ఎవరి కోసం పొత్తు? | Jana Sena faces harassment from TDP in several places during panchayat elections | Sakshi
Sakshi News home page

ఎవరి కోసం పొత్తు?

Nov 23 2026 3:50 AM | Updated on Nov 23 2026 3:50 AM

Jana Sena faces harassment from TDP in several places during panchayat elections

బూట్లతో కొట్టుకుంటున్నజనసేన రాజంపేట ఇన్‌చార్జ్‌ హరిరాయల్‌

అధినేత పవన్‌ కళ్యాణ్‌ తీరుపై ఆగ్రహంతో ఊగిపోతున్న జనసేన శ్రేణులు

పంచాయతీ ఎన్నికల్లో పలు చోట్ల టీడీపీ నుంచి వేధింపులు 

స్వేచ్ఛగా నామినేషన్‌ వేసి పోటీలో నిల్చోలేని దుస్థితి 

పొత్తు ధర్మాన్ని పాటించకుండా టీడీపీ దాడులు, దౌర్జన్యాలు 

వైఎస్సార్‌ కడప జిల్లా చక్రాయపేట మండలంలో జనసేన కార్యకర్త మృతి 

మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి ఆందోళన చేసిన జనసేన నేతలు, కార్యకర్తలు 

బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు 

ప్రభుత్వం, పోలీసుల తీరుపై సోషల్‌ మీడియాలో తీవ్రంగా స్పందించిన జనసేన శ్రేణులు 

నాలుగు గోడల మధ్య ఉంటూ అంతా బావుందనుకోవడం సరికాదని హితవు 

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలేమయ్యాయని నిలదీత 

కార్యకర్తల ప్రాణాలు పోతున్నా పట్టదా అంటూ పవన్‌పై మండిపాటు 

కేవలం 14 గంటల వ్యవధిలో చక్రాయపేట ఘటనపై ‘ఎక్స్‌’లో 4,900 పోస్టులు

సాక్షి, అమరావతి: దేనికయ్యా పొత్తు! అమాయకులను చంపడానికా..! గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి సంబంధించి కూటమిలో మిత్రపక్షాలుగా కొనసాగుతున్న టీడీపీ, జనసేన మధ్య ఘర్షణల నేపథ్యంలో వైఎస్సార్‌ కడప జిల్లా చక్రాయపేట మండలంలో జనసేన సానుభూతిపరుడు మరణించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జనసేన పార్టీ కార్యకర్త ఒకరు సోషల్‌ మీడియా వేదికగా చేసిన పోస్టు ఇది. పొత్తు ధర్మాన్ని పాటించకుండా టీడీపీ దాడులు, దౌర్జన్యాలు చేస్తోందని.. పంచాయతీ ఎన్నికల్లో పలు చోట్ల టీడీపీ నుంచి వేధింపులు తీవ్రతరమైనా పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదని జనసేన శ్రేణులు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్వేచ్ఛగా నామినేషన్‌ వేసి పోటీలో ఉండలేని దుస్థితి నెలకొందని వాపోతున్నాయి. 

చక్రాయపేట మండలంలో శనివారం రాత్రి ఘటన జరిగిన తర్వాత నుంచి ఆదివారం సాయంత్రం వరకు 14 గంటల వ్యవధిలో ఈ ఘటనకు సంబంధించి జనసేన కార్యకర్తలు ‘ఎక్స్‌’లో ఏకంగా 4,900 పోస్టులు పెట్టడం గమనార్హం. పొత్తుల కారణంగా క్షేత్రస్థాయిలో టీడీపీ వల్ల జనసేన శ్రేణులకు జరుగుతున్న అన్యాయాలపై పవన్‌కళ్యాణ్‌ వైఖరి, పార్టీలో ఇతర నేతల తీరును తూర్పారపడుతూ వందల కొద్దీ పోస్టులు పెట్టారు. టీడీపీ నేతల వేధింపుల వల్లే జనసేన కార్యకర్త మరణించారంటూ వైఎస్సార్‌ కడప జిల్లా చక్రాయపేట మండలంలో ఆ పార్టీ నాయకులు మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి శనివారం రాత్రి ఆందోళన నిర్వహించారు. 

ఈ సందర్భంగా జనసేన నాయకులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి నెట్టుకుంటూ తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా జనసేన శ్రేణులు సోషల్‌ మీడియాలో పోస్టు చేసి, టీడీపీ వైఖరిని దుయ్యబట్టారు. ‘అధికారంలో ఉండీ, పొత్తుల్లో మిత్రపక్షం వేధింపుల వల్ల పోటీ చేయలేని పరిస్థితి ఉంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి..’ అంటూ ఓ కార్యకర్త ఆ పార్టీ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశారు. ‘మీరు పైన బాగానే ఉంటారు. కింద కేసులు పెట్టించుకొని ఇలా చనిపోతున్నారు’ అంటూ మరో కార్యకర్త ‘ఎక్స్‌’లో పోస్టు చేసి నిరసన వ్యక్తం చేశారు.  

                              జనసేన శ్రేణులు సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులు 

బయటకొచ్చి చూడండి 
‘ఎంత వొద్దు, వొద్దు స్పందించకూడదనుకున్నా అవ్వట్లేదు. ఇప్పటికి అయినా జెండా పట్టుకొని పార్టీ కోసం పనిచేసే వాళ్ల గురించి ఆలోచించండి. పార్టీ కోసం పని చేసే వారిని కాపాడండి..’ అంటూ మరో పోస్టు వైరల్‌ అయ్యింది. ‘మీ మౌనం మాకు శాపంగా మారకూడదు సమరా! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్త చెంపమీద దెబ్బ పడితే స్పందించి నిలబడ్డావు. ఇప్పుడు అధికారంలో ఉండీ కూడా కార్యకర్తల ప్రాణాలు పోతున్నాయంటే స్పందించడం లేదు’ అంటూ ఇంకో పోస్టు. 2019–24 మధ్య చోటు చేసుకున్న ఘటనలను గుర్తు చేస్తూ పలువురు పవన్‌కళ్యాణ్‌ తీరును తప్పుపట్టారు. 

టీడీపీ–జనసేన పొత్తు 15 ఏళ్ల పాటు కొనసాగాలంటూ తరుచూ ప్రకటనలు చేస్తున్న పవన్‌ ఆ విషయాన్ని పునరాలోచించాలని కోరుతున్నారు.  ‘పొత్తులో నాలుగు గోడల మధ్య ఉండే నాయకులు బాగుంటే కూటమి బాగున్నట్టు కాదు. బయటకొచ్చి చూడండి. మీ జనసేన కార్యకర్తకు ఇచ్చే విలువ, గుర్తింపు ఏంటో తెలుసుకొండి’ అంటూ దుయ్యబట్టారు. కార్యకర్త మృతిపై ఆందోళన చేస్తున్న నాయకులను ఎక్కడికి తీసుకెళుతున్నారో చెప్పకుండా బలవంతపు అరెస్టులకు పాల్పడడాన్ని తప్పుపడుతూ ఓ కార్యకర్త.. ‘ఇది ప్రజాస్వామ్య పాలనా.. లేక నిరంకుశ పాలనా’ అంటూ ప్రశ్నించారు.  

ఇంకా 15 ఏళ్లు కూటమిగా ఉండాలా?
రాజకీయాల వల్ల చిన్న చిన్న నేతలు, కార్యకర్తలు ఎవరు చనిపోయినా పార్టీకి ఏ ఇబ్బందీ ఉండదు.. మీరు పైన బాగుండటం కోసం కింది వాళ్లు ఇంకా 15 ఏళ్లు నలిగిపోవాలా? అంటూ జనసేన కార్యకర్త ఒకరు ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో జనసేన ద్వితీయ శ్రేణులకు తీవ్ర అన్యాయం చేస్తూ టీడీపీ కూటమిలో జనసేనకు తక్కువ సీట్లు కేటాయించిన నేపథ్యంలో చర్చల సందర్భంగా పవన్‌ స్పందించిన తీరును గుర్తు చేస్తున్నారు. ‘సీట్లు సర్దుబాటు చేయలేక చంద్రబాబు బాగా నలిగిపోయారు’ అంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు. 

‘ఇప్పుడు మన కార్యకర్తలు నలిగిపోవడం మీకు కనబడదా.. చంద్రబాబు నలిగిపోవడమే 3డీలో కనబడుతోందా’ అంటూ పలువురు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆ టీడీపీకి ఎందుకు తొత్తులా తయ్యారయ్యావో మీకే క్లారిటీ లేదు’ అని మరో కార్యకర్త పవన్‌ కళ్యాణ్‌ను కడిగి పారేశారు. ‘టీడీపీ నుంచో మంటే నుంచోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. అంతకు మించి మేం ఏమి చేయలేం’ అంటూ పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గతంలో కందుకూరు జనసేన కార్యకర్తను టీడీపీ శ్రేణులు కారుతో గుద్ది.. ఎక్కించి చంపడం, శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్త హత్య కేసులో తిరిగి జనసేన నేతలపైనే కేసు పెట్టడం.. ఇలా బాధితులపైనే పలు ఘటనల్లో కేసులు నమోదవ్వడం చూస్తుంటే మనం అధికారంలో ఉండటం అవసరమా? అని పలువురు ప్రశ్నించారు. ‘పొత్తు కారణంగా జనసేనకు ఏం డ్యామేజీ జరుగుతుందో మీకు తెలుసా..’ అంటూ మరో కార్యకర్త ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఏడాది క్రితం గాలివీడు ఎంపీడీవో కార్యాలయంలో మండలాధ్యక్షురాలి భర్తకు, ఎంపీడీవోకు మధ్య గొడవ జరిగితే ఆగఘమేఘాల మీద అక్కడికి వెళ్లి హంగామా చేయడం ఎవరూ మరచిపోలేదని, ఇప్పుడు మన పార్టీ కార్యకర్త మరణిస్తే అదే స్థాయిలో ఎందుకు స్పందించడం లేదని పవన్‌ను నేతలు నిలదీస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement