న్యూఢిల్లీ: దలైలామా వారసుడి ఎంపిక వ్యవహారం అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ విషయంలో చైనా జోక్యాన్ని అడ్డుకునేందుకు అమెరికా కీలక ప్రతిపాదన చేసింది. 14వ దలైలామా తదుపరి వారసుడి ఎంపికపై భారత్‌తో ఉన్నతస్థాయి సంప్రదింపుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని అమెరికా కాంగ్రెస్ కమిషన్ సూచించింది. ఈ ప్రక్రియను చైనా అంతర్జాతీయ ఆధిపత్య పోరుగా మార్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
అమెరికా-చైనా ఆర్థిక, భద్రతా సమీక్ష కమిషన్ కాంగ్రెస్‌కు సమర్పించిన నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించింది. దలైలామా వారసుడి ఎంపిక ప్రక్రియను ప్రభావితం చేసేందుకు చైనా ఒత్తిడి వ్యూహాలను ఉపయోగించే అవకాశం ఉందని పేర్కొంది. చైనా ఎంపిక చేసిన లేదా నియమించిన వారసుడిని అమెరికా గుర్తించకూడదని సూచించింది. ఈ వ్యవహారంలో భారత్‌తో ఉన్నతస్థాయి సంప్రదింపుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని అమెరికా విదేశాంగ మంత్రికి సూచించింది. చైనా ప్రభావ కార్యకలాపాలపై నిఘా సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని పేర్కొంది. వారసత్వ ఎంపికకు సంబంధించిన వివిధ పరిణామాలపై భారత అధికారులతో చర్చలు జరపాలని తెలిపింది.
దలైలామా వారసుడి ఎంపికపై తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు, నిఘా విభాగం డైరెక్టర్, రక్షణ మంత్రి భాగస్వామ్యంతో ప్రత్యేక కసరత్తు నిర్వహించాలని కమిషన్ సూచించింది. చైనా ఎంపిక చేసిన వారసుడికి అంతర్జాతీయ గుర్తింపు లభించకుండా మిత్రదేశాలతో కలిసి దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని కోరింది. 2011లో దలైలామా ఏర్పాటు చేసిన గాదెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్‌కు తన తదుపరి పునర్జన్మను గుర్తించే పూర్తి అధికారం ఉందని నివేదిక స్పష్టం చేసింది. టిబెట్ కేంద్ర పాలనా యంత్రాంగంపై చైనా సైబర్ దాడులు, కృత్రిమ మేధ ఆధారిత తప్పుడు ప్రచారాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచాలని కూడా సూచించింది.
ఇదీ చదవండి: ఆసియాలో భారత్ దూకుడు


