సవాళ్లను అవకాశాలుగా మలుచుకోవాలి | Supreme Court Judge at the concluding session of the CLEA conference | Sakshi
Sakshi News home page

సవాళ్లను అవకాశాలుగా మలుచుకోవాలి

Nov 23 2026 3:25 AM | Updated on Nov 23 2026 3:25 AM

Supreme Court Judge at the concluding session of the CLEA conference

సీఎల్‌ఈఏ సదస్సులో మాట్లాడుతున్న సుప్రీంకోర్టు జడ్జి ఎంఎం సుందరేశ్‌. చిత్రంలో తెలంగాణ హైకోర్టు ఏసీజే జస్టిస్‌ శామ్‌కోషి, జస్టిస్‌ మౌషుమి భట్టాచార్య, జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌ తదితరులు

న్యాయరంగంపైనా ఏఐ ప్రభావం: జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌ 

భవిష్యత్తులో సంప్రదాయ నేరాల స్థానంలో వైట్‌కాలర్‌ నేరాలు 

సీఎల్‌ఈఏ సదస్సు ముగింపు కార్యక్రమంలో సుప్రీంకోర్టు జడ్జి

సాక్షి, హైదరాబాద్‌: భవిష్యత్తులో సంప్రదాయ నేరాల స్థానంలో వైట్‌కాలర్‌ నేరాలు పెరిగే అవకాశముందని, కృత్రిమ మేధ (ఏఐ) న్యాయవృత్తిపై గణనీయమైన ప్రభావం చూపనుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌ అన్నారు. న్యాయ విద్యార్థులు, న్యాయవాదులు రానున్న మార్పులకు సిద్ధంగా ఉండాలని, ఎదురయ్యే సవాళ్లను అవకాశాలుగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివారం కామన్వెల్త్‌ లీగల్‌ ఎడ్యుకేషన్‌ అసోసియేషన్‌ (సీఎల్‌ఈఏ) అంతర్జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకానికి సివిల్‌ కేసుల సంఖ్య పెరగడం ఒక సూచికగా నిలుస్తుందని జస్టిస్‌ సుందరేశ్‌ పేర్కొ­న్నారు. 

సివిల్‌ వ్యాజ్యాలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వెనుకబడిన ప్రాంతాల్లో కేసుల సంఖ్య తక్కువగా ఉండటాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజలకు తమ హక్కులపై అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (నల్సా), సంబంధిత సంస్థలు, న్యాయ విద్యార్థులు సమన్వయంతో పనిచేసి అటువంటి ప్రాంతాల్లో ప్రజలకు చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించాలని సూచించారు. న్యాయం అవసరమైన ప్రతి ఒక్క­రూ న్యాయవ్యవస్థను ఆశ్రయించేలా నిరంతరం కేసులు దాఖలయ్యే పరిస్థితిని కల్పించాలన్నారు.  

విధివిధానాలు కనుమరుగు 
న్యాయరంగంలో భారీ మార్పులు రానున్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు న్యాయవాదులు, విద్యార్థులు సిద్ధంగా ఉండాలని జస్టిస్‌ సుందరేశ్‌ చెప్పారు. భవిష్యత్తులో న్యాయ ప్రక్రియలోని విధివిధానాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని, కక్షిదారులు మరింత సులభంగా న్యాయవ్యవస్థను ఆశ్రయించే పరిస్థితులు ఏర్పడతాయని చెప్పారు. చట్టానికి, న్యాయానికి మధ్య ఉన్న అంతరం గణనీయంగా తగ్గుతుందన్నారు. సిద్ధంగా ఉండండి.. నేర్చుకోవాలనే తపనతో ఉండండి.. ఇతరులకు భిన్నంగా ఆలోచించండి అంటూ న్యాయవాదులకు, విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.  

మరింత ముందుకు తీసుకెళ్లాలి: జస్టిస్‌ పి.శామ్‌ కోషి 
రెండు రోజులపాటు నిర్వహించిన సీఎల్‌ఈఏ అంతర్జాతీయ సదస్సు విజయవంతంగా ముగిసిందని తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పి.శామ్‌ కోషి చెప్పారు. ఈ సదస్సులో వివిధ న్యాయస్థానాలకు చెందిన 34 మంది న్యాయమూర్తులు పాల్గొన్నారని తెలిపారు. శ్రీలంక, బంగ్లాదేశ్‌ సహా పలు దేశాలకు చెందిన న్యాయ ప్రతినిధులు, అధికారులు కూడా హాజరయ్యారన్నారు. 

అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి మాట్లాడుతూ.. సదస్సును విజయవంతంగా నిర్వహించిన సీఎల్‌ఈఏ నిర్వాహకులను, ప్రధాన సమన్వయకర్త, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌ను అభినందించారు. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ఆపకుండా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. వివిధ ప్రాంతాల మధ్య పరస్పర పరిచయాలు, న్యాయ­పరమైన పరిజ్ఞానం, అనుభవాల మార్పిడిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement