తిరువనంతపురం: శబరిమల దర్శనం కోసం వర్చువల్ క్యూ స్లాట్లను పెద్దమొత్తంలో బుక్ చేసి, ఆ తర్వాత రద్దు చేస్తున్న వ్యవహారంపై ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) సైబర్ ఫోరెన్సిక్ నిపుణుల సహాయం కోరింది. బుకింగ్‌ల వెనుక ఉన్న అసలు కారణాలను గుర్తించేందుకు బోర్డు దర్యాప్తును వేగవంతం చేసింది.
గురువారం నాడు సుమారు 66,000 మంది భక్తులు వర్చువల్ క్యూ స్లాట్లు బుక్ చేసుకోగా,పంబా ద్వారా దర్శనానికి వచ్చిన వారి సంఖ్య కేవలం 40,064 మాత్రమేనని గణాంకాలు వెల్లడించాయి. దీంతో బుకింగ్‌లు చేసుకున్న వారికీ, వాస్తవంగా దర్శనానికి వచ్చిన వారికీ మధ్య దాదాపు 26,000 స్లాట్ల వ్యత్యాసం ఏర్పడింది.
ఈ భారీ వ్యత్యాసంపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు బల్క్ బుకింగ్‌లు, రద్దుల వెనుక ఉన్న ఐపీ చిరునామాలను పరిశీలించనున్నారు. అలాగే బహుళ బుకింగ్‌లు చేసేందుకు ఆటోమేటెడ్ బాట్లు, వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తున్నారా అనే కోణంలోనూ విచారణ జరగనుంది.
కొన్ని ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలు ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభమైన వెంటనే పలువురి ఆధార్ వివరాలతో అనేక స్లాట్లను ముందుగానే బుక్ చేసుకుంటున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తర్వాత ప్యాకేజీల కోసం సంప్రదించే భక్తులకు అనుగుణంగా పాత బుకింగ్‌లను రద్దు చేసి, కొత్త భక్తుల ఆధార్ వివరాలు, ఫొటోలతో నమోదు చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఏజెన్సీలను సంప్రదించే భక్తుల సంఖ్య తక్కువగా ఉన్న రోజుల్లో ఇలాంటి స్లాట్లు నిరుపయోగంగా మిగిలిపోతున్నాయని భావిస్తున్నారు.
మరోవైపు, భక్తుల సంఖ్య తక్కువగా ఉన్న దృష్ట్యా నవంబర్ 30 వరకు వర్చువల్ క్యూ కోటాను 5,000 స్లాట్లు పెంచారు. బుకింగ్ సరళిని బట్టి దశలవారీగా మరిన్ని స్లాట్లు విడుదల చేయడంతో పాటు స్పాట్ బుకింగ్ సౌకర్యాలను కూడా పెంచాలని బోర్డు యోచిస్తోంది.
మండల సీజన్ ప్రారంభంలో గతంలో కంటే భక్తుల రాక తక్కువగా ఉండటం పట్ల భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తులమాస పూజల సమయంలోనూ ఆన్‌లైన్ బుకింగ్‌కు ఉంచిన 400 గదుల్లో అధిక భాగం ట్రావెల్ ఏజెన్సీల పరమయ్యాయనే విమర్శలు వచ్చాయి. తమిళనాడుకు చెందిన ఏజెన్సీలు 40–50 మంది భక్తులతో బస్సు, దర్శనం, సన్నిధానం వసతి ప్యాకేజీలు నిర్వహిస్తుండగా, ఎర్నాకుళంలోని ఏజెన్సీలపైనా గది బుకింగ్‌లలో అవకతవకల అనుమానాలు ఉన్నాయి. బుకింగ్ వ్యవస్థ దుర్వినియోగం కాకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తామని బోర్డు అధికారులు తెలిపారు.


