భక్తుల భద్రతకు రైల్వే శాఖ ప్రత్యేక కార్యాచరణ
సాక్షి, అమరావతి: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల రైలు ప్రయాణ భద్రతపై రైల్వే శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా 148 ప్రత్యేక రైళ్లను కేరళలోని కొల్లం వరకు నడపాలని నిర్ణయించగా.. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి నవంబర్ నుంచి జనవరి వరకు 98 ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో రైళ్లలో అగ్నిప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక తనిఖీలు చేపడుతోంది. భక్తులు ప్రయాణ సమయంలో కర్పూరం, అగరబత్తులు, కొవ్వొత్తులు, దీపాలు వెలిగించరాదని సూచించింది.
పెట్రోల్, కిరోసిన్, గ్యాస్ సిలిండర్లు, బాణసంచా వంటి మండే వస్తువులను తీసుకెళ్లడం నిషేధమని స్పష్టం చేసింది. పొగలు, మంటలు కనిపిస్తే వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం ఇవ్వాలని, 139 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని కోరింది. అత్యవసర పరిస్థితుల్లో అలారం చైన్ లాగాలని, కదులుతున్న రైలు నుంచి దూకరాదని సూచించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే రైల్వే చట్టం ప్రకారం మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరించింది. విజయవాడ తదితర ప్రధాన రైల్వే స్టేషన్ల పరిధిలో గత రెండు రోజులుగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తుండడం గమనార్హం.


