డాబాగార్డెన్స్: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) నూతన మేయర్‌గా ముక్కా శ్రావణి ప్రమాణ స్వీకారం వాయిదాపడింది. ఆమె తండ్రి ముక్కా ముత్యాలనాయుడు ఈ నెల 20న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం–1955లోని సెక్షన్ 673–ఏ(2) ప్రకారం ఎన్నికైన సభ్యులు పదవీకాలం ప్రారంభమైన తేదీ నుంచి మూడు నెలల్లోగా లేదా ఆ తేదీ తర్వాత జరిగే కార్పొరేషన్ తొలి మూడు సమావేశాల్లో ప్రమాణ స్వీకారం చేయవచ్చని పేర్కొంది. ఈ నిబంధనల ప్రకారం శ్రావణి తదుపరి సమావేశంలో మేయర్‌గా ప్రమాణం చేయవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి డాక్టర్ ఎ.మల్లికార్జున ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సోమవారం నాడు 120 మంది కార్పొరేటర్లు మాత్రమే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
డిప్యూటీ మేయర్‌పై కూటమిలో పోటీ
డిప్యూటీ మేయర్ పదవి దక్కించుకునేందుకు కూటమి పార్టీల మధ్య పోటీ నెలకొంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జనసేన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు తమ పార్టీల తరఫున ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. మేయర్ పదవిని టీడీపీకి కేటాయించిన నేపథ్యంలో డిప్యూటీ మేయర్ పదవి కూడా తమకే ఇవ్వాలని టీడీపీ నేతలు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా మేయర్ ఎన్నికకు సహకరించినందున డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించాలని ఆ పార్టీ నాయకులు, తమకే కేటాయించాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
యాదవ సామాజిక వర్గానికి ఇవ్వాల్సిందే!
డిప్యూటీ మేయర్ పదవిని యాదవ సామాజిక వర్గానికి కేటాయించాలని ఆ సామాజిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే సామాజిక వర్గ సమావేశాలు, విలేకరుల సమావేశాలు నిర్వహించి తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. యాదవ సామాజిక వర్గానికి చెందిన 19 మంది కార్పొరేటర్లలో ఎవరికైనా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. జనసేన నుంచి 30వ వార్డు కార్పొరేటర్‌గా ఎన్నికైన మన్యాల శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. మరోవైపు బీజేపీ కార్పొరేటర్ గంకల కవితా అప్పారావు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో డిప్యూటీ మేయర్ ఎంపిక కూటమి పారీ్టలకు సవాల్‌గా మారింది.


