వైఎస్సార్‌సీపీ హయాంలో భారీగా పెరిగిన పల్లెల ఆదాయం
ఆర్‌బీఐ నివేదికతో తేలిన నిజం
2022–23లో ఒక్కో పంచాయతీ సగటు ఆదాయం రూ.7.67 లక్షలు
2023–24లో రూ.17.18 లక్షలకు పెరుగుదల
2024–25లో రూ.15.70 లక్షలకు పడిపోయిన ఆదాయం
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీల సగటు ఆదాయం పెరిగింది. రాష్టంలోని గ్రామ పంచాయతీలు లోటు నుంచి మిగులు స్థితికి చేరుకున్నాయి. రాబడిలో కూడా భారీ వృద్ధి నమోదైంది. పంచాయతీరాజ్ సంస్థల ఆర్థిక వ్యవహారాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. వివిధ రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీల ఆర్థిక స్థితిగతులను మదించిన ఆర్‌బీఐ నివేదిక రూపంలో వివరాలను వెల్లడించింది.
లోటునుంచి మిగులు.. ఇప్పుడు దిగులు
2022–23లో ఏపీలో గ్రామ పంచాయతీలు లోటు నుంచి 2023–24 ఆర్థిక ఏడాది నాటికి మిగులు స్థితికి చేరుకున్నాయని ఆర్‌బీఐ నివేదిక కుండబద్దలు కొట్టింది. 2022–23లో ఏపీ సహా మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, హరియాణా, ఉత్తరాఖండ్, మిజోరాం గ్రామ పంచాయతీలు లోటు నుంచి 2023–24 నాటికి మిగులు స్థితికి చేరుకున్నాయి. ఇదే సమయంలో అసోం, పంజాబ్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ, బిహార్ రాష్ట్రాల్లోని పంచాయతీలు మిగులు స్థితి నుంచి లోటుకు మారాయి. సొంత వనరుల ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీల పన్ను రాబడి 60.4 శాతం ఉండగా.. పొరుగు రాష్ట్రం తెలంగాణ గ్రామ పంచాయతీల పన్ను రాబడి 53.6 శాతంగా ఉందని నివేదిక తెలిపింది.
పంచాయతీల సొంత ఆదాయ వనరులు పన్నుల నుండి ముఖ్యంగా ఆస్తి, భూమి, వ్యాపారాలపై విధించే పన్నుల నుండి, పన్నేతర వనరుల నుండి అంటే సేవలపై వినియోగ రుసుములు సామాజిక ఆస్తుల అద్దెలు లేదా లీజులు, వడ్డీ ఆదాయాల వంటి వాటి నుండి సమకూరుతాయని నివేదిక పేర్కొంది. జీఎస్టీ తర్వాత స్థానిక పన్నుల ఆదాయం తగ్గినప్పటికీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బిహార్ వంటి రాష్ట్రాలు సాపేక్షంగా బలమైన సొంత ఆదాయ వనరుల పనితీరు కొనసాగించాయని నివేదిక స్పష్టం చేసింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తొలి ఆర్థిక ఏడాది 2024–25 రాష్ట్రంలోని పంచాయతీల సగటు ఆదాయం రూ.17.18 లక్షల నుంచి రూ.15.70 లక్షలకు పడిపోయిందని ఆర్‌బీఐ నివేదిక తేల్చిచెప్పింది.
50 శాతానికి పైగా పెరిగిన రాబడులు
2022–23 ఆర్థిక ఏడాదితో పోలిస్తే 2023–24 ఆర్థిక ఏడాదిలో ఏపీలో గ్రామ పంచాయతీల రాబడులు 50 శాతానికి పైగా పెరిగాయని ఆర్‌బీఐ నివేదిక స్పష్టం చేసింది. ఏపీతో పాటు హరియాణ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు గణనీయమైన వృద్ధిని కనబరిచాయని నివేదిక పేర్కొంది. ఏపీలో ఒక్కో పంచాయతీ సగటు ఆదాయం 2022–23 ఆర్థిక ఏడాదిలో రూ.7.67 లక్షలు ఉండగా.. 2023–24 ఆర్థిక ఏడాదిలో ఆ మొత్తం రూ.17.18 లక్షలకు పెరిగినట్టు నివేదిక తెలిపింది. 2024–25 ఆర్థిక ఏడాదిలో పంచాయతీల సగటు ఆదాయం రూ.15.70 లక్షలకు తగ్గింది. అంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీల ఆదాయం పెరగ్గా.. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తగ్గిపోయిందని స్పష్టమవుతోంది.


