‘గేమ్‌ ఆడండి.. మీ జీవితంతో ఆడుకోవద్దు’ | On GTA-6 US Police Warn Fans | Sakshi
Sakshi News home page

‘గేమ్‌ ఆడండి.. మీ జీవితంతో ఆడుకోవద్దు’

Nov 20 2026 11:56 PM | Updated on Nov 20 2026 11:56 PM

On GTA-6 US Police Warn Fans

వీడియో గేమ్‌లో చేసే పనులు నిజ జీవితంలోనూ చేస్తే కటకటాల వెనక్కి వెళ్లాల్సి వస్తుందని అమెరికా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్‌ సంపాదించిన ‘గ్రాండ్‌ తెఫ్ట్‌ ఆటో (జీటీఏ) 6’ గేమ్‌ విడుదల నేపథ్యంలో పలు పోలీసు విభాగాలు సోషల్‌ మీడియాలో వినూత్న సందేశాలు ఇచ్చాయి. ‘గేమ్‌ ఆడండి.. మీ జీవితంతో ఆడుకోవద్దు’ అంటూ అట్లాంటా పోలీసులు సూచించారు.

జీటీఏ 6లో కార్ల దొంగతనాలు, వీధుల్లో రేసింగ్‌, కాల్పులు వంటి నేరాలకు అవకాశం ఉంటుంది. అయితే నిజ జీవితంలో ఇలాంటి పనులు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని డెన్వర్‌ పోలీసులు హెచ్చరించారు. పోలీసుల నుంచి పారిపోవడం కూడా నేరమేనని స్పష్టం చేశారు. అదనపు పాయింట్ల కోసం ఎవరిపైనా దాడి చేయడం సమంజసం కాదని శాన్‌ ఆంటోనియో పోలీసులు వీడియో ద్వారా కోరారు.

ఈ క్రమంలో గేమ్‌ విడుదలైన వారంలోనే ప్రపంచవ్యాప్తంగా 2 కోట్లకు పైగా కాపీలు అమ్ముడైనట్లు సమాచారం. అమెరికాలో 13 ఏళ్ల విరామం తర్వాత జీటీఏ సిరీస్‌లో కొత్త గేమ్‌ రావడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. స్కూల్స్‌, ఉద్యోగాలకు సెలవులు పెట్టి మరీ గేమ్‌ ఆడుతున్నవారిపై వార్తలు వస్తున్నాయి.

అయితే వీడియో గేమ్స్‌లో హింస యువతపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. హింసాత్మక గేమ్స్‌ యువతను నేరాలవైపు ప్రేరేపిస్తాయా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఫాక్స్‌ న్యూస్‌ వ్యాఖ్యాతలు సైతం ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు అమెరికన్‌ సైకలాజికల్‌ అసోసియేషన్‌ (ఏపీఏ) ప్రకారం.. హింస అనేది అనేక కారణాలతో ముడిపడిన సంక్లిష్ట సామాజిక సమస్య. వీడియో గేమ్స్‌ వల్లే హింస పెరుగుతోందని చెప్పడం శాస్త్రీయంగా సరైనది కాదని పేర్కొంది. అయితే హింసాత్మక గేమ్స్‌కు దూకుడు ప్రవర్తన, నైతిక నిర్ణయాలపై ప్రభావం ఉండే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. మొత్తానికి గేమ్‌లోని క్రైమ్‌.. నిజ జీవితంలో నేరంగా మారకూడదన్న పోలీసుల హెచ్చరికలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

ఇదీ చదవండి: పోలాండ్‌లో కూలిన రష్యా క్షిపణి.. నాటో అప్రమత్తం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement