ఖరీదైన ప్రోటీన్ సప్లిమెంట్ల కంటే సహజ మాంసాహారం, పప్పు ధాన్యాలకే ప్రాధాన్యం
కండరాల నిర్మాణానికి దోహదపడే ‘డై–ల్యూసిన్’ పెప్టైడ్ స్థాయిలను పెంచే సహజ ఆహారం
కొవ్వు తక్కువగా ఉన్న మాంసంలో కండరాల వృద్ధికి తోడ్పడే ల్యూసిన్ అమైనో ఆమ్లం అధికం
యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ పరిశోధనలో ఆసక్తికర అంశాలు
సాక్షి, అమరావతి: కండరాల పుష్టి, సిక్స్‌ప్యాక్ బాడీ కోసం యువత జిమ్‌లలో గంటల తరబడి కసరత్తులు చేస్తుంటారు. ఇందుకోసం ఖరీదైన ప్రోటీన్ పౌడర్లు, సప్లిమెంట్ డ్రింక్స్‌ను కూడా ఆశ్రయిస్తుంటారు. రోజుకు ఎన్ని గ్రాముల ప్రోటీన్ తీసుకుంటున్నామనే లెక్కలపై దృష్టి పెడుతున్నప్పటికీ.. ఆ ప్రోటీన్ ఏ ఆహారం ద్వారా అందుతోంది? శరీరం దాన్ని ఎలా జీర్ణం చేసుకుంటోంది? అనే అంశాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే కండరాల నిర్మాణానికి ప్రోటీన్ పరిమాణంతోపాటు దాని సహజ ఆహార రూపం, శరీరంలో జీర్ణమై శోషించుకునే విధానం కూడా కీలకమని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది. ఈ పరిశోధన ఫలితాలు ఇటీవల అంతర్జాతీయ జర్నల్ ‘మాలిక్యులర్ న్యూట్రిషన్– ఫుడ్ రీసెర్చ్’లో ప్రచురితమయ్యాయి.
ఐదు రకాల ఆహారాలతో పరిశోధన
ఈ అధ్యయనంలో భాగంగా రెండు రాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్స్ నిర్వహించారు. ఆరోగ్యవంతులైన యువకులకు వ్యాయామం అనంతరం ఒక్కో విభాగంలో సుమారు 20 గ్రాముల ప్రోటీన్ అందేలా ఐదు రకాల ఆహార పదార్థాలను ఇచ్చారు. తక్కువ కొవ్వు ఉన్న మాంసం, ఎక్కువ కొవ్వు ఉన్న మాంసం, బ్లాక్ బీన్స్–అన్నం, కృత్రిమ అమైనో ఆమ్లాలతో కూడిన సప్లిమెంట్ డ్రింక్, కేవలం కార్బోహైడ్రేట్లతో కూడిన పానీయం.. ఇలా ఐదు రకాల ఆహారాలను పరీక్షించారు.
అనంతరం వారి రక్త నమూనాలను సేకరించి, కండరాల పునర్నిర్మాణ ప్రక్రియకు సంబంధించిన మార్పులను విశ్లేషించారు. ఈ క్రమంలో కృత్రిమ అమైనో ఆమ్లాల సప్లిమెంట్ డ్రింక్‌తో పోలిస్తే సహజ ఆహారాలు తీసుకున్నప్పుడు రక్తంలో కండరాల నిర్మాణానికి సంబంధించిన “డై–ల్యూసిన్’ అనే పెప్టైడ్ స్థాయులు గణనీయంగా పెరిగినట్లు గుర్తించారు. ఆహారం తీసుకున్న 90 నుంచి 120 నిమిషాల మధ్య ఈ స్థాయులు గరిష్ఠానికి చేరినట్లు పరిశోధనలో వెల్లడైంది.
ఖీమా రూపంలో తీసుకుంటే జీర్ణానికి సులువు
మన దేశంలో చికెన్, మటన్‌ను ఖీమా రూపంలో వండుకుని తినడం సాధారణం. మాంసాన్ని గ్రైండ్ చేయడం వల్ల దాని కణజాల నిర్మాణం విచ్ఛిన్నమై, జీర్ణక్రియ సులభతరమయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రోటీన్ జీర్ణం, శోషణ ప్రక్రియకు సహకారం లభిస్తుంది. మరోవైపు ఎక్కువ కొవ్వు ఉన్న మాంసంతో పోలిస్తే తక్కువ కొవ్వు ఉన్న మాంసంలో ప్రోటీన్, కండరాల నిర్మాణానికి కీలకమైన ల్యూసిన్ అమైనో ఆమ్లం నిష్పత్తి అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో స్కిన్‌లెస్ చికెన్, కొవ్వు తక్కువగా ఉన్న మాంసం మంచి ఆహార ప్రత్యామ్నాయాలుగా నిలుస్తాయి.
పప్పు–అన్నంతోనూ ప్రోటీన్ ప్రయోజనాలు
ఈ పరిశోధనలో పప్పుధాన్యాలు, ధాన్యాల కలయిక కూడా కండరాల నిర్మాణానికి సంబంధించిన డై–ల్యూసిన్ స్థాయిలను మెరుగుపరచడంలో సానుకూల ఫలితాలు చూపించింది. దీంతో భారతీయ సంప్రదాయ ఆహారమైన పప్పు–అన్నం, రాజ్మా–రైస్, శనగలు–జొన్న రొట్టె వంటి ఆహార పదార్థాలు కూడా ప్రోటీన్ అవసరాలను తీర్చడంలో ఉపయోగపడతాయని స్పష్టమవుతోంది. శాకాహారులు కూడా ఇలాంటి ఆహార కలయికల ద్వారా అవసరమైన పోషకాలను పొందవచ్చు.
సప్లిమెంట్లే పరిష్కారం కాదు
జిమ్‌లో వ్యాయామాలు చేసే యువత సాధారణంగా తమ ఆహారంలో ఎన్ని గ్రాముల ప్రోటీన్ ఉందనే అంశానికే ప్రాధాన్యమిస్తుంటారు. అయితే వ్యాయామం తర్వాత సహజసిద్ధమైన ఆహారాలకు శరీరం ఎలా స్పందిస్తుందో ఈ పరిశోధన వివరిస్తోంది. కండరాల పుష్టి కోసం ఖరీదైన ప్రోటీన్ సప్లిమెంట్లపైనే ఆధారపడాల్సిన అవసరం లేదని, తక్కువ కొవ్వు ఉన్న మాంసాహారం, పప్పుధాన్యాలు, తృణధాన్యాలతో కూడిన సమతుల ఆహారం కూడా కండరాల నిర్మాణానికి తోడ్పడుతుందని పరిశోధన ఫలితాలు సూచిస్తున్నాయి.


