బీజేపీకి గుడ్‌బై చెప్పిన మాజీ సీఎం కుమార్తె | Padmaja Venugopal quits BJP calls decision to join party a mistake | Sakshi
Sakshi News home page

బీజేపీకి గుడ్‌బై చెప్పిన మాజీ సీఎం కుమార్తె

Nov 19 2026 5:08 PM | Updated on Nov 19 2026 5:12 PM

Padmaja Venugopal quits BJP calls decision to join party a mistake

Padmaja Venugopal quits BJP కాంగ్రెస్ దిగ్గజ నాయకుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి దివంగత కె. కరుణాకరన్ కుమార్తె పద్మజ వేణుగోపాల్ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. బీజేపీ చేరిన రెండున్నరేళ్ల తరువాత ఆమె  ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అంతేకాదు  బీజేపీలో చేరాలనే తన నిర్ణయం  తొందరపాటులో చేసిన పొరపాటు అని  పేర్కొన్నారు.

పీటీఐ  కథనం ప్రకారం "నేను రాజీనామా చేశాను. కానీ నేను రాజీనామా చేసిన విషయం చాలా మందికి తెలియదు. నేను ఎవరికీ చెప్పలేదు" అని పద్మజా  వేణుగోపాల్‌ వెల్లడించారు. సరిగ్గా ఆలోచించకుండానే తాను కాషాయ పార్టీలో చేరానని, ఇప్పుడు తన తప్పును సరిదిద్దుకునే సమయం ఆసన్నమైందని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.  బీజేపీలో ఎవరిపైనా తనకెలాంటి ఫిర్యాదులు లేవని, ఆ నిర్ణయం పూర్తిగా తన సొంత పొరపాటేనని స్పష్టం చేశారు.

మళ్లీ కాంగ్రెస్‌లోకి ?
ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె మళ్లి  కాంగ్రెస్‌ గూటికే చేరే అవకాశం ఉందని  తెలుస్తోంది.  ఈ అంశంపై అధికారిక ప్రకటన ఏదీ లేనప్పటికీ పద్మజ, కాంగ్రెస్ నేతల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

స్వాగతించిన  కాంగ్రెస్‌ 
ఏషియానెట్ న్యూస్‌ ప్రకారం బీజేపీని వీడిన పద్మజను కాంగ్రెస్‌లోకి కేపీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ స్వాగతించారు. తమ నాయకుడి కుమార్తె కాంగ్రెస్‌లోకి రావడం పట్ల సన్నీ జోసెఫ్ సంతోషం ప్రకటించారు. పద్మజ వేణుగోపాల్ బీజేపీని వీడటం ఒక మంచి నిర్ణయమని సన్నీ జోసెఫ్ అన్నారు. పద్మజ కాంగ్రెస్‌లోకి తిరిగి రావాలని కోరుకుంటున్నారని అర్థమవుతోందని ఆయన చెప్పారు. దీనిని తాను పూర్తిగా స్వాగతిస్తున్నానన్నారు.

బీజేపీ స్పందన
పద్మజ రాజీనామా దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుకేకే అనీష్ కుమార్ స్పందించారు. తనకు పద్మజతో మంచి సంబంధాలు ఉన్నాయని, ఆమెపై ఎలాంటి ఫిర్యాదులు  లేవన్నారు. అలాగే పద్మజ రాజీనామా బీజేపీపై ఎలాంటి ప్రభావం  ఉండదన్నారు.  

కాగా కాంగ్రెస్ రాష్ట్ర విభాగంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు పద్మజ బీజేపీలో చేరారు. గతంలో ఆమె కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2016,  2021 అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలోని త్రిసూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన పద్మజ రెండుసార్లు ఓటమి పాలయ్యారు. తన ఓటమికి పార్టీ అంతర్గత రాజకీయాలే కారణమని ఆరోపించిన ఆమె, తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారిపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అప్పట్లో విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement