కోర్టు ఆదేశాలను ధిక్కరించవద్దంటూ బెంగళూరులో షర్మిలను అడ్డుకుంటున్న కర్ణాటక పోలీసులు
చంద్రబాబు డైరెక్షన్లో ఎల్లో మీడియా వికృత క్రీడ
కోర్టు నిషేధాజ్ఞలు స్పష్టంగా ఉన్నా యలహంక నివాసానికి వెళ్లేందుకు షర్మిల ప్రయత్నం
కోర్టు ఆదేశాలు పాటించాలని షర్మిలకు సూచించిన కర్ణాటక పోలీసులు
ఏపీ పోలీసులను వెంట పంపించి కోర్టు ఉత్తర్వులు ధిక్కరించేలా చంద్రబాబు స్కెచ్
కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే.. నచ్చజెప్పింది వారి పోలీసులే
అయినా ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం
విజయమ్మ కంటతడి పెట్టారంటూ అభూత కల్పనలు.. ఆమె రావడానికి ఏ అడ్డంకీ లేదు
యలహంక ఆస్తి వివాదంపై కోర్టులో విచారణ..
పెళ్లిని అడ్డుపెట్టుకుని అక్కడికి వెళ్లి వివాదం రేకెత్తించడంలో ఆంతర్యం ఏమిటి?
ఏదైనా అభ్యంతరం ఉంటే కోర్టులోనే తేల్చుకోవచ్చు కదా!
ఈ వాస్తవాలను పట్టించుకోకుండా ఎల్లో మీడియాలో రోజుకో దిగజారుడు కథనం
చంద్రబాబు తొలుత ప్రకటించడం.. ఆమె ఆచరించడం.. బదులుగా నజరానా
షర్మిల భర్త బినామీ కంపెనీ ‘ఆమోద’కు 50 ఏళ్ల మైనింగ్ లీజు..
బాబు డైరెక్షన్లో షర్మిల నడుస్తున్నారనేందుకు మరో సాక్ష్యం..
ఇవన్నీ కప్పిపెట్టి జగన్‌పై బురద చల్లడమే పనిగా ఎల్లో మీడియా శివాలు
సాక్షి, అమరావతి: బెంగళూరు కేంద్రంగా చంద్రబాబు నాయుడు రాజకీయ వికృత క్రీడకు తెరతీశారు. యలహంక ఇంట్లోకి వెళ్లవద్దని కోర్టు స్పష్టంగా ఉత్తర్వులు ఇచ్చినా, వాటిని ధిక్కరించి షర్మిల ముందుకు వెళ్లేలా పక్కా కుతంత్రం నడిపించారు. తనది కాని ఆస్తిలోకి వెళ్లి వివాదం రేకెత్తించడమే లక్ష్యంగా.. సాక్ష్యాత్తు కోర్టు ఉత్తర్వులనే లెక్క చేయక వెళుతున్న షర్మిలకు కర్ణాటకలోని పోలీసులు ఆ ఉత్తర్వుల గురించి స్పష్టంగా వివరించారు. వాస్తవానికి కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. యలహంక ఇంటికి వెళ్లకూడదని సూచించింది అక్కడి పోలీసులే.
అయితే ఏపీ నుంచి పోలీసులను తీసుకెళ్లిన షర్మిల.. జగన్ నివాసమైన యలహంక వద్దకు చేరుకునేందుకు సిద్ధపడగా.. కోర్టు ఆదేశాల గురించి మరోమారు వివరించిన కర్ణాటక పోలీసులు.. ఆమె బస చేయనున్న లీలా ప్యాలెస్ హోటల్‌కు పంపించారు. సరిగ్గా ఇక్కడే చంద్రబాబు తన కుటిల నీతిని మరోమారు ప్రదర్శించారు. బాబు ఆలోచనల మేరకు ఎల్లో మీడియా విషం చిమ్ముతూ ఆదివారం ఆ పనిని నిరాటంకంగా కొనసాగించింది. ఉన్నవీ లేనివీ పోగేసి అబద్దాలు, మోసాలు, అభూత కల్పనలతో తోచిన కథలన్నీ అలవోకగా అల్లేసింది. అనేక కథలను పోగేసి తమ నాటకాన్ని రక్తి కట్టించాలని చూసింది. షర్మిల, విజయమ్మ కంటతడి పెట్టారని గగ్గోలు పెట్టింది. పసుపు కామెంటేటర్లు, యాంకర్లు అవే అబద్దాలపై రకరకాల కామెంట్లు చేసి నోటి దురద తీర్చుకున్నారు.
యలహంక వెళ్లకూడదని చెప్పిందెవరు?
కోర్టు తీర్పు ఉన్నా యలహంకకు వెళ్లాలనుకోవడం.. ముమ్మాటికీ కోర్టు తీర్పును ధిక్కరించడమే. కోర్టు తీర్పు స్పష్టంగా ఉంది కాబట్టే మిమ్మల్ని అటువైపు అనుమతించలేకపోతున్నామని చెప్పింది ఎవరు? ప్రాధేయపడి మరీ షర్మిలకు వివరించింది ఎవరు? కర్ణాటక పోలీసులు. అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. కర్ణాటక పోలీసులు ఎవరి కంట్రోల్లో ఉన్నారు? ఇందులో ఇతరుల ప్రస్తావన ఎక్కడుంది? షర్మిలైనా.. జగనైనా.. సామాన్య పౌరులైనా కోర్టు తీర్పును గౌరవించవలసిందే కదా.. ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయస్థానం ఆదేశాలను గౌరవించడం పౌరుల ప్రాథమిక విధి. ఉల్లంఘిస్తే చట్టప్రకారం శిక్షార్హులౌతారు.
ఈ విషయం తెలియదా చంద్రబాబుకు.. ఆయన కనుసన్నల్లో విషం కక్కుతున్న ఎల్లో మీడియాకు? వెనకాముందూ చూసుకోకుండా యలహంక వెళ్లాలనుకోవడం వెనుక చంద్రబాబు కుతంత్రం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది.. షర్మిల ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు. అసలు షర్మిల వెంట ఉన్న ఏపీ పోలీసులు ఏం చేస్తున్నారు? చంద్రబాబు డైరెక్షన్లో కళ్లు మూసుకుని పనిచేయడమేనా..? చట్టం, కోర్టులు, కోర్టు తీర్పుల గురించి వివరించి.. తప్పు చేయకుండా నివారించాల్సిన బాధ్యత లేదా? అంటే చంద్రబాబే వెనుక ఉండి నడిపించారని ఇట్టే స్పష్టమవుతోంది.

షర్మిల భర్త అనిల్ బినామీ కంపెనీ ఆమోద ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్‌కు కర్నూలు జిల్లా వెల్దుర్తిలో 33.01 హెక్టార్ల ఇనుప ఖనిజాన్ని 50 ఏళ్ల పాటు లీజుకు ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు
తప్పు మీరు చేసి జగన్‌పై రుద్దుతారా?
కోర్టు తీర్పును ఉల్లంఘించేందుకు ప్రయత్నించడం కూడా నేరమే. అది చేసింది మీరు. కోర్టు తీర్పు ఉల్లంఘించడం ఒక తప్పు.. ఏపీ పోలీసులను తీసుకెళ్లడం ఇంకో తప్పు.. చంద్రబాబు డైరెక్షన్లో మూర్ఖంగా ముందుకెళ్లాలనుకోవడం మరో తప్పు. కర్ణాటక పోలీసులు ఎంతో మర్యాదగా వివరించారు.. హైవేలో కారు ఆపి మీరు ఇలా చేయకూడదు.. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించకూడదని వివరించారు. అక్కడ జరుగుతున్నది కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నా జగన్‌పై విషం చిమ్మడానికి ఎల్లో మీడియా ప్రయత్నించడం చూస్తే వాళ్ల బరితెగింపు ఏ స్థాయికి చేరుకుందో అర్థమవుతూనే ఉందని విశ్లేషకులంటున్నారు.
పోలీసులతో వాగ్వాదం చేస్తుండడం చానెళ్లలో కనిపిస్తున్నా.. కన్నీరు పెడుతున్నట్లు ఎల్లో మీడియా ప్రసారం చేయడం దిగజారుడుతనం కాదా? షర్మిలే కాదు విజయమ్మ కూడా కన్నీరు పెట్టారంటూ జగన్‌పై ద్వేషం రగిలించేందుకు ఎల్లో మీడియా పడరాని పాట్లు పడింది. విజయమ్మ వస్తే ఎవరు అడ్డుకుంటారు? విజయమ్మపై కోర్టు నిషేధాజ్ఞలేవీ లేవే.. ఎవరి ఆస్తో తనదంటూ బహిరంగంగా తప్పుడు ప్రకటనలు చేసిన షర్మిలపైనే కోర్టు నిషేధాజ్ఞలు విధించింది.
అయినా ఇది ఫ్యామిలీ సమస్య. ఈ సమస్య కోర్టులో ఉంది. కోర్టులో తేల్చుకోవాలి. ఏమైనా ఉంటే కుటుంబ సభ్యులు చూసుకుంటారు.. ఏ కుటుంబంలో విభేదాలు ఉండవు? వాటి మధ్యలో దూరి కావలసినంత ఆజ్యం పోసి కుట్ర రాజకీయాలు చేయడం మనిషన్నవాడు చేస్తాడా? చంద్రబాబులాంటి వాడు తప్ప. అలాంటి కుట్ర రాజకీయాలకు కావలసినంత ప్రచారం చేయడమే ఎల్లో జర్నలిజం.
యలహంక ఆస్తి ఎవరిది?
అసలు బెంగళూరులోని యలహంక ఆస్తి ఎవరిది? ఓ ప్రైవేట్ ప్రాపర్టీలోకి, కుటుంబ విషయాల్లోకి చొచ్చుకుపోయి గంటలకు గంటలు, రోజుల తరబడి ఎల్లో మీడియా చర్చలు పెట్టడమేమిటి? ఆ ఆస్తిని 20 ఏళ్ల క్రితం వైఎస్ భారతి తల్లిదండ్రులు కొనుగోలు చేశారు. ఇద్దరూ రాయలసీమలో పేరున్న డాక్టర్లు. పిల్లల్ని బెంగళూరులో చదివించారు. వైఎస్ భారతి తల్లి సుగుణమ్మ పేరుతో అది రిజిస్టరయ్యింది. అందుకు సంబంధించిన స్టాంపు పేపర్లు ఇతర పత్రాలన్నీ ఉన్నాయి. జగన్ కంపెనీ పేరుతో ఆ ఆస్తిని లీజుకు తీసుకుని అందులో గెస్ట్ హౌస్, ఇల్లు కట్టుకుని వాడుతున్నారు. కరెంటు బిల్లులు, ఆస్తి పన్నులు ఆ కంపెనీయే కడుతోంది. మరి ఇందులో ఇతరులు ఎవరికైనా ఎందుకు హక్కు వస్తుంది?
కలసి నడుస్తున్నారనడానికి ఇంతకన్నా సాక్ష్యం కావాలా?
తన తండ్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని జీవితాంతం ఇటు వ్యక్తిత్వహననం చేస్తూ అటు రాజకీయంగా ద్వేషిస్తూ బురదజల్లిన చంద్రబాబు డైరెక్షన్లో షర్మిల నడుస్తున్నారనేందుకు శనివారం విడుదలైన ఓ మైనింగ్ జీవో సాక్ష్యంగా నిలుస్తుంది. చంద్రబాబుకు రాజకీయంగా ఇబ్బంది వచ్చినప్పుడల్లా తెరపైకి వచ్చి.. సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వహననం చేస్తున్న షర్మిల రుణాన్ని చంద్రబాబు ఇలా తీర్చుకున్నారు. షర్మిల భర్త అనిల్ బినామీ కంపెనీకి 50 ఏళ్లకు ఇనుప ఖనిజం మైనింగ్ లీజు ఇస్తూ చంద్రబాబు సర్కారు హడావిడిగా శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
స్థానిక ఎన్నికలు మొదలైనప్పటి నుంచి చంద్రబాబుకు మేలు చేయడానికి.. కూతురు పెళ్లి పేరుతో వైఎస్ జగన్ ప్రతిష్టను దిగజార్చడానికి క్షణం తీరిక లేకుండా కష్టపడుతున్న షర్మిలకు బహుమానంగా జీవో ఇప్పించడంతో బాబు–షర్మిల చెలిమి మరోసారి ప్రపంచానికి తెలిసింది. అనిల్ బినామీ కంపెనీ ఆమోద ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్‌కు కర్నూలు జిల్లా వెల్దుర్తి సర్వే నెంబర్ 865లో 33.01 హెక్టార్ల ఇనుప ఖనిజాన్ని 50 ఏళ్లపాటు లీజుకు ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2024 ఎన్నికల సమయంలో షర్మిల దాఖలు చేసిన అఫిడవిట్లో ఆమోద స్టీల్‌తో ఉన్న ఆర్థిక బంధాన్ని ఆమే స్వయంగా ప్రకటించుకున్నారు.
కుటుంబంలో చిచ్చుపెట్టే కుట్ర రాజకీయాలు..
బెంగళూరు హోటల్లో పెళ్లి ఉంటే అక్కడికి వెళ్లాలి కానీ కోర్టు తీర్పును ఉల్లంఘించి ఇలా తనది కాని ఆస్తిలోకి రావాలనుకోవడంతోనే చంద్రబాబు డైరెక్షన్లో ఆయన కుట్రలకు షర్మిల వంతపాడుతున్నారు. చంద్రబాబుకు మేలు కలిగేలా.. ఆయన చెప్పినట్టు ఎల్లో మీడియా దిగజారుడు కథనాలకు కావలిసినంత సరుకు ఇవ్వడానికి ప్రయత్నించడం స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులంటున్నారు. చేయాల్సిందంతా చేసి జగన్‌పై బురదజల్లడానికి ప్రయత్నించడం కూడా చంద్రబాబు స్క్రిప్టులో భాగమేనని వారు పేర్కొంటున్నారు.
చంద్రబాబు ఎలాంటి వాడో.. ఎలాంటి కుట్రలు చేస్తాడో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీ సాక్షిగా పలుమార్లు చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. తన తండ్రి రాజారెడ్డిని చంపిన హంతకులకు చంద్రబాబు షెల్టర్ ఇచ్చాడని, అందుకు సాక్ష్యాలు కూడా ఉన్నాయని వైఎస్సార్ చెప్పారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు కుటుంబంలో చిచ్చుపెట్టే కుట్ర రాజకీయాలు చేస్తున్నాడు. షర్మిల రాసిన లేఖలు క్షణాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ప్రత్యక్షమవుతున్నాయంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
చంద్రబాబు డైరెక్షన్లో సాగుతున్న కుట్ర రాజకీయాన్నేమనాలి?
ప్రజాస్వామ్యానికి పాతరేసి అనేక రకాలుగా దిగజారిపోయి నడుపుతున్న స్థానిక ఎన్నికల ప్రక్రియ నుంచి జనం దృష్టి మరల్చడానికి చంద్రబాబు డైరెక్షన్లో అక్టోబర్‌లో మొదలయ్యింది ఈ నాటకం. ఓ మాజీ సీఎం, జెడ్ ప్లస్ భద్రత ఉన్న వీవీఐపీ సెక్యూరిటీ కారణాలతో నిరాకరించడాన్ని చిలవలు పలువలు చేసి జనం దృష్టిని మరల్చేందుకు ఓ పెద్ద వివాదంలా సృష్టించి అనేక దిగజారుడు కథనాలను ఎల్లో మీడియా ప్రసారం చేసింది. బెంగళూరులో జగన్ నివాసం ఉండే ఇల్లు అది. జగన్ అంటే ఓ మాజీ ముఖ్యమంత్రి. జడ్‌ప్లస్ సెక్యూరిటీ ఉన్న వీవీఐపీ.

పెళ్లి పేరుతో వీడియో గ్రాఫర్స్‌ను, డెకరేషన్ చేసే వాళ్లను జగన్ నివాసంలోకి అనుమతిస్తే సెక్యూరిటీకి ఎవరిది బాధ్యత? భద్రతాపరమైన సమస్యలున్నందునే జగన్ అక్కడ వివాహం వద్దని అన్నారు. లోటస్‌పాండ్ నివాసాన్ని ఉపయోగించుకోవచ్చని చెల్లెలికి లేఖ కూడా రాశారు. అయితే ఇవేవీ ఎల్లో మీడియాకు పట్టవు. తనది కాని ఆస్తిలోకి షర్మిల వెళ్లాలనుకోవడం వల్లే సమస్య కోర్టుకు వెళ్లింది. సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయస్థానం స్పష్టమైన తీర్పు ఇచ్చింది. యలహంక నివాసంలోకి వెళ్లవద్దని షర్మిలకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఎలాంటి ఆటంకాలూ కలిగించవద్దని, సిలికాన్ బిల్డర్స్ సంస్థ వాదనల్లో ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొంది.
మరి కోర్టు ఆదేశాలను గౌరవించాలా వద్దా? ఏదైనా అభ్యంతరం ఉంటే ఏం చేయాలి? మరలా కోర్టును ఆశ్రయించాలి.. సమస్యను కోర్టులోనే తేల్చుకోవాలి. అది వదిలేసి, కోర్టు తీర్పును ఉల్లంఘించి.. జగన్‌ను బదనాం చేయడానికి చంద్రబాబు డైరెక్షన్లో సాగుతున్న కుట్ర రాజకీయాన్నేమనాలి? చంద్రబాబు సాగించే కుట్ర రాజకీయానికి షర్మిల సహకరించడాన్ని ఎలా చూడాలి? చంద్రబాబు షర్మిలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు.. షర్మిల విజయమ్మను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు.. అయినా ఎల్లో మీడియా మాత్రం జగన్‌పై దుష్ప్రచారం చేస్తుంది.. దీన్నేమంటారు?


