి విజయ పేరు ఖరారు చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కోసం కష్టపడి పనిచేసిన రాజారెడ్డి (పల్లెరెడ్డి)కి డిప్యూటీ మేయర్‌ పదవి ఇస్తారని అంతా అనుకున్నారు. ఆ మేరకు రాజారెడ్డి నగరంలో ప్రచారం కూడా చేసుకున్నారు. అయితే ఆయనకి మొండిచేయే ఎదురైంది. ఇక ఎస్సీ, మైనారిటీల ఊసే లేకుండా పోయిందని ఆ సామాజిక వర్గాలవారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement