మందు బిళ్లలు నిల్ | Hardships faced by patients in government hospitals during Chandrababu administration | Sakshi
Sakshi News home page

మందు బిళ్లలు నిల్

Nov 23 2026 3:41 AM | Updated on Nov 23 2026 3:42 AM

Hardships faced by patients in government hospitals during Chandrababu administration

మందులు బయట కొనుక్కోవాలంటూ ప్రి్రస్కిప్షన్‌పై టిక్‌లు పెట్టిన విజయవాడ జీజీహెచ్‌ వైద్య సిబ్బంది

గోలీ.. ఖాళీ 

చంద్రబాబు పాలనలో ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల దురవస్థ

377 రకాల సర్జికల్స్‌ ఐటెమ్స్‌కు గానూ ఏ ఒక్క జీజీహెచ్‌లోనూ పూర్తి స్థాయిలో లేని దైన్యం

గ్లౌజులు, సెలైన్‌ సెట్లు, దూది, బ్యాండేజ్, ఐవీ క్యాన్యులా లాంటి ప్రాథమిక పరికరాలకూ కటకటే 

కర్నూలు, గుంటూరు, కేజీహెచ్, విజయవాడ, కాకినాడ తదితర జీజీహెచ్‌లలో బయట కొనుక్కోవాలని చీటీలు రాసి పంపుతున్న సిబ్బంది 

రోగులపై అటు మందుల భారం.. ఇటు కనీస సదుపాయాలూ కరువే 

నడవలేని రోగులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నరక యాతన 

భుజాలపై మోస్తూ ఎమర్జెన్సీ వార్డులకు తరలిస్తున్న సహాయకులు 

జీజీహెచ్‌లలో వీల్‌చైర్లు, స్ట్రెచర్లకు దిక్కులేని దుస్థితి

కనీసం సూది, దూదికి కూడా దిక్కులేని దౌర్భాగ్యం

సీఎం నివాసం ఉంటున్న గుంటూరు.. వైద్య శాఖ మంత్రి ఇలాక అనంతలోనూ అదే దౌర్భాగ్యం 

బోధనాస్పత్రుల్లో మూతపడ్డ 1,600 మరుగుదొడ్లు  

ఒంగోలు జీజీహెచ్‌లో నిరుపయోగంగా 80 శాతం టాయిలెట్లు 

ఏఐ డాక్టర్‌.. రోబోటిక్‌ సర్జరీలు.. అంటూ జనం చెవుల్లో బాబు క్యాలీఫ్లవర్లు

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులు అందక ఆగిపోతున్న సేవలు 

నాడు – నేడు నిలిపివేత.. మౌలిక వసతులు కరువై దారుణ పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్పత్రులు 

ప్రభుత్వ కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణతో నిరుపేదలకు ఉచితంగా నాణ్యమైన సూపర్‌ స్పెషాల్టీ సేవలకు గండి

సాక్షి, అమరావతి: వైద్య ఆరోగ్య రంగాన్ని చంద్రబాబు సర్కార్‌ గాలికి వదిలేయడంతో రాష్ట్రంలో నిరుపేదల ప్రాణాలకు దిక్కు లేకుండా పోయింది. గ్రామస్థాయిలో విలేజ్‌ క్లినిక్‌ నుంచి బోధనాస్పత్రుల వరకు అన్ని స్థాయిల్లో మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లో కనీసం సూది, దూదికి కూడా గతిలేని దౌర్భాగ్య పరిస్థితులు దాపురించాయి. రక్తమోడుతూ ఆస్పత్రులకు వచ్చే రోగులకు డ్రెస్సింగ్‌ చేసేందుకు దూది ముక్క, కట్టుకట్టే బ్యాండేజ్, సూది మందు ఇచ్చే సిరంజుల కోసం కూడా ఆస్పత్రులు దేబిరించాల్సిన దుస్థితికి వైద్య రంగాన్ని చంద్రబాబు దిగజార్చారు. 377 రకాల సర్జికల్స్‌ ఐటెమ్స్‌కు గానూ ఏ ఒక్క జీజీహెచ్‌లోనూ వంద శాతం సర్జికల్స్‌ ఐటెమ్స్‌ అందుబాటులో లేవు. 

గ్లౌజులు, సెలైన్‌ సెట్లు, దూది, బ్యాండేజ్, ఐవీ క్యాన్యులా.. ఇలా ఆస్పత్రుల్లో ఎక్కువగా వినియోగించే అత్యంత ప్రాథమిక పరికరాలకు కూడా కొన్నిచోట్ల తీవ్ర కటకట నెలకొంది. రోగుల తాకిడి ఎక్కువగా ఉండే కర్నూలు, గుంటూరు, కేజీహెచ్, విజయవాడ, కాకినాడ తదితర జీజీహెచ్‌లలో సెలైన్‌ సెట్లు, ఐవీ క్యాన్యులాలు, ఇతర పరికరాలను బయట కొనుక్కుని తెచ్చుకోవాలని రోగులకు చీటీలు రాసిస్తున్నారని ఫిర్యాదులున్నాయి. కొద్ది నెలలుగా 100 రకాల వరకూ సర్జికల్స్‌కు ఇండెంట్‌ పెట్టినా ఇవ్వడం లేదని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌లు చెబుతున్నారు. 

కర్నూలు జిల్లాలోని ఆదోని ఆస్పత్రిలో ఏకంగా 60 శాతం, మారుమూల గిరిజన ప్రాంతమైన పాడేరు పెద్దాస్పత్రిలో 56 శాతం, మదనపల్లెలో 55 శాతం, నెల్లూరులో 54 శాతం చొప్పున సర్జికల్స్‌ అందుబాటులో లేవని తెలుస్తోంది. రాయలసీమకు పెద్ద దిక్కు కర్నూలు జీజీహెచ్‌లో 48 శాతం సర్జికల్స్‌ అందుబాటులో లేవు. సర్జికల్స్‌ కొరతలో రాష్ట్రంలోనే టాప్‌–5లో కర్నూలు జీజీహెచ్‌ నిలిచింది. సీఎం నివాసానికి కూతవేటు దూరంలో ఉండే గుంటూరు, విజయవాడ జీజీహెచ్‌లను సైతం మందులు, సర్జికల్స్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. 

కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో వీల్‌చైర్‌ అందుబాటులో లేకపోవడంతో నడవలేని రోగిని మోసుకెళ్తున్న సహాయకుడు

సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌లోనూ కటకటే 
ఆస్పత్రులకు ఏపీఎంఎస్‌ఐడీసీ ద్వారా మందులు సరఫరా చేయాల్సి ఉండగా సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ (సీడీఎస్‌)లోనే పూర్తిస్థాయిలో మందులను ప్రభుత్వం అందుబాటులో ఉంచడం లేదు. 600 రకాల మందుల నిల్వలు ఎల్లçప్పుడూ సీడీఎస్‌లలో ఉండాలి. అయితే, సీడీఎస్‌లలోనే 200 నుంచి 300 రకాల మందులు ఉండటం లేదని తెలుస్తోంది. పారాసెటమాల్, గ్యాస్‌ బిళ్లలు, నొప్పుల మాత్రలు సైతం డిమాండ్‌కు సరిపడా సీడీఎస్‌లలో ఉండటం లేదు. ఏటా నాలుగు దఫాలు మందులు సరఫరా చేయాల్సి ఉంటుంది. క్వార్టర్‌ ప్రారంభానికి నెల రోజుల ముందే అడ్వాన్స్‌ పర్చేసింగ్‌ ఆర్డర్‌(పీవో)లు ఇచ్చి ప్రభుత్వం మందులు సరఫరా చేయాలి. నవంబర్‌ నుంచి మూడో క్వార్టర్‌ ప్రారంభం కాగా నేటికీ కొన్ని రకాల మందులకు పీవోలు కూడా జారీ చేయలేదు. దీన్నిబట్టి ప్రజారోగ్యం పట్ల బాబు సర్కార్‌ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో తేటతెల్లం అవుతోంది. 

కనీస వసతులూ కరువు 
ఏ ప్రభుత్వ ఆస్పత్రిలో చూసినా కనీస సౌకర్యాలు కరువై రోగులు హాహాకారాలు చేస్తున్నారు. సర్కార్‌ ఆస్పత్రుల పేరు చెబితే వణుకుతున్న దౌర్భాగ్య పరిస్థితి మళ్లీ దాపురించింది. ఒకవైపు కనీస వసతులు కూడా లేక ప్రభుత్వాస్పత్రుల్లో నిరుపేద రోగులు తీవ్ర అవస్థలు పడుతుంటే.. మరోవైపు ఏఐ వైద్యం.. ఇంట్లోకే చికిత్సలు.. రోబోటిక్‌ సర్జరీలు.. అంటూ చంద్రబాబు సర్కార్‌ మభ్యపెడుతోంది. ఏఐ వైద్యం.. రోబోటిక్‌ సర్జరీలు దేవుడెరుగు.. ఆస్పత్రుల్లో మందు బిళ్లలు, నడవలేని స్థితిలో ఉండే రోగులకు వీల్‌ చైర్‌లు, స్ట్రెచర్‌లు కూడా అందుబాటులో ఉండటం లేదు. ‘30 అంశాల కార్యాచరణ ప్రణాళిక, ‘వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు’ అంటూ సీఎం చంద్రబాబు, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్‌ ఊదరగొడుతూ రోగులకు కనీసం మరుగుదొడ్లు కూడా సమకూర్చలేని దుస్థితికి ప్రభుత్వ వైద్య రంగాన్ని దిగజార్చారు. 

1,600 మరుగుదొడ్లు బంద్‌.. 
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో 9,305 మరుగుదొడ్లు ఉండగా.. ఏకంగా 1,600కిపైగా మరుగుదొడ్లు మూతపడ్డాయి. 5,732 పురుషుల టాయిలెట్లలో వెయ్యికిపైనే నిరుపయోగంగా మారినా చంద్రబాబు సర్కార్‌లో చలనం లేదు. 3,573 మహిళల టాయిలెట్లలో 576 పని చేయడం లేదు. ఆస్పత్రులకు వస్తున్న మహిళలు, గర్భిణిలు, వృద్ధులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా దిక్కులేక నరకయాతన అనుభవిస్తుండగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.    
» ఒంగోలు జీజీహెచ్‌లో 466 మరుగుదొడ్లు ఉంటే ఏకంగా 372 (80 శాతం) పనిచేయడం లేదు. కేవలం 94 టాయిలెట్లే వేలాది మంది రోగులకు దిక్కవుతున్నాయి.   
» ఉత్తరాంధ్రకు పెద్దదిక్కు విశాఖ కేజీహెచ్‌లో 268 టాయిలెట్లు నిరుపయోగంగా మారాయి. తిరుపతి రుయాలో 144, ఏలూరులో 130, శ్రీకాకుళంలో 122, గుంటూరులో 88, మచిలీపట్నంలో 67, కడపలో 53 మరుగుదొడ్లు పాడై కంపు కొడుతున్నట్టు ఫిర్యాదులున్నాయి.  

అత్యవసర రోగుల ప్రాణాలతో చెలగాటం
» ప్రమాదాల్లో గాయపడినవారు, గుండెపోటు బాధితులు, గర్భిణిలు, వృద్ధులు, ఇతర నడవలేని రోగులు సుదూర ప్రాంతాల నుంచి మెరుగైన వైద్యం కోసం జీజీహెచ్‌లకు వస్తుంటారు. అలాంటి వారిని వార్డుల్లోకి తరలించడానికి కనీసం వీల్‌చైర్‌లు, స్ట్రెచర్‌లు అందుబాటులో ఉండటం లేదు. వాటి నిర్వహణను ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. అన్ని బోధనాస్పత్రుల్లో 2 వేల వీల్‌చైర్‌లు మాత్రమే ఉన్నట్టు లెక్కలు చెబుతుండగా వీటిలో 300కిపైగా విరిగిపోయి మూలనపడ్డాయి. 1,600 స్ట్రెచర్లలో 250కిపైగా పనికి రానివే. రోగిని ఆస్పత్రులకు తీసుకొస్తున్న సహాయకులకు వారిని లోపలకు తరలించేందుకు వీల్‌చైర్‌లు, స్ట్రెచర్‌లు దొరకపుచ్చుకోవడం పెద్ద ప్రహసనంగా మారింది. కొరతను ఆసరాగా చేసుకుని నిరుపేదల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి.  

» వైద్య శాఖ మంత్రి సత్యకుమార్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి అనంతపురం జిల్లాకు పెద్ద దిక్కులాంటి అనంతపురం జీజీహెచ్‌లో రోగుల అవసరాలకు తగ్గట్టుగా వీల్‌ చైర్‌లు, స్ట్రెచర్‌లు అందుబాటులో లేవు. లంచం ఇస్తేగానీ వీల్‌చైర్, స్ట్రెచర్‌లు దొరకని దౌర్భాగ్యం నెలకొంది. ఇదే విషయాన్ని ఇటీవల జీజీహెచ్‌లో పర్యటించిన డీఎంఈ ఎదుట ఓ మహిళ మొరపెట్టుకుంది. ‘అనారోగ్యంతో బాధపడుతున్న మా కుటుంబ సభ్యుడిని తరలించేందుకు వీల్‌చైర్‌ కోసం సిబ్బంది డబ్బులు డిమాండ్‌ చేశారు. ఇప్పడు మా చేతిలో డబ్బు లేదని చెబితే సెల్‌ఫోన్‌ అప్పగించి డబ్బులు ఇచ్చాక తిరిగి తీసుకోమన్నారు’ అని గోడు వెళ్లబోసుకున్న ఘటన సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అయింది. 

»  నెల్లూరు ప్రభుత్వ బోధనాస్పత్రిలో వీల్‌చైర్లు, స్ట్రెచర్లలో సగం పనిచేయడం లేదు. దీంతో అక్కడ రోగులను కుటుంబ సభ్యులు భుజాలపై మోసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. 

బయట కొనుక్కోమన్నారు
కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటా. నా భార్య ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయింది. జీజీహెచ్‌కు తీసుకొస్తే వైద్యులు 5 రకాల మందులు రాశారు. రెండు రకాల మందులు బయట కొనుక్కోమన్నారు. మందుల షాపు లో వాటిని కొనడానికి రూ 500 ఖర్చు అయింది. – రవి, విజయవాడ  

నెలకు రాస్తే .. 15 రోజులకే ఇచ్చారు 
ఐదేళ్లుగా బీపీతో బాధపడుతున్నా. గతంలో నెల రోజులకు సరిపడా మందులు ఒకేసారి ఇచ్చేవారు. ప్రభుత్వం మారాక అలా ఇవ్వడం లేదు. డాక్టర్‌ నెల రోజులకు రాసినా 15, 20 రోజులకే ఇస్తున్నారు. అవి అయిపోయాక మళ్లీ  రమ్మంటున్నారు. మందులు తక్కువగా ఉన్నాయంటున్నారు. దీంతో పనులు మానుకుని నెలలో రెండు సార్లు వెళ్లాల్సి వస్తోంది.  – సోము, అనంతపురం 

ఎక్కడా లేవు 
ఇంట్లో కిందపడి మా నాన్న కాలికి ఫ్రాక్చర్‌ కావడంతో జీజీహెచ్‌కు తీసుకొచ్చాం. నడవలేని స్థితిలో ఉన్నందున వీల్‌చైర్‌ కోసం ఎమర్జెన్సీ వార్డు మొత్తం తిరిగినా ఎక్కడా లేవు. – లక్ష్మి, రోగి సహాయకురాలు విజయవాడ జీజీహెచ్‌ 

అవస్థలు పడుతూ మోసుకెళ్లాం.. 
నానమ్మకు 80 ఏళ్లు. నడవలేదు. ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రికి తీసుకొచ్చాం. వీల్‌చైర్, స్ట్రెచర్‌ కోసం ఆస్పత్రి మొత్తం గాలించాం. ఉన్న వీల్‌చైర్‌లకు చక్రాలు లేకపోవడంతో చేసేదేమీ లేక అవస్థ పడుతూ మోసుకుని వార్డులోకి తీసుకెళ్లాం.  – వెంకటేశ్, రోగి సహాయకుడు, తిరుపతి రుయా

నడవడానికి నరక యాతన పడుతూ ఫొటోలో కనిపిస్తున్న వైఎస్సార్‌ కడప జిల్లా చదిపిరాళ్లకు చెందిన ఓబులేసు కాలును షుగర్‌ కారణంగా వైద్యులు తొలగించారు. అనారోగ్యంతో ఇంటి నుంచి అవస్థలు పడుతూ కడప రిమ్స్‌కు వచ్చాడు. వీల్‌చైర్‌లు అందుబాటులో లేకపోవడంతో ఒంటికాలితో ఓపీ దగ్గరకు చేరుకున్నాడు.

ఈ ఫొటోలో రోగిని చేతులపై మోసుకుని వెళ్తున్న దృశ్యం కొద్ది నెలల కిందట గుంటూరు జీజీహెచ్‌లోనిది. ఒంగోలు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి నుంచి రోజూ వేల మంది పేద రోగులు చికిత్స కోసం ఇక్కడకు వస్తుంటారు. నడవలేని స్థితిలో ఉన్న రోగులను ఆస్పత్రిలోకి తరలించేందుకు వీల్‌చైర్‌లు, స్ట్రెచర్‌లు లేకపోవడంతో అల్లాడుతున్నారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement