శిలాజ ఇంధనాలపై పట్టు వీడని దేశాలు.. COP31లో ప్రతిష్టంభన! | COP31 Climate Talks Deadlock | Sakshi
Sakshi News home page

శిలాజ ఇంధనాలపై పట్టు వీడని దేశాలు.. COP31లో ప్రతిష్టంభన!

Nov 22 2026 6:01 AM | Updated on Nov 22 2026 6:03 AM

COP31 Climate Talks Deadlock

ప్రపంచాన్ని వేడెక్కిస్తున్న కర్బన ఉద్గారాల తగ్గింపుపై దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. చమురు, గ్యాస్‌, బొగ్గు వినియోగాన్ని తగ్గించే అంశంపై తీవ్ర విభేదాలు తలెత్తడంతో టర్కీలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు (COP31) ప్రతిష్టంభనలో పడింది. గడువు దాటి ఒకరోజుకు పైగా చర్చలు సాగినా ఒప్పందం కుదరకపోవడంతో చర్చలను రాత్రికి వాయిదా వేశారు.

తాజా ఒప్పంద ముసాయిదాలో శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించే ప్రస్తావన లేకపోవడంపై యూరోపియన్ యూనియన్ (ఈయూ), పసిఫిక్ దీవుల దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. చమురు, గ్యాస్‌, బొగ్గు వినియోగం నుంచి క్రమంగా బయటపడేందుకు స్పష్టమైన హామీ ఉండాలని పట్టుబడుతున్నాయి. మరోవైపు, వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆఫ్రికా దేశాలకు మరిన్ని నిధులు అందించాలని డిమాండ్ చేస్తోంది.

చమురు ఉత్పత్తి దేశాల ఒత్తిడితో శిలాజ ఇంధనాల ప్రస్తావనను ముసాయిదా నుంచి తొలగించడంపై పనామా, సోలమన్ దీవులు, ఐవరీ కోస్ట్‌, ఈయూ దేశాలు మండిపడుతున్నాయి. శిలాజ ఇంధనాల ప్రస్తావన లేని ఒప్పందాన్ని అంగీకరించేది లేదని పనామా పర్యావరణ మంత్రి జువాన్ కార్లోస్ నవారో స్పష్టం చేశారు. కర్బన ఉద్గారాలను భూగర్భంలో నిల్వ చేసే సాంకేతికత పేరుతో చమురు, గ్యాస్ వినియోగాన్ని కొనసాగించకూడదని ఫ్రాన్స్ మంత్రి మొనీక్ బార్బుట్ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్న లక్ష్యం చేజారినట్లు తొలిసారిగా ఒప్పందంలో ప్రస్తావించే అవకాశం ఉంది. దీంతో ప్రపంచం ‘ఓవర్‌షూట్‌’ దశలోకి ప్రవేశిస్తున్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సముద్ర మట్టాల పెరుగుదల, తీవ్రమైన వేడి కారణంగా లక్షలాది మంది ప్రజలు ముప్పును ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఈ సదస్సు ప్రధానంగా అమలు చర్యలపై దృష్టి పెట్టాలని, స్వచ్ఛమైన ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాలని ఆస్ట్రేలియా మంత్రి క్రిస్ బోవెన్ అభిప్రాయపడ్డారు.

అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అందించే నిధుల విషయంలోనూ వివాదం నెలకొంది. గత ముసాయిదాలో 2035 నాటికి అనుకూలన చర్యలకు 120 బిలియన్ డాలర్ల నిధులు పెంచే ప్రతిపాదన ఉండగా.. తాజా పత్రంలో ఆ మొత్తాన్ని తొలగించారు. దీంతో ఆఫ్రికా దేశాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఆదివారం స్వదేశాలకు వెళ్లాల్సిన ప్రతినిధులు తమ ప్రయాణాలను సోమవారానికి మార్చుకుంటున్నారు. ఏకాభిప్రాయం కుదరకపోతే సదస్సును వాయిదా వేసి వచ్చే ఏడాది తిరిగి నిర్వహించే పరిస్థితి ఏర్పడవచ్చని తెలుస్తోంది. 1995 నుంచి జరుగుతున్న వాతావరణ సదస్సుల్లో ఇలాంటి పరిణామం ఒక్కసారి మాత్రమే చోటుచేసుకుంది. చర్చల తీరుపై పర్యావరణ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ సదస్సును అత్యంత దారుణమైనదిగా విమర్శిస్తున్నారు.

ఇదీ చదవండి: పన్నూ హత్యకు కుట్ర కేసు..  దోబల్‌కు అమెరికా కోర్టు సమన్లు జారీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement