యూరప్‌ దేశాల్లో ఆగని నిరసనలు... | Europe Protests Italy Workers Students Strike | Sakshi
Sakshi News home page

యూరప్‌ దేశాల్లో ఆగని నిరసనలు...

Nov 21 2026 4:47 AM | Updated on Nov 21 2026 4:47 AM

Europe Protests Italy Workers Students Strike

శుక్రవారం ఇటలీలోని రోమ్‌ నగరంలో నిరసనకారుల భారీ ర్యాలీ

ఇటలీలోని 100 నగరాల్లో ఆందోళనలు

పలు చోట్ల నిలిచిన అత్యవసర సేవలు

క్రొయేషియా, జర్మనీ, ఆస్ట్రియాలోనూ నిరసనలు

రోమ్‌: అధిక ధరలు, పెరుగుతున్న రోజువారీ వ్యయాలు, చాలీచాలని వేతనాలు, పెరుగుతున్న సైనిక వ్యయాలు, విద్యపై తగ్గుతున్న పెట్టుబడులు వంటి అంశాలపై యూరప్‌ నగరాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం విద్యార్థులు, కార్మికులు ఇటలీ వ్యాప్తంగా వీధుల్లోకి తరలివచ్చారు. మిలాన్, ట్యురిన్‌ మొదలు నేపుల్స్, పలెర్మో, రోమ్‌ వరకు దాదాపు 100 నగరాల్లో ప్రదర్శనలు నిర్వహించారు. 

కార్మికులకు ఉద్యోగ భద్రత, ప్రజా సేవల బలోపేతం వంటి అంశాల్లో ప్రభుత్వం విఫలమైందంటూ వారు ధ్వజమెత్తారు. ఇటలీలో ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ కార్మికులు నిరసనల్లో పాల్గొన్నారు. ప్రజా రవాణా వ్యవస్థలు స్తంభించాయి. స్కూలు, ఆస్పత్రులు పనిచేయలేదు. ఆదివారం విధుల్లో పాల్గొనరాదని మిలాన్, వెనిస్‌ ఎయిర్‌పోర్టుల విమానరంగ సిబ్బంది నిర్ణయించారు.

విద్యార్థులు, కార్మికుల నిరసనలకు ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో కనీసం పది లక్షల మంది పాల్గొన్నట్లు ప్రధాన కార్మిక సంఘం సీజీఐఎల్‌ ప్రధాన కార్యదర్శి మౌరిజియో లాండిని చెప్పారు.  ‘కూడళ్లు నిండిపోయాయి, అన్ని తరాల ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఇది విభజించే రోజు కాదు, ప్రజలను ఐక్యం చేసే రోజు’అని లాండిని అన్నారు.

శుక్రవారం క్రొయేషియాలోనూ కనీసం డజను నగరాల్లో విద్యార్థులు తరగతులను బహిష్కరించి, ర్యాలీలు చేపట్టారు. సైనిక వ్యయానికి బదులుగా విద్య, గృహ నిర్మాణం, ప్రజా సేవలకు బడ్జెట్‌ను పెంచాలని డిమాండ్‌ చేశారు. ఆ్రస్టియాలో యూనివర్సిటీ ఆఫ్‌ వియన్నా వద్ద వందలాది మంది కూడా విద్యపై ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ పెట్టాలని కోరారు. విద్యార్థులు బాహీబాహీకి దిగడంతో పోలీసులు వారిని పెప్పర్‌ స్ప్రేతో చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నిర్బంధ సైనిక శిక్షణ ప్రతిపాదనను విరమించుకోవాలంటూ జర్మనీ వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనకు దిగారు.

ఇదీ చదవండి: పోలాండ్‌లో కూలిన రష్యా క్షిపణి.. నాటో అప్రమత్తం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement