సాక్షి, న్యూఢిల్లీ: తాము ఉద్యోగుల ఆదాయానికి పన్ను మినహాయింపు కల్పించామని చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మరి మీరు ఉద్యోగుల జీతాలు పెంచారా? కొత్తగా ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారని పారిశ్రామికవేత్తలను సూటిగా ప్రశ్నించారు. తాజాగా ఎఫ్ఐసీసీఐ (FICCI) శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
2014లో 30 శాతంగా ఉన్న కార్పొరేట్ పన్నును తాము 22 శాతానికి తగ్గించామని, రూ.12 లక్షల వరకు ఆదాయంపై పన్ను భారం కూడా లేకుండా చేశామని మోదీ గుర్తుచేశారు. ప్రభుత్వం ఇంతటి రాయితీలు కల్పిస్తే పరిశ్రమలు కూడా ఉద్యోగుల జీతాలు పెంచి, కొత్త నియామకాలు చేపట్టాలని సూచించారు.
అనంతరం పన్ను మినహాయింపులతో ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా పెరిగిందని చెప్పారు. గతంలో ఆదాయపు పన్ను రిటర్నుల ప్రాసెసింగ్‌కు నెలల సమయం పట్టేదని, అయితే ఇప్పుడు మాత్రం అది వారంలోపే పూర్తవుతోందని ఆయన పేర్కొన్నారు.
అంతేకాదు భారత పరిశ్రమలు దేశీయ మార్కెట్‌కే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా పోటీపడాలని మోదీ పిలుపునిచ్చారు. దిగుమతులపై మాత్రమే ఆధారపడటాన్ని తగ్గించి, స్వదేశీ తయారీని పెంచాలని సూచించారు. ఇప్పటికే ఫార్మా రంగంలో ఔషధాల తయారీలో భారత్ బలంగా ఉన్నప్పటికీ, వాటి తయారీకి అవసరమైన ముడి పదార్థాలను మాత్రం దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని మోదీ అన్నారు.
భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని, అక్టోబర్‌లో వస్తు ఎగుమతులు దాదాపు 50 బిలియన్ డాలర్లకు చేరాయని ఆయన తెలిపారు. 'వికసిత్ భారత్ అనేది నినాదం కాదు.. అదొక నిబద్ధత' అని మోదీ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: చైనాపై మేమూ గూఢచర్యం చేస్తున్నాం: ట్రంప్


