14 గంటల ఉత్కంఠ.. బాలుడిని సజీవంగా రక్షించిన సిబ్బంది! | Ukraine Boy Rescued After Russian Strike | Sakshi
Sakshi News home page

14 గంటల ఉత్కంఠ.. బాలుడిని సజీవంగా రక్షించిన సిబ్బంది!

Nov 23 2026 11:28 AM | Updated on Nov 23 2026 11:40 AM

Ukraine Boy Rescued After Russian Strike

రష్యా దాడిలో కూలిన భవనం శిథిలాల కింద చిక్కుకున్న ఏడేళ్ల బాలుడిని 14 గంటల తర్వాత సజీవంగా బయటకు తీశారు. ఉక్రెయిన్‌లోని కీవ్‌ ప్రాంతంలో జరిగిన ఈ దాడుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. బాలుడితో పాటు 79 ఏళ్ల వృద్ధురాలిని కూడా సహాయక సిబ్బంది ప్రాణాలతో రక్షించారు.

కీవ్‌ ప్రాంతంలోని డైమర్‌ పట్టణంపై ఆదివారం తెల్లవారుజామున రష్యా దాడులు చేసింది. ఈ ఘటనలో ఓ నివాస భవనం కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న ఏడేళ్ల బాలుడిని 14 గంటల తర్వాత సజీవంగా బయటకు తీశారు. అతడిని ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు. బాలుడి ప్రాణాలు కాపాడిన సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు.

అదే భవనం శిథిలాల నుంచి 79 ఏళ్ల వృద్ధురాలిని కూడా సజీవంగా రక్షించారు. ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ దాడిలో ఆరుగురు గాయపడగా.. మరికొందరి ఆచూకీ తెలియాల్సి ఉందని కీవ్‌ ప్రాంతీయ అధికారి టిమూర్‌ త్కాచెంకో తెలిపారు.

మరోవైపు బిలా సెర్క్వా పట్టణంలోని ఓ ప్రైవేటు ఇంటిపై జరిగిన దాడిలో ఒకరు మరణించగా.. భవనంలో మంటలు చెలరేగాయి. అలాగే కీవ్‌ ప్రాంతంలోని విష్నేవే పట్టణంలో ఓ కిరాణా దుకాణంపై జరిగిన దాడిలో ముగ్గురు మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు ఆ పట్టణ మేయర్‌ ఇల్యా డికోవ్‌ తెలిపారు.

ఘటనాస్థలిలో 130 మందికి పైగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీ తెలిపారు. ప్రతి ఒక్కరి వివరాలు పూర్తిగా తెలుసుకునే వరకు సహాయక చర్యలు కొనసాగిస్తామని చెప్పారు. నిరంతరం వైమానిక దాడుల హెచ్చరికలు రావడం, మళ్లీ దాడులు జరిగే ముప్పు ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

అలాగే ఆదివారం సాయంత్రం నాటికి ఉక్రెయిన్‌లోని 10 ప్రాంతాలపై 70కి పైగా దాడులు జరిగాయని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి ఇవాన్‌ విహివ్స్కీ తెలిపారు. డ్నిప్రోపెట్రోవ్స్క్‌ ప్రాంతంలోని విద్యుత్‌ ఉపకేంద్రంపైనా రష్యా దాడి చేసినట్లు ప్రధాని సెర్గీ కొరెట్స్కీ వెల్లడించారు. అయితే, 2022లో ఉక్రెయిన్‌పై రష్యా పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: సైబర్‌ ముప్పు.. ట్రంప్‌ కీలక నియామకం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement