కోనసీమ: ధరణికి గిరి భారమా.. గిరికి తరువు భారమా.. తరువుకు కాయ భారమా.. కని పెంచే తల్లికి పిల్ల భారమా అని సినీ కవి అన్నట్టు ఏ పరిస్థితుల్లోనూ ఏ తల్లికీ బిడ్డ భారం కాదు. అదే నిరూపిస్తున్నారు మలికిపురం మండలం తూర్పుపాలెం గ్రామానికి చెందిన 32 ఏళ్ల గుమ్మడి అనంతలక్ష్మి. చిన్ననాడు వదిలేసిన చదువును కొనసాగించాలన్న తపనతో తన చంటి బిడ్డ ఆలనాపాలనా చూస్తూనే బడిబాట పట్టారు ఆమె. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి చదువుతున్న అనంతలక్ష్మి ఓ వైపు ఒడిలో చంటి బిడ్డను లాలిస్తూనే మరో వైపు చదువుల తల్లిని ఆరాధిస్తున్నారు. కుటుంబ బాధ్యతలతో చదువుకు దూరమైన ఎందరో మహిళలకు ఆమె గొప్ప స్ఫూర్తిగా నిలుస్తున్నారు. చదువుపై ఆమె తపనను చూసి పాఠశాల సిబ్బంది సైతం ప్రోత్సహిస్తున్నారు. ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ బి.చిరంజీవిరావు, అసిస్టెంట్ కో–ఆర్డినేటర్ భూపతి మనోహర్ రాజు ఆమెకు అవసరమైన పాఠ్యాంశాల బోధనలో, సందేహాల నివృత్తిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
అందరి ప్రోత్సాహంతో..
చదువుకోవాలనే ఆశయానికి ఉపాధ్యాయులు, కుటుంబం ఇస్తున్న ప్రోత్సాహం ఎంతో బలాన్నిస్తోంది. పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తాను.
– అనంతలక్ష్మి
ఇదీ చదవండి: షర్మిల వద్ద ఒక్క ఆధారమైనా ఉందా?


