పేట్రేగిన ‘పచ్చ’ గూండాలు | Violent incidents during panchayat elections | Sakshi
Sakshi News home page

పేట్రేగిన ‘పచ్చ’ గూండాలు

Nov 23 2026 4:03 AM | Updated on Nov 23 2026 4:03 AM

Violent incidents during panchayat elections

పల్నాడు జిల్లా గొట్టిముక్కలలో మహిళా సర్పంచ్‌ అభ్యరి్థతో అసభ్యంగా ప్రవర్తిస్తూ నామినేషన్‌ పత్రాలు గుంజుకుంటున్న టీడీపీ గూండాలు

పోలీసులు, ఎస్‌ఈసీ అండతోనే  ఘాతుకాలు 

జమ్మలమడుగులో రాళ్లు, సీసాలతో దాడులు

పల్నాడు జిల్లాలోనూ అరాచకాలు  

గుత్తిలో గుమ్మనూరు బరితెగింపు  

శ్రీకాకుళం జిల్లాలో రెచ్చిపోయిన మంత్రి అచ్చెన్న కుటుంబ సభ్యులు  

పంచాయతీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు

సాక్షి, నెట్‌వర్క్‌: గ్రామాలు.. సంగ్రామాలను తలపించాయి. పచ్చినెత్తురు మరిగిన అధికారపార్టీ పచ్చ మూకలు పేట్రగిపోయాయి. పోలీసులు, ఎస్‌ఈసీ అండతో ఈ ఘాతుకాలకు తెగబడ్డాయి. ప్రశాంతంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియను రణరంగంగా మార్చాయి. ఫలితంగా పల్లె సీమలు పచ్చ రాబందులతో హింసాత్మకంగా మారుతున్నాయి. కకావికలమవుతున్నాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దారుణాలు ప్రజాస్వామ్యాన్ని నడిబజారులో నగుబాటు చేశాయి. అధికారపార్టీ అహంకారానికి పరాకాష్టగా నిలిచాయి.

» వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం మండలంలో ఓబన్న పేట, చౌటపల్లి గ్రామాల్లో నామినేషన్లు వేసేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీకి మద్దతు పలికిన అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఓబన్నపేటలో నామినేషన్లు వేస్తామని వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థులు చెప్పడంతో వెన్నుపోటు పార్టీ కూటమి గూండాలు రాళ్లు, సీసాలతో దాడులకు తెగబడ్డారు. కొండాపురం సీఐ రాజు సమక్షంలోనే ఈ దాడులు జరిగినా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు.

వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలంలో వైఎస్సార్‌సీపీ నేతలపై రాళ్లు రువ్వుతున్న టీడీపీ గూండాలు 

» ఎర్రగుంట్ల మండలం చిలంకూరు, తుమ్మలపల్లిలలో  వైఎస్సార్‌సీపీ మద్దతు పలికిన అభ్యర్థులను అల్లరిమూకలు అడ్డుకున్నాయి. పోట్లదుర్తిలో హనుమనగుత్తి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి నామినేషన్‌ పత్రాలను పచ్చమూకలు చించివేశాయి. తిప్పలూరు గ్రామంలోనూ కూటమి గూండాలు దళితులపై దాడి చేశారు. అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను చించివేశారు.
» ముద్దనూరు మండలంలో గంగాదేవిపల్లెలో వైఎస్సార్‌సీపీ మద్దతు పలికిన అభ్యర్థులు నామినేషన్లు వేశారనే కక్షతో భాస్కర్‌రెడ్డి మూలారెడ్డి వెంకటరమణారెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి ఇళ్లపైకి కత్తులు, రాడ్లతో వెళ్లి దాడులకు తెగడ్డారు. దీంతో గ్రామం నెత్తురోడింది. ముద్దనూరు మండల కేంద్రంలో తిమ్మాపురం గ్రామానికి వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను కూటమి గూండాలు చించివేసేందుకు యత్నించారు. బెదిరింపులకు పాల్పడ్డారు. 
» జమ్మలమడుగు మండలంలోని ధర్మాపురం క్లస్టర్‌లో మోరగుడి, ఎస్‌.ఉప్పలపాడు గ్రామాల్లో కూటమి రౌడీలు కర్రలు పట్టుకుని హల్‌చల్‌చేశారు.
» వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని గోపవరం గ్రామ పంచాయతీలో విపక్ష మద్దతుదారులెవరూ నామినేషన్‌ వేయకుండా టీడీపీ నేతలు మారణాయుధాలతో రోడ్లపై హల్‌చల్‌చేశారు. కట్టెలు, రాడ్లతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. పెద్దశెట్టిపల్లెలో విపక్ష మద్దతుదారుల నామినేషన్‌ పత్రాలు చించేశారు. కొత్తపల్లె మేజర్‌ గ్రామ పంచాయతీలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను నామినేషన్‌ వేయనివ్వకుండా అడ్డుకున్నారు.


వైఎస్సార్‌ కడప జిల్లా ముద్దనూరులో పచ్చగూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన భాస్కర్‌రెడ్డి 

» పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడు గ్రామంలో నామినేషన్‌ కేంద్రం వద్ద కొత్తూరు గ్రామ పంచాయతీకి చెందిన వైఎస్సార్‌సీపీ మద్దతు పలికిన అభ్యర్థులపై టీడీపీ గూండాలు కర్రలు, రాళ్లతో దాడిచేశారు. తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతూ అభ్యర్థుల చేతిలో ఉన్న నామినేషన్‌ పత్రాలను బలవంతంగా లాక్కొని చించివేశారు.
»  పల్నాడు జిల్లా పొందుగల గ్రామంలో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులను సీఐ ఖాజావలితో పాటు పోలీసులు అడ్డుకున్నారు. అధికారులు, పోలీసుల తీరుకు నిరసనగా రామాపురం రోడ్డు వద్ద అభ్యర్థులు ఆందోళన చేపట్టారు.
» పల్నాడు జిల్లా మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల, కారంపూడి మండలాల్లోనూ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను టీడీపీ మూకలు అడ్డుకున్నాయి. నామినేషన్‌ను వేయనివ్వకుండా తీవ్ర ఇబ్బందులపాలుచేశాయి. రెంటచింతలలో వైఎస్సార్‌సీపీ మద్దతు పొందిన అభ్యర్థులపై టీడీపీ గూండాలు తీవ్రంగా దాడి చేశారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
» గురజాల మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ బలపర్చిన సర్పంచ్‌ అభ్యర్థి సింగం అంజమ్మ ఆదివారం నామినేషన్‌ వేసేందుకు వెళుతుండగా టీడీపీ మూకలు అడ్డుకుని, మహిళ అని కూడా చూడకుండా అసభ్యంగా పట్టుకుని నామినేషన్‌ పత్రాలు లాక్కొని చించివేశారు.
» అనంతపురం జిల్లా గుత్తిలో టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అనుచరులు బరితెగించారు. ఊబిచెర్ల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు పి.రామరంగారెడ్డిని కిడ్నాప్‌ చేసేందుకు విఫలయత్నం చేశారు. కారులో తీసుకెళ్లిపోయారు. చివరకు వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గ్రామశివార్లలోని 44వ జాతీయ రహదారిపై విడిచిపెట్టి వెళ్లారు. గుత్తి పట్టణంలోని రైల్వే బ్రిడ్జి సమీపంలో శనివారం రాత్రి వైఎస్సార్‌సీపీ నాయకుడు, లచ్చానపల్లి సర్పంచ్‌ అభ్యర్థి రామాంజనమ్మ భర్త రామిరెడ్డిని కిడ్నాప్‌ చేయడానికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విఫలయత్నం చేశారు. అయితే రామిరెడ్డి ఎదిరించి వారి బారి నుంచి తప్పించుకున్నారు.
» నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రిలో ఆదివారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పక్కా ప్రణాళికతో టీడీపీ గూండాలు చెలరేగారు. సుమారు 40 మంది కిరాయి రౌడీమూకలను తెచ్చి పెట్టుకున్నారు. ప్రచారంలో భాగంగా చాగలమర్రిలో జాతీయ రహదారి వెంట ఉన్న ఇళ్ల వద్దకు వెళ్లిన విపక్ష అభ్యర్థులపై రాళ్లు, కర్రలు, రాళ్లతో ఒక్కసారిగా దాడులకు పాల్పడ్డారు. విచక్షణారహితంగా దొరికినవారిని దొరికినట్టు కొట్టారు. చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. రాత్రిపొద్దుపోయే వరకు టీడీపీ మూకలు గ్రామంలో హల్‌చల్‌ చేశారు.

పల్నాడు జిల్లా రామాపురంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై దాడికి పాల్పడుతున్న టీడీపీ కార్యకర్తలు 

మంత్రి సోదరుడి కొడుకు దాడి 
శ్రీకాకుళం జిల్లాలోని మంత్రి అచ్చెన్నాయుడు సొంత గ్రామం నిమ్మాడ సమీపంలో ఆదివారం వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై టీడీపీ వర్గీయులు దౌర్జన్యానికి తెగబడ్డారు. మంత్రి అన్న హరివరప్రసాద్‌ కుమారుడు సురేష్‌తో పాటు మరి కొంత మంది టీడీపీ కార్యకర్తలు దారి కాచి మరీ చిట్టివలస స్థానానికి నామినేషన్‌ వేసేందుకు వెళ్తున్న మహిళా అభ్యర్థి సంపతిరావు లక్ష్మితోపాటు ఆమె భర్త మాజీ సర్పంచ్‌ వెంకటరమణమూర్తి, మరి కొంత మంది వైఎస్సార్‌సీపీ నాయకులను అడ్డగించి వారి నామినేషన్‌ పత్రాలను చించివేసి వెనక్కి పంపేశారు. అంతే కాకుండా మహిళా అభ్యర్థితో పాటు మద్దతుదారులపై దాడికి పాల్పడ్డారు. దీంతో వారంతా టెక్కలి చేరుకుని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌తో కలిసి డీఎస్పీ లక్ష్మణరావుకు ఫిర్యాదు చేశారు.  

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం చిట్టివలస పంచాయతీలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు లక్ష్మిపై దాడి చేస్తున్న టీడీపీ కార్యకర్త 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement